రూ.కోట్లు దండుకుని ఉద్యోగానికి డుమ్మా
పూటకో మాట మారుస్తూ దబాయిస్తున్న వైనం
ఎంతోమందిని మోసం చేసిన సీఎస్‌డీటీ అశోక్
తన ఇలాకాలో పోస్టింగ్ ఇవ్వాలని మంత్రి సవిత సిఫారసు
పనులు చేయిస్తానని భారీగా వసూలు
ఏళ్ల తరబడి విధులకు గైర్హాజరు
సాక్షి, పుట్టపర్తి: అనంతపురం నగరానికి చెందిన కె.అశోక్‌కుమార్ పౌర సరఫరాల విభాగంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తూ.. 2022 నుంచి మెడికల్ లీవ్‌లో ఉన్నారు. అక్రమార్జనకు అలవాటు పడిన ఆయన అమాయకులను మోసగించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయిస్తానని, భూములు రాయిస్తానని ఎంతోమంది రైతులను నమ్మించి రూ.కోట్లలో దండుకున్నారు. ఉద్యోగానికి వెళ్తే డబ్బిచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు ఉంటాయని భావించి డ్యూటీకి వెళ్లకుండానే కాలం గడిపేస్తున్నారు.
అంతటితో ఆగకుండా పెళ్లిళ్ల పేరయ్య అవతారమెత్తారు. అలాంటి అధికారికి పెనుకొండ నియోజకవర్గంలోని ఏదో ఒక మండలంలో పోస్టింగ్ ఇవ్వాలని మంత్రి సవిత సిఫారసు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం అశోక్‌కుమార్ అనంతపురం జిల్లాలోని రొళ్ల, అగళి, పరిగితో పాటు వివిధ మండలాల్లో సీఎస్‌డీటీగా పని చేశారు. 2022 నుంచి మెడికల్ లీవ్‌లో ఉన్నారు. తాను పనిచేసిన ప్రాంతాల్లో పలువురికి మాయమాటలు చెప్పి రూ.కోట్లలో దండుకున్నారు.
అనంతపురం గుల్జార్‌పేటకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.2 లక్షలు, కోర్టు రోడ్డుకు చెందిన మరో వ్యక్తి నుంచి రూ.3 లక్షలు, తాడిపత్రిలో రూ.8 లక్షలు, కమ్మవారిపల్లిలో రూ.15 లక్షలు, కుంటిమద్దికి చెందిన వ్యక్తి నుంచి రూ.15 లక్షలు, కర్నూలులో రూ.3.5 లక్షలు, నార్పలలో రూ.5 లక్షలు.. ఇలా సుమారు 27 మంది నుంచి రూ.3 కోట్ల వరకు తీసుకున్నారు. కొందరి నుంచి అప్పుగా తీసుకోగా.. మరికొందరికి ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయిస్తానని నమ్మబలికి వసూలు చేశారు. పనులు చేయించకపోగా.. డబ్బు కూడా తిరిగివ్వలేదు. బాధితులు డబ్బు అడిగితే రేపుమాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. తమ ఫోన్ నంబర్లు సైతం బ్లాక్ లిస్టులో పెడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి ఇలాకాలో పోస్టింగ్ కోసం..
రూ.కోట్లు దండుకుని బాధితులను ఇబ్బంది పెడుతున్న సీఎస్‌డీటీ అశోక్‌కుమార్ చికిత్స కోసం బెంగళూరు వెళ్లి వచ్చేందుకు అనుకూలంగా ఉంటుందని, అతడికి రొద్దం, సోమందేపల్లి, గోరంట్ల, పరిగి, పెనుకొండ మండలాల్లో ఏదో ఒకచోట పోస్టింగ్ ఇవ్వాలని ఉన్నతాధికారులకు విన్నవించారు. అయితే, ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో మంత్రి సవితతో సిఫారసు చేయించుకున్నారు.


