అది ఉత్తుత్తి కథనం.. భ్రమలో రామోజీ! ‘ఈనాడు’ రోత రాతలు

Eenadu Fake News On Crop Insurance - Sakshi

పంటల బీమాపై వాస్తవాలు కప్పిపుచ్చుతూ ‘ఈనాడు’ రోత రాతలు

ఊళ్లు తిరుగుతున్న తండ్రీకొడుకులకు మాటల సరుకు

రైతులను గందరగోళ పరిచి లబ్ధి పొందాలనే వ్యూహం

2014–15లో 6.39 లక్షల హెక్టార్లకే బీమా

2021–22లో 54.95 లక్షల హెక్టార్లలో పంటలకు బీమా 

2016 నుంచి మిరప పంటకు వాతావరణం ఆధారంగానే బీమా వర్తింపు

ఇప్పుడే కొత్తగా వర్తింప చేస్తున్నట్టుగా రామోజీ గగ్గోలు

కల్తీవిత్తనాలు, గులాబీ తెగులుతో నష్టపోయిన పత్తి రైతులకు పైసా విదల్చని బాబు

అప్పట్లో సింగిల్‌ కాలమ్‌ వార్త కూడా రాయని ఈనాడు

టీడీపీ ఐదేళ్లలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల పరిహారం

ఈ మూడున్నరేళ్లలోనే 44.28 లక్షల మందికి రూ.6,684.84 కోట్ల పరిహారం

9 రెట్లు పెరిగిన బీమా కవరేజ్‌.. 22 రెట్లు పరిహారం 

సాక్షి, అమరావతి: ఒకే అబద్ధాన్ని పదే పదే చెబితే అదే నిజమని ప్రజలు నమ్మేస్తారనే భ్రమలో రాజగురువు రామోజీ తప్పుడు కథనాలను వండి వార్చడమే పనిగా పెట్టు­కున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతుంటే నిత్యం విషం కక్కుతూ చంద్రబాబుకు మేలు చేయడమే అజెండాగా పెట్టుకుంది ఈనాడు.

డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రైతులపై పైసా భారం పడకుండా ప్రభుత్వం అమలు చేస్తోంటే.. రైతుల్లో అపోహలు సృష్టించేందుకు ‘ఉచిత బీమా ఉత్తిదే’ అంటూ శనివారం ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. తండ్రీకొడుకులు ఊరూరూ తిరుగుతున్న నేపథ్యంలో వారు మాట్లాడటానికి సరుకు అందిస్తూ ఇలా దిగజారుడు కథనాలను అచ్చేస్తోంది.

ఆరోపణ : పంట అంతటికీ బీమా లేదు
వాస్తవం: నోటిఫై చేసిన పంటలకు గాను సాగు చేసిన ప్రతీ ఎకరాకు ఈ–క్రాప్, ఈ–కేవైసీ ప్రామాణికంగా 2020 ఖరీఫ్‌ నుంచి ప్రభుత్వం ఉచిత పంటల బీమా అమలు చేస్తోంది. ఆ సీజన్‌ మళ్లీ ప్రారంభం కాకముందే నష్టపోయిన ప్రతి ఎకరాకు, ప్రతి రైతుకు పరిహారం అందిస్తోంది. పంటల బీమా అమలులో ఎలాంటి కోతల్లేకుండా యూనివర్సల్‌ కవరేజ్‌ కల్పిస్తోన్న మొట్టమొదటి రాష్ట్రంగా ఏపీ నిలిచిందని వివిధ వేదికలపై కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఏపీని మోడల్‌గా తీసుకోవాలని పదేపదే చెబుతున్నారు. ఇప్పటికే ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీని మోడల్‌గా తీసుకొని తమ రాష్ట్రాల్లోని రైతులందరికీ పూర్తి స్థాయిలో బీమా రక్షణ కల్పించే దిశగా అడుగులేస్తున్నాయి. 

ఆరోపణ : అంచనా అంతుపట్టట్లేదు
వాస్తవం: పంటల బీమా నమోదు గతంలో చాలా సంక్లిష్టంగా, ప్రీమియం చెల్లింపు భారంగా ఉండేది. కనీస అవగాహన, ఆర్థిక స్థోమత లేక నిర్ధారించిన గడువులోగా ప్రీమియం చెల్లించలేక లక్షలాది మంది రైతులు పంటల బీమాకు దూరంగా ఉండే వారు. చేయించుకున్న వారు పరిహారం కోసం అధికారులు, బీమా కంపెనీల చుట్టూ ఏళ్ల తరబడి ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. ఈ పరిస్థితిలో మార్పు తేవాలన్న దృఢ సంకల్పంతో తీసుకొచ్చిందే డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం.

గతంలో ఎన్నడూ లేని విధంగా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ లబ్ధిదారుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. అభ్యంతరాలు స్వీకరించి అర్హత ఉన్న ప్రతి రైతుకు పరిహారం అందేలా ఏర్పాట్లు చేశారు. 2014–15లో కేవలం 6.39 లక్షల హెక్టార్లలో సాగైన పంటలకు మాత్రమే బీమా కవరేజ్‌ కల్పిస్తే, 2021–22లో ఏకంగా 54.95 లక్షల హెక్టార్లలో సాగైన పంటలకు పూర్తి స్థాయిలో బీమా వర్తింప చేశారు.

పరిహారం చెల్లింపు విషయాన్ని పరిశీలిస్తే 2014–15లో కేవలం 1.03 లక్షల మందికి రూ.132.24 కోట్లు చెల్లిస్తే, 2021–22లో ఏకంగా 15.61 లక్షల మందికి రూ.2,977.82 కోట్ల పరిహారం చెల్లించారు. ఇందులో గత ప్రభుత్వం 6.19 లక్షల మందికి ఎగ్గొట్టిన రూ.715.48 కోట్లు కూడా ఉంది. 2014–19 మధ్య 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్లు చెల్లిస్తే, 2019–22 మధ్య 44.28 లక్షల మందికి రూ.6,684.84 కోట్ల బీమా పరిహారం రైతులకు అందజేశారు. ఈ లెక్కన 2014–15తో పోల్చుకుంటే  బీమా కవరేజ్‌ తొమ్మిది రెట్లు పెరగ్గా, పరిహారం చెల్లింపు ఏకంగా 22 రెట్లు పెరిగింది.  

ఆరోపణ : ఈ ప్రభుత్వం నిబంధనలు మార్చింది
వాస్తవం: పంటల బీమా అమలు కోసం ఏటా ఖరీఫ్, రబీ సీజన్లకు ముందుగానే టెక్నికల్‌ కమిటీ సూచనల మేరకు మార్గదర్శకాలను రూపొందిస్తారు. వాటికనుగుణంగా జిల్లాల వారీగా ఎంపిక చేసిన పంటలకు దిగుబడి, వాతావరణ ఆధారంగా నోటిఫై చేస్తారు. దిగుబడి ఆధారంగా నోటిఫై చేసిన పంటలకు పంట కోత ప్రయోగాల ద్వారా వచ్చే వాస్తవ దిగుబడులు ఆధారంగా నష్టాన్ని అంచనా వేసి ఆ మేరకు పరిహారం చెల్లిస్తుంటారు.

ఇక వాతావరణం ఆధారంగా నోటి­ఫై చేసిన పంటలకు నిర్ణీత గడువులోగా వాతా­­వరణ అంశాల హెచ్చు తగ్గుదల ఆధా­రంగా నష్టాన్ని అంచనా వేసి ఆ మేరకు బీమా పరిహారం చెల్లిస్తుంటారు. 15 ఏళ్లుగా ఇదే విధానం కొనసాగుతోంది. మిరప పంట విషయానికి వస్తే 2016 నుంచి వాతా­వరణ బీమా వర్తింప చేస్తున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఇదే రీతిలో బీమా కవరేజ్‌ కల్పిస్తున్నారే తప్ప ఈ ప్రభు­త్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఎలాంటి మార్పు­లు తీసుకురాలేదు. ఆ మేరకు గడి­చిన సీజన్‌లో వైపరీత్యాలతో పాటు నల్లతా­మర పురుగు ప్రభావం వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించారు.  

నాటి సంగతేమిటి రామోజీ
టీడీపీ హయాంలో కల్తీ విత్తనాలు, గులాబీ తెగులు ప్రభావంతో ఏటా లక్షలాది మంది పత్తి రైతులు నష్ట పోయినా ఏనాడు ప్రభుత్వ పరంగా పైసా పరిహారం విదిల్చిన దాఖలాలు లేవు. నాడు రైతుల వెతలపై ఈనాడు సింగిల్‌ కాలమ్‌ రాసిన పాపానపోలేదు. ఇప్పుడేదో రైతులకు అన్యాయం జరిగి పోయిందంటూ గగ్గోలు పెట్టడం విస్మయానికి గురిచేస్తోంది.

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనతో అనుసంధానం చేసి.. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్‌ 2023–24 సీజన్‌ నుంచి వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్గదర్శకాల రూపకల్పన కోసం జిల్లాల వారీగా 2023–24 సీజన్‌కు ఎంపిక చేసిన పంటలకు బీమా కవరేజ్‌ కోసం ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.

రాష్ట్ర స్థాయి కమిటీ మార్గదర్శకాలను అనుసరించి అత్యధిక విస్తీర్ణానికి బీమా రక్షణ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందు కెళ్తోంది. ఇలా నష్టపోయిన ప్రతి ఎకరాకు, ప్రతి రైతును ఆదుకోవడమే లక్ష్యంగా చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే రైతులను గందరగోళ పర్చేలా విషపురాతలు రాయడం చంద్రబాబు మేలు కోసమేనని ఎవరికి తెలియదు? 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top