బుల్లి చేపలతో భలే మేలు! | Sakshi
Sakshi News home page

బుల్లి చేపలతో భలే మేలు!

Published Mon, May 27 2024 5:38 AM

eat fish for healthy

సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షు

గుండె జబ్బుల నియంత్రణకు దివ్య ఔషధం కవళ్లు గర్భిణులకు బలవర్ధకమైన ఆహారం నెత్తళ్లు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదారోళ్లు తిండి పెట్టి చంపేస్తారురా బాబూ అంటుంటారు. గోదావరి తీరంలో లభించే రుచికరమైన చేపలు అటువంటివి మరి. ఒకప్పుడు ముక్క లేనిదే ముద్ద  దిగదనే నానుడి గోదావరి జిల్లాలకే ప్రత్యేకం. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈబాపతు జనం పెరిగిపోయారు. అందులోనూ చేపలు దొరకాలే కానీ ఎంతటి వారైనా ఇట్టే లొట్టలేసుకుని లాగించేస్తున్నారు. గోదావరిలో దొరికే పండుగప్ప, కొయ్యింగ, కొరమేను, సీజనల్‌గా ఆగస్టులో లభించే పులస వంటిì పది రకాల చేపలంటే మాంసాహార ప్రియులు పడిచస్తారు. ఇంతకాలం పెద్ద చేపలనే ఇష్టపడేవారు ఇప్పుడు చిన్న చేపలపైనా మక్కువ చూపిస్తున్నారు. చిన్న చేపలు రుచికి రుచి.. బలవర్ధకమైన మాంసాహారం, సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తాయి.   

సముద్రపు చేపలకు గిరాకీ 
సముద్రపు ఉప్పు నీటిలో లభించే చేపలంటే మాంసాహార ప్రియులు ఇష్టపడతారు. పీతలు, రొయ్యలు, ట్యూనా, వంజరం, కోనం, చందువ తదితర రకాల చేపలకు మార్కెట్‌లో భలే గిరాకీ. ఇటువంటి చేపలు కాకినాడ రేవు నుంచి దక్షిణాదిన తమిళనాడు, కేరళతో పాటు ఒడిశా, మహారాష్ట్రలకు ఎగుమతి చేస్తున్నా­రు. పెద్ద చేపలతో పాటు చిన్నచిన్న చేపలకు కూ­డా ఇప్పుడిప్పుడే డిమాండ్‌ పెరుగుతోందని మత్స్యకా­రులు చెబుతున్నారు. చూడటానికి అరంగుళం, అంగుళం, ఒకటిన్నర అంగుళాల సైజులో ఉండే ఈ చిన్న చేపలు కొన్ని రకాల జబ్బులకు దివ్యౌషధమని వైద్యులు నిర్ధారిస్తున్నారు.

ఈ జాబితాలో  నెత్తళ్లు, కవ­ళ్లు, కట్టచేపలు, పరిగెలు, కానగంత తదితర చేపలు ఉన్నాయి. పెద్ద చేపల కంటే చిన్న చేపలు మంచివని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చిన్న చేపల్లో తక్కువ స్థాయిలో మెర్క్యురీ, అధిక స్థాయిలో మినరల్స్‌ ఉండటంతో ఆరోగ్యానికి మంచిదంటున్నారు. చిన్న చేపల్లో ఒమేగా–3 యాసిడ్స్‌ ఎక్కు­­వగా ఉండటంతో మెదడు చురుగ్గా పని చేసేందుకు దోహదపడుతుంది. చిన్న చేపల్లో కలుíÙతాల స్థా­యి కూడా   తక్కువ మోతాదులో ఉంటుంది. పెద్ద చేపల కంటే చిన్న చేపల ధర కూడా తక్కువే. పండుగప్ప, వంజరం, ట్యూనా, కొరమేను వంటి కేజీ, కేజీన్నర ఉండే ఒక పెద్ద చేప కొనాలంటే కనీసం రూ.వెయ్యి వెచి్చంచాలి.

అదే కేజీ చిన్న చేపలు కావాలంటే రూ.100 నుంచి రూ.200 పెడితే దొరికేస్తాయి.   వివిధ రకాల పండ్లు, కూరగాయల నుంచి అదనంగా లభించే ఐరన్, జింక్‌ చిన్న చేపల ద్వారా పెరుగుతా­యని వైద్యులు చెబుతున్నారు. చిన్న చేపలను ఆహా­రంగా తీసుకునే మహిళల్లో రక్తహీనత తగ్గి శక్తిమంతులవుతారు. ప్రధానంగా గర్భిణులు, ప్రసవం అయి­న మహిళలకు నెత్తళ్లు  రకం చిన్న చేపలు ఎంతో బలవర్ధకమైన ఆహారంగా గ్రామీణ మహిళలు భావిస్తారు.   అల్పాదాయ దేశాల్లో మధ్యతరగతి, పేద వర్గా­లు చిన్న చేపలనే ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు.

వారంతా ఆరోగ్యవంతులుగా, బలవంతు­లుగా ఉంటారని వరల్డ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ తాజా అధ్యయనంలో పేర్కొంది. మహిళా సాధికారత కోసం ఒడిశా రాష్ట్రం మిషన్‌ శక్తి చొరవతో రెండేళ్ల క్రితం పైలట్‌ ప్రాజెక్టు చేపట్టింది. దీని ద్వారా 7 మిలియన్లకు పైగా చిన్న చేప పిల్లలను ఉత్పత్తి చేసిందని అధ్యయనం చెబుతోంది. వీటిని మహిళా స్వయం సహాయక బృందాలకు పంపిణీ చేసి, గ్రామీ­ణ మహిళల్లో శక్తిసామర్థ్యాల పెంపునకు ఇతోధికంగా తోడ్పాటు అందించారు. స్విట్జర్లాండ్, కాంబోడియా వంటి దేశాల్లో స్వదేశీ చిన్న చేపలను కూరగాయల ఉత్పత్తితో పాటు మిళితం చేయడం గమనార్హం.

కవళ్లతో గుండె జబ్బుల నివారణ 
చిన్న చేపల్లో ప్రధానంగా కవళ్లు ఆహారంగా తీసుకుంటే కాల్షియం, మినరల్స్, విటమిన్‌–డి వంటి పోషకాలు లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని ఆహారంగా తీసుకునే వారిలో గుండె జబ్బులకు ఆస్కారం ఉండదంటున్నారు. ఈ చేపలు చూసేందుకు చాలా చిన్నగా ఉంటాయి. వ్యావహారికంగా వీటిని ఆయిల్‌ సర్డిన్స్‌గా, శాస్త్రీయంగా సర్డెనెళ్ల లొంగిచెప్స్‌గా పిలుస్తారు. ఈ చేపల్లో పాలి అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉండటం వలన గుండె జబ్బులను తగ్గిస్తాయి.


నెత్తళ్లతో కీళ్ల నొప్పులు మాయం 
సిల్వర్‌ కలర్‌లో కనిపించే నెత్తళ్ల చేపలు చాలా చిన్నగా ఉంటాయి. ఆంకూవీస్‌ అని వ్యవహారికంగా పిలిచే ఈ చేపల శాస్త్రీయ నామం స్టోల్‌ ఫోరస్‌ ఇండికస్‌. నెత్తళ్లలో కాల్షియం ఎక్కువగా ఉండడంతో కీళ్ల నొప్పుల నివారణకు పనికొస్తాయి. గర్భిణులు, వృద్ధులకు ఎంతో బలవర్ధకమైన ఆహారంగా భావిస్తారు. నెత్తళ్లు 100 గ్రాములు ఆహారంగా తీసుకుంటే 200 కిలో క్యాలరీల శక్తి, 45 గ్రాముల ప్రొటీన్లు, 3.3 గ్రాముల కొవ్వు పదార్థాలు, 1,400 మిల్లీగ్రాముల కాల్షియం, 2 గ్రాములు మిగిలిన ఖనిజాలు, 67 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్‌ లభిస్తాయని కాకినాడ ఎస్‌ఐఎఫ్‌టీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చిన్న చేపల్లో కాల్షియం ఎక్కువ 
చిన్న చేపల్లో కాల్షియం, విటమిన్‌–ఎ పుష్కలంగా ఉంటాయి. ఈ చేపలను ఆహారంగా తీసుకుంటే ఎముకలకు, కళ్లకు మేలు జరుగుతుంది. సహజంగా పెద్ద చేపలు ఇష్టంగా తీసుకుంటారు. పెద్ద చేపల కంటే చిన్న చేపలు బలవర్ధకం. గర్భిణులకు, ప్రసవానంతరం బలవర్ధకమైన ఆహారంగా నెత్తళ్లు పెట్టడం పల్లెల్లో ఆనవాయితీగా వస్తున్నదే. – టి.సుమలత, ప్రిన్సిపాల్, ఎస్‌ఐఎఫ్‌టీ, కాకినాడ 

చిన్న చేపలను ముళ్లతో తింటే మేలు చిన్న చేపల్లో ముళ్లు లేత­గా ఉంటాయి. 
అందులో కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. గొంతులో గుచ్చుకుంటాయనే అనుమానం లేకుంటే చిన్న చేపలను ముళ్లతో తినడమే మేలు. ప్రకృతిలో దేని ద్వారానూ లభించనంత కాల్షియం చిన్న చేపల్లో లభ్యమవుతుంది. ఈ కాల్షియం  ఎముకలు గుల్లబారడాన్ని నివారించి, ఆస్టియోపొరాసిస్‌ వంటి సమస్యలను దూరం చేస్తుంది. చిన్న చేపల నుంచి లభ్యమయ్యే ప్రొటీన్‌ వల్ల కండ పుష్టి ఏర్పడి, శరీర నిర్మాణానికి దోహదపడుతుంది.       – డాక్టర్‌ తొమూర్తి గౌరీశేఖర్,  ఎముకల వైద్య నిపుణుడు, కాకినాడ  

Advertisement
 
Advertisement
 
Advertisement