ఈ-క్రాప్‌తో రైతు సంక్షేమం 

E Crop Registration In Bhimavaram Over Farmers Welfare - Sakshi

భీమవరం: రైతు శ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తూ అండగా నిలుస్తోంది. దీనిలో భాగంగానే పథకాలను రైతులకు మరింత చేరువ చేయడానికి చేపట్టిన ఈ–క్రాప్‌ నమోదు భీమవరం నియోజకవర్గంలో వేగంగా జరుగుతోంది. ఈ–క్రాప్‌ ద్వారా గ్రామాల్లో పండించిన అన్నిరకాల వ్యవసాయ, ఉద్యాన పంటలు, పట్టు పరిశ్రమ, పశుగ్రాసం, సామాజిక అటవీశాఖ, మత్స్యశాఖలకు సంబంధించిన వివరాలు నమోదు చేస్తారు. ఈ క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం రైతులకు అందించే అన్ని సంక్షేమ పథకాలు, వైఎస్సార్‌ సున్నావడ్డీ, పంట రుణాలు, వైఎస్సార్‌ ఉచిత పంట బీమా, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, కనీస మద్దతు ధర వంటివి దక్కుతాయి.

గతంలో ప్రభుత్వం రైతుల కోసం అమలుచేసే పథకాలు భూస్వాములకు మాత్రమే దక్కేవి. జిల్లాలో సుమారు 3 లక్షలకు పైగా కౌలు రైతులున్నారు. వీరిని పరిగణలోనికి తీసుకుని ప్రభుత్వ పథకాలు పంట సాగుచేసే రైతులకే అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే ఈ క్రాప్‌ విధానం చేపట్టారు. ఈ క్రాప్‌లో భూయజమానులు, కౌలు రైతులు, ఈనాం రైతులు వంటి వారిని కూడా నమోదుచేస్తారు.

ఈ క్రాప్‌ నమోదు కార్యక్రమం భీమవరం నియోజకవర్గంలో ముమ్మరంగా సాగుతోంది. వీరవాసరం మండలంలో సుమారు 14 వేల ఎకరాల్లో సాగు చేస్తుండగా ఇప్పటివరకు 5 వేల ఎకరాల్లో నమోదు చేశారు. భీమవరం మండలంలో 11 వేల ఎకరాలకు గాను 5వేల ఎకరాల్లో నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. మిగిలిన విస్తీర్ణంలో కూడా నమోదు కార్యక్రమాన్ని వేగంగా చేస్తున్నారు.

పంట అమ్మకాలకు ఎంతో మేలు
నియోజకవర్గంలో ప్రధానంగా వరి అమ్మకాలకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మే సమయంలో రిజిస్టర్‌ కాకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద అభ్యంతరాలు చెబుతున్నారు. పండిన పంటను తీరా కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాక నమోదు ఇబ్బందులతో అమ్మకంలో జాప్యం జరుగుతోంది. దీనిని అధిగమించడానికి పంట వేసిన సమయంలోనే ఈ క్రాప్‌ నమోదు చేయించుకుంటే.. అమ్మే సమయంలో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే అమ్మకాలు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. 

వేగంగా ఈ క్రాప్‌ నమోదు 
భీమవరం వ్యవసాయ సబ్‌డివిజన్‌ పరిధిలోని, వీరవాసరం, భీమవరం, పాలకోడేరు మండలాల్లో ఈ క్రాప్‌ నమోదు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 50 శాతం వరకు పూర్తయ్యింది. ఈ క్రాప్‌ వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం ఉంది. రైతులంతా తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. 
పి.ఉషారాజకుమారి, ఏడీఏ, భీమవరం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top