అక్రమాలు దిట్ట.. పగిలిన పుట్ట | DSC Candidates fires on massive irregularities in DSC-2025: Andhra pradesh | Sakshi
Sakshi News home page

అక్రమాలు దిట్ట.. పగిలిన పుట్ట

May 23 2026 4:48 AM | Updated on May 23 2026 4:48 AM

DSC Candidates fires on massive irregularities in DSC-2025: Andhra pradesh

డీఎస్సీ–2025లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని వాపోతున్న అభ్యర్థులు  

ఎస్సీఈఆర్టీలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి కృష్ణా జిల్లా టాపర్‌ 

జోన్‌–2 టీజీటీ తెలుగులోనూ ఆరో ర్యాంక్‌.. 

టెట్, డీఎస్సీ నిర్వహణలో కీలక విధుల్లో పాల్గొన్న వైనం  

పలువురికి ముందుగానే పేపర్‌ అందినట్లు అనుమానాలు 

విషయం బయట పడటంతో అతనికి పోస్టు ఇవ్వకుండా విధుల నుంచి తొలగింపు 

అక్రమాల ఆనవాలు లేకుండా ఆన్‌లైన్‌ డేటా డిలీట్‌ 

అందుకే మెరిట్‌ లిస్టు ప్రకటించకుండా నేరుగా ఎంపికైన అభ్యర్థులకు మెసేజ్‌లు 

హడావుడిగా పోస్టులు భర్తీ చేసేసి.. అంతా సక్రమమేనని కలరింగ్‌ 

కోర్టు తీర్పునూ పట్టించుకోని విద్యాశాఖ  

రిజర్వేషన్ల అమల్లోనూ అక్రమాలు.. అడిగిన వారికి బెదిరింపులు

స్పోర్ట్స్‌ కోటాలో మాస్టర్‌ మైండ్‌ అక్రమాలు.. బయటపడ్డ బేరసారాల కాల్‌ రికార్డులు  

న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టిస్తున్న పాఠశాల విద్యాశాఖ, శాప్‌ 

ఉన్నత స్థాయి విచారణకు బాధితుల డిమాండ్‌

డీఎస్సీలో భారీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా డీఎస్సీ ప్రక్రియ చూసిన ఎస్సీఈఆర్టీ నుంచే ఈ దారుణాలు జరిగాయని అభ్యర్థుల నుంచి ఆరోపణలు 
వినిపిస్తున్నాయి. డిజిటల్‌ విభాగంలో పని చేస్తున్న ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగుల ద్వారా డీఎస్సీ ప్రశ్నలు లీకైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక, వీరిలో ఒకరికి డీఎస్సీలో టాప్‌ మార్కులు రావడంతో పాటు సోషల్‌ స్టడీస్‌లో కృష్ణా జిల్లా టాపర్‌గా, జోన్‌–2 టీజీటీలో 6వ ర్యాంకు సాధించడమే నిదర్శనమని అభ్యర్థులు వాపోతున్నారు. స్కామ్‌ వెలుగు చూశాక వీరిద్దరినీ విధుల నుంచి తొలగించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అవకతవకలు బయట పడటంతో వారి మార్కులు, ఇతర వివరాలను సైతం డేటా బేస్‌ నుంచి తొలగించారు.

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం కొత్తపేటకు చెందిన పి.నవీన్ మెగా డీఎస్సీృ2025లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్‌లో 89.7465 స్కోరుతో జిల్లా టాపర్‌గా మొదటి ర్యాంకు సాధించాడు. అలాగే, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) తెలుగులో 78.73 స్కోరుతో జోన్ృ2లో ఆరో ర్యాంకు సాధించాడు. రెండు ఉద్యోగాల్లోనూ టాప్ స్కోరు సాధించిన నవీన్‌కు తప్పనిసరిగా ఉద్యోగం రావాలి. కానీ ప్రభుత్వం అతడికి టీచర్ పోస్టు ఇవ్వలేదు. ప్రభుత్వం మొదట విడుదల చేసిన కృష్టా జిల్లా సోషల్ స్టడీస్ మెరిట్ లిస్టులో సైతం మొదటి ర్యాంక్ వివరాలు తొలగించారు. అలాగే, టీజీటీ మెరిట్ లిస్టులో సైతం ఈ అభ్యర్థి వివరాలు లేకుండా చేశారు.

అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన సయ్యద్ జమీల్ డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ (ఉర్దూ)లో 58.77 స్కోరు సాధించాడు. మెరిట్ లిస్టులో 7వ ర్యాంకు సాధించాడు. ఒక పోస్టు జనరల్, మరో పోస్టు ఈడబ్ల్యూఎస్ కోటా కింద కేటాయించారు. ఈ క్రమంలో ఓపెన్ కేటగిరీలో ఇతనికి పోస్టు రావాలి. కానీ, ముస్లిం బీసీ వర్గానికి చెందిన అభ్యర్థికి ఇచ్చారు. జరిగిన తప్పును ఆధారాలతో సహా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు.

సాక్షి, అమరావతి: సీఎంగా చంద్రబాబు తొలి సంతకం చేసిన మెగా డీఎస్సీ–2025లో కుంభకోణం చోటుచేసుకుందని అభ్యర్థులు వాపోతున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయంటున్నారు. సాక్షాత్తు సీఎం తనయుడు లోకేశ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పడుతుండటమే ఇందుకు నిదర్శనమని నొక్కి వక్కాణిస్తున్నారు. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో 421 పోస్టులను అమ్ముకున్న వైనం ఇప్పటికే బయటపడిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో జనరల్‌ డీఎస్సీలోనూ భారీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా డీఎస్సీ ప్రక్రియ చూసిన ఎస్సీఆర్టీ నుంచే ఈ దారుణాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

డిజిటల్‌ విభాగంలో పని చేస్తున్న ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగుల ద్వారా డీఎస్సీ ప్రశ్నలు బయటకు లీకైనట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక, వీరిలో ఒకరికి డీఎస్సీలో టాప్‌ మార్కులు రావడంతో పాటు, సోషల్‌ స్టడీస్‌లో కృష్ణా జిల్లా టాపర్‌గా, జోన్‌–2లో టీజీటీలో 6వ ర్యాంకు సాధించడమే ఇందుకు నిదర్శనం. ఫలితాలు వచ్చాక ఈ విషయం గుర్తించిన అధికారులు.. వీరిద్దరినీ విధుల నుంచి తొలగించడం అనుమానాలకు బలం చేకూరుతోంది. 

అంతేగాక టాప్‌ మార్కులు సాధించిన సదరు కాంట్రాక్టు ఉద్యోగికి టీచర్‌ పోస్టును రద్దు చేయడంతో పాటు అతను సాధించిన మార్కులు, ఇతర వివరాలను డేటా బేస్‌ నుంచి తొలగించినట్టు సమాచారం. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలను చంద్రబాబు సర్కార్‌ సంతలో సరుకు మాదిరిగా అమ్మేసింది. అభ్యర్థులను ఇళ్లకు పిలిపించుకుని మరీ బేరసారాలు సాగించింది. క్రీడా శాఖలో నామినేటెడ్‌ పోస్టును అడ్డం పెట్టుకుని సీఎం బంధువుగా ప్రచారం చేసుకుంటున్న ‘మాస్టర్‌ మైండ్‌’ డైరెక్షన్‌లో ఈ కుంభకోణం దిగి్వజయంగా సాగింది.  

ర్యాంకర్‌ వివరాలు ఎందుకు తొలగించారు? 
డీఎస్సీ ఫలితాల విడుదలలో తొలుత సబ్జెక్టు వారీగా, జిల్లాల వారీగా మెరిట్‌ లిస్టు ప్రకటిస్తారు. మెగా డీఎస్సీ–2025లోనూ ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా సోషల్‌ స్టడీస్‌ టాపర్‌గా డీఎస్సీ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఎస్సీఆర్టీ కాంట్రాక్టు ఉద్యోగి నిలిచాడు. అయితే, తొలుత అతడి వివరాలు లేకుండా రెండో ర్యాంకు నుంచి మెరిట్‌ లిస్టు విడుదల చేశారు. అనంతరం ఈ విషయం బయటకు రాకూడదని మెరిట్‌ లిస్టులను రద్దు చేసి, ఏకంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఎస్‌ఎంఎస్‌లు పంపారు.

కానీ, అప్పటికే జిల్లాల్లో కొందరు మెరిట్‌ లిస్టులను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మరోపక్క కృష్ణా జిల్లాలో సోషల్‌ స్టడీస్‌లో టాపర్‌గా వచ్చిన ఎస్సీఆర్టీ కాంట్రాక్టు ఉద్యోగి పి.నవీన్‌కు మాత్రం ఎంపిక జాబితాలో పోస్టు లేకపోవడంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను కీలకమైన డీఎస్సీ నిర్వహణలో నియమించరాదు. కానీ ఇక్కడ మాత్రం ఆన్‌లైన్‌ ప్రశ్నలు అప్‌లోడ్‌ చేసే బాధ్యతను కాంట్రాక్టు ఉద్యోగికే అప్పగించారు. ఫలితాల్లో అతడు టాపర్‌గా నిలిచినా పోస్టు ఇవ్వలేదు.  

స్పోర్ట్స్‌ పోస్టులను అమ్మేసిన మాస్టర్‌మైండ్‌ 
క్రీడా శాఖలో రాజకీయ నామినేటెడ్‌ పోస్టును అడ్డుపెట్టుకుని సీఎం బంధువుగా ప్రచారం చేసుకుంటున్న ‘మాస్టర్‌ మైండ్‌’ డైరెక్షన్‌లో స్పోర్ట్స్‌ డీఎస్సీ పోస్టులను భారీగా అమ్మేశారు. ఒక్కో పోస్టుకు డిమాండ్‌ను బట్టి రూ.15 లక్షలు రేటు ఫిక్స్‌ చేసి అమ్మకానికి పెట్టారు. ఇక్కడ పొరుగు శాఖలకు చెందిన కొందరు ఉద్యోగులను క్రీడా శాఖలోకి డెప్యూటేషన్‌పై తీసుకొచ్చి వారి ద్వారా తన దోపిడీ దందాను నడిపించడం విస్తుగొలుపుతోంది. సదరు వ్యక్తులు అభ్యర్థులకు ఫోన్లు చేసి డీఎస్సీ పోస్టుల కేటాయింపులపై బేరసారాలు సాగించిన ‘వాయిస్‌ రికార్డులు’ కలకలం రేపుతున్నాయి. ఇలా మొత్తం స్పోర్ట్స్‌ డీఎస్సీలో నాలుగింట మూడొంతులు పోస్టులు అమ్మేసినట్టు తెలుస్తోంది. ఇలా రూ.40–50 కోట్లు దండుకున్నట్టు క్రీడా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.  

బేరసారాలు ఇలా...
మాస్టర్‌ మైండ్‌ ఏజెంట్‌ : డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల్లో మేము చెప్పినట్టు పోస్టింగ్‌ చేయిస్తాం. 
అభ్యర్థి కుటుంబ సభ్యులు: అలా కాదు సార్, ఎంత అవుద్ది. 

మాస్టర్‌ మైండ్‌ ఏజెంట్‌ : ఒకసారి వస్తే మాట్లాడదాం.  
అభ్యర్థి కుటుంబ సభ్యులు: కలిసి మాట్లాడమంటారా?  

మాస్టర్‌ మైండ్‌ ఏజెంట్‌ : అవును. 
అభ్యర్థి కుటుంబ సభ్యులు: రేపు బయలుదేరి రమ్మంటారా? ఎన్నింటికి రమ్మంటారు సార్‌. 

మాస్టర్‌ మైండ్‌ ఏజెంట్‌ : మీ ఇష్టం. మీరు ఏ టైంకి అయినా రండి. 
అభ్యర్థి కుటుంబ సభ్యులు:  సరేసార్‌. ఇప్పుడు అభ్యర్థి కూడా కావాలా? నేను, మా బావ వస్తే సరిపోతుందా? 

మాస్టర్‌ మైండ్‌ ఏజెంట్‌ : మీ ఇద్దరైనా రండి. మీ ఒక్కరైనా రండి. అభ్యర్థితో ఏం పనిలేదు. మీరే మాట్లాడి ఫైనల్‌ చేసుకోండి. 
అభ్యర్థి కుటుంబ సభ్యులు: రేపు పది గంటలకల్లా వస్తాం సార్‌. వచ్చాక కాల్‌ చేస్తాం ఈ నంబర్‌ (944..558..)కు కాల్‌ చేస్తాం. 

మాస్టర్‌ మైండ్‌ ఏజెంట్‌ : మాగ్జిమమ్‌ ఒక్కరు వస్తేనే బెటర్‌. ఇద్దరు వస్తే కూడా ఒక్కరితోనే మాట్లాడేది. కొంచెం ఇది సీక్రెట్‌గా చేసుకునే పని కదా. 
అభ్యర్థి కుటుంబ సభ్యులు: తప్పకుండా సార్‌. మాకు అర్థమయ్యింది సార్‌. ఇంతని అంటే.. ఫిగర్‌ చెబితే నేను రెడీ చేసుకుంటా. 

మాస్టర్‌ మైండ్‌ ఏజెంట్‌ :  ఇది డీఎస్సీలో పోస్టింగ్‌. మీకు ఐడియా ఉంటుంది. ఒకేనా? 
అభ్యర్థి కుటుంబ సభ్యులు: అవును సార్‌ 

మాస్టర్‌ మైండ్‌ ఏజెంట్‌ :  ఇప్పుడొచ్చేసి మార్కెట్‌ రూ.15 లక్షలు అలా నడుస్తుంది.  
అభ్యర్థి కుటుంబ సభ్యులు: బాబోయ్‌ అంతంటే పెట్టలేము సార్‌.. 

మాస్టర్‌ మైండ్‌ ఏజెంట్‌ : ఇదేంటంటే డైరెక్టుగా పోస్టింగ్‌ ఇవ్వడం. సరే ఏదైనా మీరు వచ్చి మాట్లాడండి. ఏమైనా నెగోõÙషన్స్‌ చేద్దాం.  
అభ్యర్థి కుటుంబ సభ్యులు: సరే సార్‌ అయితే, ఓకే.. 

మాస్టర్‌ మైండ్‌ ఏజెంట్‌ : వీలైనంత చేస్తాను. యాక్చువల్లీ టైమ్‌ తక్కువగా ఉందని ఇంటికే పిలిపించి మాట్లాడుతున్నా. ఇక్కడే మాట్లాడుకుందాం. పర్సనల్‌గా వస్తే మాట్లాడి చేద్దాం 
అభ్యర్థి కుటుంబ సభ్యులు: తప్పకుండా.. ఓకే సార్‌.. థ్యాంక్యూ సార్‌.. 

మాస్టర్‌ మైండ్‌ ఏజెంట్‌ : కొంచెం పర్సనల్‌గా రండి. ఎవరితో దీని గురించి డిస్కస్‌ చేయొద్దు.  
అభ్యర్థి కుటుంబ సభ్యులు: లేదండి.. నాకు చెప్పారు.. పోస్టు ఇంపార్టెంట్‌ కదండి.. వస్తాం.. చూసుకుంటాం సార్‌.. 
మాస్టర్‌ మైండ్‌ ఏజెంట్‌ : సరేండి జాగ్రత్తగా రండి. చేద్దాం.

బెదిరించి కేసులు విత్‌డ్రా చేయించి.. 
అనంతపురం జిల్లాకు చెందిన ఫెన్సింగ్‌ క్రీడాకారిణి తనకు డీఎస్సీ ఎంపికల్లో అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించింది. స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల భర్తీ ప్రాధాన్యత క్రమంలో సదరు క్రీడ అగ్రస్థానంలో ఉంటుంది. ఆమెకు కోర్టులో కేసు గెలిచే అవకాశం ఉంది. ఆ తర్వాత పోస్టు కచ్చితంగా వస్తుంది. ఈ క్రమంలో సదరు క్రీడాకారిణి కేసు విత్‌డ్రా చేసుకునేందుకు మాస్టర్‌ మైండ్‌ తీవ్రంగా బెదిరించారు. శాప్‌లోని సాంకేతిక విభాగంలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగితో ఫోన్‌ చేయించి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు. 

అప్పటికే మాస్టర్‌ మైండ్‌ ఆ పోస్టును బేరంపెట్టి అమ్మేసుకోవడంతో సదరు క్రీడాకారిణి కేసు గెలిస్తే తనకు ఇబ్బందులొస్తాయని బెదిరింపులకు ఒడిగట్టడం గమనార్హం. అనర్హులు స్పోర్ట్స్‌ కోటా, సర్టీఫికెట్లతో ఉద్యోగాలు పొందారంటూ వచ్చిన ఫిర్యాదులను శాప్‌ ఉద్దేశ పూర్వకంగానే తొక్కిపెట్టింది. కనీసం సమాచార హక్కు చట్టం–2005 ప్రకారం ఇవ్వాల్సిన సమాచారాన్ని సైతం ఇవ్వకుండా ఆర్టీఐ యాక్టివిస్టులను సైతం ఇబ్బంది పెడుతోంది. ‘డీఎస్సీ డీల్స్‌’ అంటూ సాక్షి ఆధారాలతో సహా కథనాన్ని ప్రచురిస్తే శాప్‌ ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు. విచారణ పేరుతో వారాల పాటు కాలం గడిపేసి దొంగలకు వత్తాసు పలుకుతోందనే విమర్శలొస్తున్నాయి. కాగా, డీఎస్సీలో అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని బాధిత అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

లీకేజీ బయటపడకుండా జాగ్రత్తలు 
రాష్ట్రంలో 1990 నుంచి 2019లో జరిగిన స్పెషల్‌ డీఎస్సీ వరకు ఫలితాలను ప్రకటించేటప్పుడు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, రోస్టర్‌ను పరిగణనలోకి తీసుకుని, అభ్యర్థులకు వచ్చిన మార్కులతో మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులంతా ఆ మెరిట్‌ లిస్ట్‌ పరిశీలించే వీలు కలి్పంచారు. దాంతో మెరిట్‌లో తాము ఎక్కడ ఉన్నామో తెలుసుకుని తమకు పోస్టు వస్తుందా లేదా అని అంచనా వేసుకునేవారు. దీని ప్రకారం పరీక్ష జరిగిన తర్వాత అభ్యర్థుల మార్కులు విడుదల చేయాలి. మెరిట్‌ లిస్టు ప్రకటించిన తర్వాత సెలక్షన్‌ లిస్ట్‌ తయారు చేసి కౌన్సెలింగ్‌ నిర్వహించాలి.

కానీ తాజా డీఎస్సీలో మెరిట్‌ లిస్ట్, సెలక్షన్‌ లిస్ట్‌ లేకుండా నేరుగా ‘సెలెక్టెడ్‌’ అభ్యర్థుల ఫోన్లకు మెసేజ్‌లు పంపి సర్టీఫికెట్‌ వెరిఫికేషన్‌కు పిలిచారు. పరీక్ష రాసిన 3,36,307 మంది మెరిట్‌ను ప్రకటించకుండా కేవలం 16,437 పోస్టులకు గాను అంత మందికే మెసేజ్‌ పంపడం గమనార్హం. ఇందులోనూ అనేక తప్పులు జరిగాయి. అభ్యర్థుల మార్కులు సైతం రోజుకో విధంగా మారిపోవడం, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (ఈపీటీ) పాసైనట్టు ప్రకటించి, తర్వాత వెబ్‌సైట్‌ నుంచి డేటా తొలగించారు. ఇదంతా లీకేజీని దాచిపెట్టడం కోసమే చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆటే రాకున్నా.. పోస్టు ఇచ్చేశారు 
డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా డైరెక్టు నియామకాలే కాదు.. రాత పరీక్షల్లో స్పోర్ట్స్‌ సర్టీఫికెట్‌ వెయిటేజీల్లోనూ అక్రమాలే జరిగాయి. అసలు ఆటే రాని వ్యక్తులు దొంగ సర్టీఫికెట్లు పెట్టి పోస్టులు కొట్టేశారు. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో ఓ మహిళకు స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం వచ్చింది. రాత పరీక్షకు తోడు స్పోర్ట్స్‌ కోటా సర్టిఫికెట్‌ జత చేయడంతో పోస్టు దక్కింది. అయితే సదరు మహిళ ఎన్నడూ క్రీడా మైదానంలో కాలు పెట్టింది గానీ, జిల్లా, రాష్ట్ర, స్థాయిలో ఆడింది లేకున్నా ఏకంగా జాతీయ స్థాయి సర్టిఫికెట్‌ పుట్టించి మరీ పోస్టు కొట్టేశారు. సదరు వ్యక్తి భర్త పీఈటీ కావడంతో మాస్టర్‌మైండ్‌ ఏజెంట్లతో కలిసి ఫేక్‌ సర్టీఫికెట్లు సృష్టించి పోస్టు తెచ్చుకున్నారు. దీనిపై పలువురు అభ్యర్థులు శాప్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదు.  

రాయలసీమ జిల్లాకు చెందిన ఓ క్రీడాకారిణి న్యాయంగా తనకు దక్కాల్సిన పోస్టు నాన్‌–లోకల్‌ కోటాలో వేరే వ్యక్తికి కట్టబెట్టేశారని హైకోర్టును ఆశయ్రించారు. అయితే, 20 శాతం నాన్‌లోకల్‌/ఓపెన్‌ కేటగిరీలో.. 80 శాతం లోకల్‌ కోటాలో పోస్టులు భర్తీ చేయాలి. సదరు జిల్లాలో ఐదు పోస్టుల్లో టాపర్‌ను ఓపెన్‌ కేటగిరీల మొదటి పోస్టుగా భర్తీ చేశారు. ఆ తర్వాత మూడో పోస్టు నాన్‌లోకల్‌లో భర్తీ చేసి స్థానికులకు అన్యాయం చేశారు.

ఒకసారి ఓపెన్‌ క్యాటగిరీలో పోస్టు భర్తీ చేసిన తర్వాత మళ్లీ నాన్‌–లోకల్‌లో ఎలా భర్తీ చేస్తారన్నది ప్రశ్న? దీనిపై క్రీడాకారిణి కోర్టుకు వెళ్లగా శాప్‌ తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసి న్యాయ వ్యవస్థను సైతం మోసం చేసే ప్రయత్నం చేసింది. 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులను చూపించి తప్పు చేయలేదని చెప్పుకొచ్చింది. అయితే ఆ తర్వాత ఆరుసార్లకుపైగా రాష్ట్రపతి ఆర్డర్లు సవరించిన విషయాన్ని ఉద్దేశ పూర్వకంగా కోర్టుకు తెలుపక పోవడం గమనార్హం.   

Advertisement
 
Advertisement
Advertisement