వినువీధి వి‘చిత్రం’.. సాంకేతిక సేవల్లో సరికొత్త అధ్యాయం | Sakshi
Sakshi News home page

వినువీధి వి‘చిత్రం’.. సాంకేతిక సేవల్లో సరికొత్త అధ్యాయం

Published Fri, Nov 19 2021 12:52 PM

Drone Photography Services More Attracting Now - Sakshi

పలు రంగాలకు వినూత్న పాఠాలు నేర్పుతూ సాంకేతిక సేవల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న వినువీధి వి‘చిత్రం’ డ్రోన్‌ సేవల్ని సిక్కోలు వాసులు వినియోగించేందుకు మొగ్గు చూపుతున్నారు. పదుల సంఖ్యలో మనుషులు చేయాల్సిన పనిని విహంగ నేత్రం చేసేస్తోంది. శుభకార్యాల్లో ఫొటోలు, వీడియోలు తీయడం దగ్గర్నుంచి పొలాల్లో పురుగుమందుల పిచికారీ వరకు.. పోలీస్‌ నిఘా నుంచి వరద ప్రాంతాల్లో పరిస్థితుల సమీక్ష వరకూ.. డ్రోన్ల వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో డ్రోన్లను వినియోగిస్తున్న రంగాలు ఏమిటి.. సేవలు.. ప్రత్యేకతలపై ‘సాక్షి’ కథనం. 
– పాలకొండ రూరల్‌/ఆమదాలవలస

వినువీధి వి‘చిత్రం’ 
వివాహమైనా.. వేడుకైనా..రాజకీయ పార్టీల మీటింగైనా.. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం డ్రోన్‌ కెమెరా వాడకం సాధారణమైపోయింది. చిత్రీకరించాల్సిన ప్రదేశాన్ని బట్టీ వేర్వేరు రకాల డ్రోన్లను ఫొటోగ్రాఫర్లు వినియోగిస్తున్నారు.  
 జిల్లాలో ఫొటోగ్రాఫర్లు వినియోగిస్తున్న డ్రోన్‌ల ఖరీదు రూ.రెండు లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు.  
 వీటి బరువు 350 గ్రాముల నుంచి 450 గ్రాముల వరకు ఉంటుంది.  
 250 అడుగుల ఎత్తు వరకు వీటిని ఎగురవేస్తున్నారు.  
 ఒక సారి బ్యాటరీ చార్జ్‌ చేస్తే 20 నిమిషాల పాటు పనిచేస్తుంది.   

డ్రోన్లతో పెట్రోలింగ్‌..  
ఎక్కడెక్కడ.. ఎవరెవరున్నారు.. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారెవరు.. ర్యాలీలు, ధర్నాలు జరిగేటప్పుడు సంఘ విద్రోహక శక్తులు ఏమైనా పాల్గొంటున్నాయా వంటి విషయాల్ని తెలుసుకునేందుకు పోలీస్‌ విభాగం నిఘా కోసం డ్రోన్లను వినియోగిస్తోంది. లాక్‌డౌన్‌లో ఎస్పీ అమిత్‌బర్దార్‌ స్వయంగా డ్రోన్‌ను వినియోగించి నగరంలో పరిస్థితుల్ని పర్యవేక్షించారు.  

ఎస్‌ఈబీ అధికారులు కూడా డ్రోన్‌ వినియోగాన్ని పెంచారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాను నిరోధించడంలో భాగంగా అనుమానం ఉన్న ప్రాంతాల్లో వీటి సేవల్ని వినియోగించుకుంటున్నారు. సారా అమ్మకాలు సాగించే స్థావరాలను గుర్తించడంలో సత్ఫలితాలు సాధిస్తున్నారు.  

ప్రకృతి విపత్తుల అంచనాలో..  
ప్రకృతి విపత్తులు సంభవించే వేళ వాటి తీవ్రత ఇతర అంశాలను అంచనా వేసేందుకు అధికారులు డ్రోన్లపై ఆధారపడుతున్నారు. తాజాగా గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో వంగర మండలంలోని మూడు గ్రామాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. గ్రామాల్లో ప్రజల పరిస్థితులు, వరదనీటి ఉద్ధృతి ఇతర విషయాల్ని పర్యవేక్షించేందుకు జిల్లా 
ఉన్నతాధికారులు ఈ డ్రోన్లపైనే ఆధారపడ్డారు. గుర్తించిన ప్రాంతాల్లో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. 

మీ పొలంలో పిచికారీ కోసం.. 
వ్యవసాయ పనుల్లో రైతన్నకు చేదోడు వాదోడుగా నిలిచేందుకు కూడా సిద్ధమంటోంది డ్రోన్‌. ఇటీవలే ఆమదాలవలసలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పొలానికి పురుగు మందులు పిచికారీ చేసే అంశంపై డెమో జరిగింది. ఈ డ్రోన్‌ సాయంతో ఎకరా పొలానికి 10నుంచి 15 లీటర్ల మందు ద్రావణాన్ని సులభంగా పిచికారీ చేయవచ్చని ప్రయోగాత్మకంగా చూపించారు. ఇలాంటి సేవల్ని రైతులకు అందించేందుకు కొన్ని సంస్థలు సిద్ధంగా ఉన్నాయి.  

సమగ్ర భూ సర్వేలో కీలకంగా..  
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష’ పథకంలో భాగంగా నిర్వహిస్తున్న సమగ్ర భూ సర్వేలో కూడా డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సర్వే కోసం ప్రభుత్వం ఆధునిక డ్రోన్‌ను వినియోగిస్తోంది. సగటున రోజుకు 700 ఎకరాల వరకు సర్వే చేయొచ్చని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. జిల్లాలోని మూడు సబ్‌ డివిజన్లలో సర్వే కోసం ఒక డ్రోన్‌ను వినియోగిస్తున్నారు.

ప్రత్యేకతలివే..  
బరువు: 5 కిలోలు 
కెమెరా బరువు: 6.5 గ్రాములు 
120 మీటర్ల ఎత్తుకు ఎగురవేస్తారు. 
చార్జింగ్‌ ఒక గంట వరకు ఉంటుంది. 
ధర: రూ.25 లక్షలు 
విహంగ నేత్రం విశేషాలివే..  
డ్రోన్‌ బరువును బట్టి వాటిని విభజించారు.  
నెనో డ్రోన్‌ (250 గ్రాములు బరువు) 
మ్యాకో (250 గ్రాముల నుంచి 2.5 కిలోలు) 
మినీ (2.5 కిలోల నుంచి 25 కేజీల వరకు) 
స్మాల్‌(25 కిలోల నుంచి 250 కిలోలు) 
లార్జ్‌ (250 కిలోలకు పైబడి) 
రకాలున్నాయ్‌...  
ప్రొపెల్లర్స్‌(ఫ్యాన్లు లాంటి రెక్కల) సాయంతో డ్రోన్లు పైకి ఎగురుతాయి. 
మూడు రెక్కలుంటే ట్రైకాప్టర్, నాలుగుంటే క్వాడ్‌ కాప్టర్, ఆరుంటే హెక్స్‌ కాప్టర్, ఎనిమిది ఉంటే ఆక్టో కాప్టర్‌ అని పిలుస్తారు.   
అనుమతి తప్పనిసరి.. 
డ్రోన్లను వినియోగించాలంటే యూఏవోపీ అనుమతితో పాటు స్థానిక పోలీస్‌ ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి.  n అధికారులు నిర్దేశించిన నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.

వాడకం పెరిగింది..  
వివాహ, రాజకీయ, ఇతర శుభకార్యాల చిత్రీకరణలో డ్రోన్ల వినియోగం పెరిగింది. జిల్లాలో దాదాపు 50 మంది వరకు ఫొటోగ్రాఫర్లు డ్రోన్‌ వాడకానికి సంబంధించి లైసెన్స్‌ కలిగి ఉన్నారు. వీటిని వాడాలంటే పోలీసు అనుమతి తప్పనిసరి.  
 – మండపాక శ్రీధర్,సీనియర్‌ ఫొటోగ్రాఫర్, పాలకొండ

శాఖాపరంగా ఎన్నో సేవలు..  
డ్రోన్‌ కెమెరాలతో శాఖాపరంగా చాలా ఉపయోగాలున్నాయి. జిల్లా కేంద్రంలో డ్రోన్‌ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైనప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించి వాటి సేవలు పొందుతున్నాం. ముఖ్యంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగినప్పుడు, వీఐపీల పర్యటన సమయంలో వీటిని వినియోగిస్తున్నాం. లాక్‌డౌన్‌ సమయంలో అద్భుతంగా ఉపయోగపడ్డాయి. 
– మల్లంపాటి శ్రావణి, డీఎస్పీ, పాలకొండ 

పనితీరు అద్భుతం..  
సమగ్ర భూ సర్వేలో ఈ డ్రోన్‌ పనితీరు అద్భుతం. కచ్చితత్వం ఉంది. ప్రకృతి విపత్తులు అంచనా వేయటంలో మా సిబ్బంది డ్రోన్‌పైనే ఆధారపడుతున్నారు. 
– టీవీఎస్‌జీ కుమార్, ఆర్డీవో, పాలకొండ

 
Advertisement
 
Advertisement