జూనియర్‌కు అందలం.. సీనియర్లకు అగాధం! | Dr Vishnuvardhan takes charge as Andhra Pradesh DME | Sakshi
Sakshi News home page

జూనియర్‌కు అందలం.. సీనియర్లకు అగాధం!

May 27 2026 5:31 AM | Updated on May 27 2026 5:31 AM

Dr Vishnuvardhan takes charge as Andhra Pradesh DME

డీఎంఈగా కాకినాడ ప్రిన్సిపల్‌ విష్ణువర్ధన్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు

ఏడీఎంఈ సీనియార్టీలో 19వ స్థానంలో ఉన్న విష్ణువర్ధన్‌ 

సీఎం సొంత సామాజికవర్గం కావడంతో అందలం ఎక్కించారని విమర్శలు  

సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ)గా కాకినాడ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ విష్ణువర్ధన్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వాలని ప్రభు­త్వం నిర్ణయించింది. డీఎంఈ కార్యాలయంలోనే ఏడీఎంఈగా పనిచేస్తున్న డాక్టర్‌ రఘునందన్‌కు తొమ్మిది నెలల కిందట డీఎంఈగా పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) ఇచ్చారు.

ఉన్నట్టుండి ఆయ­న్ను విజయవాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా నియమించి, ఆ స్థానంలో డాక్టర్‌ విష్ణువర్ధన్‌ను నియమించడానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారని మంగళవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం ప్రకటించింది. దీంతో ఈ నియామకం వైద్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మా­రింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన సీనియర్‌లకు అన్యాయం చేస్తూ ఎడీఎంఈ సీనియా­ర్టీ 19వ స్థానంలో ఉన్న విష్ణువర్ధన్‌కు డైరెక్టర్‌ పోస్టు కట్టబెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఈయన సీఎం సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అత్యంత జూనియర్‌ అయినప్పటికీ అందలం ఎక్కిస్తున్నారని ఆరోపణలు హోరెత్తుతున్నాయి.  

బీసీ, ఎస్సీలకు అన్యాయం చేస్తూ.. 
డీఎంఈ స్థానం నుంచి వైదొలగుతానని డాక్టర్‌ రఘునందన్‌ చెప్పారని ఈ క్రమంలోనే విష్ణువర్ధన్‌ను నియమిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన తర్వాత సీనియారీ్టలో ఉన్న వారిని ప్రభుత్వం కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకుండా నేరుగా 19వ స్థానంలో నున్న వ్యక్తిని నియమి­స్తుండటం గమనార్హం. విష్ణువర్ధన్‌ కంటే ముందు 10 మంది వరకూ బీసీ, ఎస్సీ, ఎస్టీ సామా­జక వర్గాలకు చెందిన వైద్యులు ఉన్నారు. ఎఫ్‌ఏసీ ఇవ్వడానికి అన్ని అర్హతలున్నప్పటికీ వీరిలో ఏ ఒక్కరినీ కనీసం పరిగణనలోకి తీసుకోలేదు.

దీంతో చంద్రబాబు, ఆయా వర్గాల వారికి అత్యున్నత స్థానాల్లో కూర్చునే అవకాశం ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బాబు గద్దెనెక్కిన వెంటనే ఆయన సామాజికవర్గానికి చెందిన వారు పొరుగు శాఖల నుంచి డిప్యుటేషన్‌పై వైద్య శాఖలోని కీలక పోస్టుల్లో తిష్ట వేయడం మొదలు పెట్టారు. రూ.వేల కోట్ల వైద్య పరికరాల కొనుగోళ్లు చేపట్టే ఏపీఎంఎస్‌ఐడీసీలోని కీలక స్థానంతో పా­టు, మరో పోస్టులోనూ వారే ఉన్నారు.

ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో కీలక హోదాలో పొరుగు శాఖలోని సీఎం సామాజికవర్గానికి చెందిన అధికారి నియామకం కోసం వైద్య శాఖలో ఫైల్‌ ముందుకు కదులుతోంది. గతంలోనూ సదరు ఆ అధికారి ట్రస్ట్‌లో డిప్యుటేషన్‌పై పనిచేశారు. అప్పట్లో ఆరోపణలు రావడంతో డిప్యుటేషన్‌ రద్దు చేసి వెనక్కు పంపారు. ఈయన తిరిగి ట్రస్ట్‌లోకి రావడానికి ప్రయతి్నస్తున్న క్రమంలో కొందరు ఉద్యోగులు సైతం ఉన్నతాధికారులను కలిసి గతంలో జరిగిన విషయాలను మొరపెట్టుకున్నట్టు సమాచారం. 

ప్రమోషన్‌ పొందిన 15 మందికి పోస్టింగ్స్‌ 
ఇటీవల ప్రొఫెసర్‌ నుంచి ఏడీఎంఈలుగా ప్రమోషన్‌ పొందిన 15 మందికి ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్‌లుగా పోస్టింగ్‌లు ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి కార్యాలయం వెల్లడించింది. రాజమండ్రి ప్రిన్సిపల్‌గా డాక్టర్‌ ఎం.ఎస్‌ రాజును, డీఎంఈ కార్యాలయంలో ఏడీఎంఈగా డాక్టర్‌ కేవీవీ సత్యనారాయణమూర్తి, కాకినాడ ప్రిన్సిపల్‌గా డాక్టర్‌ పి.ఉషాకిరణ్,  పాడేరు ప్రిన్సిపల్‌గా డాక్టర్‌ బసుమిత్రదాస్, పిడుగురాళ్ల ప్రిన్సిపల్‌గా డాక్టర్‌ గోవింద్‌ నియామకం కానున్నారు. ఒంగోలు ప్రిన్సిపల్‌గా డాక్టర్‌ శివాని, విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ మన్మథరావును ఖరారు చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement