కౌలు రైతులకు చకచకా కార్డుల పంపిణీ  | Sakshi
Sakshi News home page

కౌలు రైతులకు చకచకా కార్డుల పంపిణీ 

Published Mon, Jun 19 2023 6:29 AM

Distribution of Koulu cards to tenant farmers Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: కౌలు రైతులకు పెద్దఎత్తున కౌలు కార్డులు జారీ చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సీసీఆర్‌సీ (క్రాప్‌ కల్టివేషన్‌ రైట్స్‌ కార్డ్స్‌) మేళాలు నిర్వహిస్తోంది. ఆర్బీకే స్థాయిలో మేళాలు నిర్వ­హించేలా వ్యవసాయ, రెవెన్యూ శాఖలు చర్యలు చేపట్టాయి. కౌలు రైతులకు నూరు శాతం పంట రుణాలు ఇవ్వాలన్న సంకల్పంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల­(పీఏసీ­ఎస్‌ల)ను ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీకేలతో అనుసంధానించింది. ప్రతి కౌలు రైతుకు రుణంతోపాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న భావనతో కౌలుదారులందరికీ పంట సాగు హక్కు పత్రాలు (కౌలు కార్డులు) జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది.

ఈ ఏడాది ఇప్పటికే 1.10 లక్షల మంది కౌలు రైతులకు కౌలు కార్డులను అధికారులు జారీ చేశారు. మిగిలిన వారికి జారీ చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారుల వివరాలను రైతు భరోసా పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసి ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఈ ఏడాది తొలివిడత సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రక్షణ కవచం సీసీఆర్‌సీ చట్టం
రాష్ట్రంలో 76.21 లక్షల మంది రైతులు ఉండగా.. వీరిలో కౌలు రైతులు ఎంతమంది ఉన్నారనే దానిపై వేర్వేరు అంచనాలు ఉన్నాయి. గతంలో కౌలుదారులు రుణాలు, ప్రభుత్వ సంక్షేమ ఫలాల కోసం నానాఅగచాట్లు పడేవారు. వీరికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు పంట రుణం అందించే అవకాశం ఉన్నా.. బ్యాంకులు నిబంధనల పేరుతో మొండిచేయి చూపేవి.

ఈ నేపథ్యంలో కౌలుదారులకు మేలు చేయాలన్న సంకల్పంతో 2019లో తెచ్చిన పంట సాగుదారుల హక్కు పత్రాల (సీసీఆర్‌సీ) చట్టంతో 11 నెలల కాల పరిమితితో ప్రభుత్వమే కౌలు కార్డులు జారీ చేస్తోంది. వీటిద్వారా కౌలు రైతులకు నాలుగేళ్లుగా పంట రుణాలతో పాటు వైఎస్సార్‌ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ, పంటల బీమా, పంట నష్టపరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) వంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. వీరు పండించిన పంటలను ఈ క్రాప్‌ ఆధారంగా ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారు. 

నూరు శాతం కౌలు కార్డుల జారీ లక్ష్యం
సీసీఆర్‌సీ మేళాలకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే 1.10 లక్షల మందికి కౌలు కార్డులు జారీ చేశాం. భూ యజమానులు సహకరిస్తే మరింత మందికి మేలుచేసే అవకాశం ఉంటుంది. సీసీఆర్‌సీ కార్డుల ఆధారంగా పంట రుణాలతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందచేస్తాం.
– చేవూరు హరికిరణ్, స్పెషల్‌ కమిషనర్, వ్యవసాయ శాఖ

Advertisement
Advertisement