రిజిస్ట్రేషన్‌ శాఖలో డిజిటల్‌ స్టాంపులు

Digital Stamps in Registration Department - Sakshi

స్టాంపులను డిజిటల్‌గా విక్రయించేందుకు కసరత్తు

ఈ–స్టాంపుల అధీకృత సంస్థ ఎస్‌హెచ్‌ఐఎల్‌కు బాధ్యతలు 

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, ఎస్‌హెచ్‌ఐఎల్‌ బ్రాంచిల అనుసంధానం

సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ల శాఖలో పూర్తి స్థాయిలో ఈ–స్టాంపుల (డిజిటల్‌ స్టాంపుల) వ్యవస్థను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాన్‌–జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్ల స్థానంలో ఈ వ్యవస్థను ప్రవేశపెడితే ఇప్పుడున్న అనేక సమస్యలకు చెక్‌ పెట్టవచ్చని భావిస్తోంది. రాష్ట్రంలో పలుచోట్ల ఈ–స్టాంపింగ్‌ సౌకర్యం ఉన్నా.. అది చాలా నామమాత్రంగానే అమలవుతోంది. రానున్న రోజుల్లో ఈ–స్టాంపుల విధానాన్నే పూర్తిగా అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాన్‌–జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్లు అన్ని రాష్ట్రాలకు నాసిక్‌లోని కేంద్ర ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి సరఫరా అవుతాయి. అవసరాన్ని బట్టి రూ.10, రూ.20, రూ.50, రూ.100 స్టాంప్‌ పేపర్లను రిజిస్ట్రేషన్ల శాఖ ఆర్డర్‌ ఇచ్చి తెచ్చుకుంటుంది.

అక్కడి నుంచి మన రాష్ట్రానికి వాటిని తీసుకురావడం, భద్రపర్చడం, జిల్లా రిజిస్ట్రార్లకు పంపడం, అక్కడ వారు భద్రపర్చడం, స్టాంపు వెండర్లకు సరఫరా చేయడం కష్టతరంగా మారింది. పోస్టాఫీసుల్లోనూ స్టాంప్‌ పేపర్లు అందుబాటులో ఉంచుతున్నా ఎక్కువ భాగం స్టాంప్‌ వెండర్ల ద్వారానే వీటి విక్రయం జరుగుతోంది. స్టాంప్‌ పేపర్లు ఆర్డర్‌ ఇవ్వడం నుంచి వెండర్ల ద్వారా విక్రయించడం వరకు అనేక సమస్యలు, వ్యయప్రయాసలు నెలకొంటున్నాయి. అవకతవకలకు ఆస్కారం ఏర్పడుతోంది. రవాణా, నిల్వ, సరఫరాకు రూ.కోట్లలో ఖర్చవడంతోపాటు పని భారం ఎక్కువవుతోంది. ఈ–స్టాంపుల వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రవేశపెడితే ఇవన్నీ పరిష్కారమయ్యే అవకాశం ఉంది.

ఎస్‌హెచ్‌ఐఎల్‌కు అప్పగింత
దేశంలో ఈ–స్టాంపుల వ్యవస్థను అమలు చేసే బాధ్యతల్ని కేంద్ర ప్రభుత్వం స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు (ఎస్‌హెచ్‌ఐఎల్‌) అప్పగించింది. పలు రాష్ట్రాల్లో ఈ సంస్థే ఈ–స్టాంపుల విధానాన్ని అమలు చేస్తోంది. మన రాష్ట్రంలోనూ ఈ సంస్థ రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా కొన్నిచోట్ల కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీన్ని మరింత విస్తృతం చేసేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ఎస్‌హెచ్‌ఐఎల్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఈ–స్టాంపుల విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఈ–స్టాంపింగ్‌ వ్యవస్థ పక్కాగా అమలవుతోంది. స్టాంప్‌ డ్యూటీని ఆన్‌లైన్‌లోనే చెల్లించి రిజిస్టర్‌ అయిన డాక్యుమెంట్‌ను నేరుగా డిజిటల్‌గా పొందవచ్చు. దీనివల్ల రిజిస్ట్రేషన్ల శాఖకు ఖర్చు, పని భారం తగ్గడంతోపాటు వినియోగదారులకు పని సులభమవుతుంది.

ఈ–స్టాంపింగ్‌ ద్వారా పారదర్శకత, పని సులభం
– వి.రామకృష్ణ, కమిషనర్‌ అండ్‌ ఐజీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌
ఈ–స్టాంపింగ్‌ ద్వారా పూర్తిస్థాయి పారదర్శకత ఏర్పడుతుంది. స్టాంప్‌ పేపర్లతో పనిలేకుండా అంతా డిజిటల్‌గా చేయడం వల్ల పని మరింత సులభతరమవుతుంది. కేంద్ర ప్రభుత్వ అధీకృత సంస్థ ఎస్‌హెచ్‌ఐఎల్‌ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. త్వరలో మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఈ–స్టాంపింగ్‌ను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top