ఇటు భానుడి భగభగ.. అటు వరుణుడి కరుణ
రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం
వచ్చే రెండు రోజులూ ఇదే పరిస్థితి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం భిన్నమైన వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల భానుడు ప్రతాపం చూపగా, కొన్ని ప్రాంతాల్లో జోరువాన ఉపశమనం కలిగించింది. విజయవాడ, చుట్టు పక్కల ప్రాంతాల్లో సాయంత్రం వరకూ మండుటెండతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి అక్కడక్కడా చిరు జల్లులు కురవడంతో సేదతీరారు. అలాగే శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జోరువాన కురిసింది.
తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపురంలో 5.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 5.2, ఏలూరు జిల్లా తదువైలో 4.7, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. పశ్చిమగోదావరి తణుకులోనూ జోరువాన కురిసింది.
ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అదే సమయంలో అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. వైఎస్సార్ కడప జిల్లా రాజుపాలెంలో 41.9, మార్కాపురం జిల్లా నందన మారెళ్లలో 40.7, నంద్యాల జిల్లా పేరుసోమలలో 40.6, నెల్లూరు జిల్లా వరికుంటపాడులో 40.3, అన్నమయ్య జిల్లా గోపిదిన్నెలో 40.1, కర్నూలు జిల్లా తోవిలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి వల్లే...
రాష్ట్రంలో మరో రెండు రోజులు ఇదేవిధమైన విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆకాశం మేఘావృతమై పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత ఉంటుందని పేర్కొన్నారు. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉండడంతో ఈ పరిస్థితి నెలకొందని వివరించారు.
మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు, చిల్లకూరు, గూడూరు మండలాలు, తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక, దొరవారిసత్రం, నాయుడుపేట, ఓజిలి, పెళ్ళకూరు మండలాల్లో ఎండ తీవ్రత, వడగాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది.


