కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు కష్టాలు | Devineni Avinash Fire On Chandrababu govt | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు కష్టాలు

May 2 2026 5:29 AM | Updated on May 2 2026 5:29 AM

Devineni Avinash Fire On Chandrababu govt

కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు కష్టాలు

పంటలు కొనుగోలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం

ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌

గంపలగూడెం మార్కెట్‌ యార్డులో ధాన్యం రాశుల పరిశీలన

గంపలగూడెం: చంద్రబాబు, కూటమి పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎన్టీఆర్‌ జిల్లా వై­ఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ ఆరోపించారు. శుక్రవారం ఆయన ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెంలో పర్యటించి ధాన్యం కొనుగోలుపై రైతులను ఆరా తీశారు. స్థానిక మార్కెట్‌యార్డులో వా­రాల తరబడి మొక్కజొన్న, ధాన్యాన్ని ఆరబోసి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న రైతులతో మాట్లాడి చలించిపోయారు.

అమ్మిరెడ్డిగూడెంలో పెద్ద ఎత్తున ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అవినాష్‌ మాట్లాడుతూ తెలంగాణలో మొక్కజొన్న క్వింటా రూ. 2400 వరకు కొనుగోలు చేస్తుంటే, ఇక్కడ రైతులకు రూ.1500 కూడా దక్కడం లేదన్నారు. ధాన్యం ఎక్కడపడితే అక్కడ రాశులు పోసి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలను పట్టించుకునే నాధుడు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి అధికారులు సైతం చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోందన్నారు.

రైతుల ఇబ్బందులు పట్టవా?
సాగు ఖర్చు పెరిగి, గిట్టుబాటు ధర లేక.. చివరికి పండిన పంటలు సైతం కొనేవారు లేక  రై­తులు ఇబ్బందులు పడుతుంటే మంత్రులు మాత్రం మలేసియా, సింగపూర్‌ ట్రిప్పులు వేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం తరలించడానికి వాహనాలు లేవు, సంచులు లేవు, రైతే ఖర్చు భరించి తరలించాలని అధికారులు సూచనలు చేయడం చంద్రబాబు ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనం అన్నా­రు. గతంలో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఆ మాటను నేడు నిజం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

రైతులు కన్నీరు పెడుతుంటే మంత్రి లోకేశ్‌ జాడ తెలియడం లేదని, మిగతా మంత్రులు మాట్లాడే ధైర్యం లేక మౌనం వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని అవినాష్‌ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం స్పందించేంత వరకూ పోరాటాలు చేస్తామన్నారు. ఆయన వెంట తిరువూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాసు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఏలూరు శివాజీ, ఉపాధ్యక్షుడు అత్త­నూరి వెంకట శివారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కావూరి వినయ్‌కుమార్, జెడ్పీటీసీ కోట శామ్యూల్, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement