వైద్య శాఖలో లీకువీరులు | Details of Upcoming Tenders Leaked in Department of Health: ap | Sakshi
Sakshi News home page

వైద్య శాఖలో లీకువీరులు

May 11 2026 6:12 AM | Updated on May 11 2026 6:12 AM

Details of Upcoming Tenders Leaked in Department of Health: ap

వైద్య పరికరాలు, ఇతర కొనుగోళ్లలో ‘ఢిల్లీ’ సంస్థకు దాసోహమైన ఏపీ ఎంఎస్‌ఐడీసీ  

త్వరలో టెండర్లు పిలిచే 100 రకాల సర్జికల్‌ సామగ్రి జాబితా ముందే లీక్‌ 

వైద్యశాఖ తమ గుప్పిట్లోనే ఉందని.. తమ ద్వారా వస్తేనే ఆర్డర్లు దక్కుతాయని ఢిల్లీ సంస్థ బెదిరింపులు 

భారీ కమీషన్ల కోసం ఢిల్లీ సంస్థకు మేలుచేస్తూ అక్రమాలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ ఎంఎస్‌ఐడీసీ)లో లీకువీరులు అధికమయ్యారు. ఏపీ ఎంఎస్‌ఐడీలో కమీషన్లకు కక్కుర్తిపడే వారిని ఎంపిక చేసుకున్న ఢిల్లీకి చెందిన ఓ సంస్థ  వైద్య శాఖలో పరికరాలు, ఇతర కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను ముందే తెలుసుకుంటూ వైద్యశాఖలోని టెండర్ల వ్యవహారాల్లో చక్రం తిప్పుతోంది. భారీ మొత్తంలో ముడుపులు ఆఫర్‌ చేస్తూ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, వైద్య శాఖ ఉన్నతాధికారికి సదరు సంస్థ నిర్వాహకులు దగ్గరైనట్టు సమాచారం. ఏపీఎంఎస్‌ఐడీసీలో తామేది చెబితే అదే జరుగుతుందంటూ ఫార్మా రంగంలో హల్‌చల్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. టెండర్లు పిలవడానికి ముందే ఎంఎస్‌ఐడీసీ నుంచి కీలక సమాచారం ఢిల్లీ సంస్థకు లీక్‌ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 

కంపెనీలతో మంతనాలతో బట్టబయలు 
రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులకు మందులు, సర్జికల్స్‌ సరఫరా కోసం రెండు, మూడేళ్లకు రేట్‌ కాంట్రాక్ట్‌(ఆర్‌సీ)ల కోసం టెండర్లు పిలుస్తుంటారు. ఈ క్రమంలో గతంలో ఖరారు చేసిన ఆర్‌సీల పరిమితి ముగుస్తుండటంతో సర్జికల్స్‌కు కొత్త ఆర్‌సీల కోసం టెండర్లు పిలవడానికి ఎంఎస్‌ఐడీసీలో కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. టెండర్‌ నోటిఫికేషన్‌ వెలువడక ముందే ఎస్‌ఎంఐడీసీలోని లీకువీరులు 100 రకాలకుపైగా వస్తువుల పేర్లు, వాటి స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలు ఢిల్లీ సంస్థకు లీక్‌ చేశారు. దీంతో సదరు సంస్థ నిర్వాహకులు నేరుగా ఫార్మా కంపెనీలతో మంతనాలు చేయడం మొదలు పెట్టారు. దేశీ, విదేశీ సర్జికల్‌ సామగ్రి తయారీ కంపెనీలను సంప్రదించి ‘ఏపీ టెండర్లు మాకే వస్తాయి. ఎంఎస్‌ఐడీసీ మా గుప్పిట్లోనే ఉంది. 

మా ద్వారా వస్తేనే మీ కంపెనీలకు ఆర్డర్లు దక్కుతాయి’ అంటూ ఆయా కంపెనీలతో బేరసారాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. టెండర్‌ నిబంధనలు సైతం తమకు అనుకూలమైన కంపెనీలు మాత్రమే పాల్గొనేలా ఉంటాయని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ విషయాన్ని ఆయా కంపెనీలు ఇప్పటికే తమకు డిస్ట్రి్టబ్యూటర్లుగా వ్యవహరిస్తున్న సంస్థలతో పంచుకోగా మొత్తం వ్యవహారం బట్టబయలైంది. చంద్రబాబు సర్కారు వచి్చనప్పటినుంచి వైద్య శాఖలో ఢిల్లీ సంస్థ హవా పెరిగిపోయింది. ఈ సంస్థ సరఫరా చేసే పరికరాలు నాణ్యమైనవి కాదని గతంలో అనేకమార్లు తిరస్కరణకు గురయ్యాయి. అయినా ఇప్పుడీ సంస్థ సరఫరా చేసే పరికరాలనే కొనుగోలు చేయించేలా వ్యవహారాలు నడుస్తున్నాయి.

వైద్యుల మెడపై కత్తిపెట్టి రీ–డెమో 
ఢిల్లీ సంస్థకు కాంట్రాక్ట్‌ కట్టబెట్టడం కోసం కొద్ది నెలలుగా వెంటిలేటర్లు, అనస్థీషియా వర్క్‌స్టేషన్స్, ఆపరేషన్‌ థియేటర్‌(ఓటీ) లైట్స్‌ టెండర్‌ను ప్రభుత్వం సాగదీస్తోందనే ఆరోపణలున్నాయి. బోధనాస్పత్రులకు వీడియో రికార్డింగ్‌ సౌకర్యం ఉన్న ఆధునిక ఓటీ లైట్స్‌ కొనుగోలు చేసేలా నిబంధనలు రూపొందించడంతో గత ప్రభుత్వంలో రెండు పర్యాయాలు ఢిల్లీ సంస్థకు అర్హత దక్కలేదు. దీంతో ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలు లేకుండా సాధారణ ఓటీ లైట్స్‌ కొనుగోలుకు నిబంధనల్లో మార్పులు తెచ్చారు. గత నెలలో వెంటిలేటర్ల పనితీరుపై డెమోలు నిర్వహించగా ఢిల్లీ సంస్థ పరికరాలను వైద్యులు తిరస్కరించారు.

ఈ క్రమంలో సాక్షాత్తు వైద్య శాఖ ఉన్నతాధికారి నిబంధనలకు వ్యతిరేకంగా రీ–డెమో నిర్వహించారు. అంతేకాకుండా వైద్యుల మెడపై కత్తి పెట్టినట్టుగా బెదిరించి మరీ సదరు సంస్థ పరికరాలకు అర్హత కల్పించినట్టు వైద్యవర్గాల్లో చర్చ నడుస్తోంది. అనస్థీíÙయా వర్క్‌ స్టేషన్‌కు సంబంధించిన టెండర్‌లో ఢిల్లీ సంస్థ ఆథరైజేషన్‌ లెటర్‌ లేకుండానే బిడ్‌ వేసింది. మరోవైపు టెండర్‌ నిబంధనల ప్రకారం వర్క్‌స్టేషన్, మానిటర్‌ రెండు ఒకే కంపెనీవి అయి ఉండాలి. అయితే వేర్వేరు కంపెనీల పరికరాలను సరఫరా చేసేలా బిడ్‌లో కోట్‌ చేసింది. వాస్తవానికి ఈ బిడ్‌ పరిశీలన దశలోనే తిరస్కరించాల్సి ఉండగా ఆ పని చేయలేదు. డెమోకు కూడా ఆహ్వానించారు. పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో రూ.93 లక్షలకు కొనుగోలు చేసిన మామోగ్రఫీ పరికరాన్ని మన దగ్గర ఢిల్లీ సంస్థ ద్వారా రూ.1.71 కోట్లకు కొనుగోలు చేసేలా గతేడాది కాంట్రాక్ట్‌ 
ఇచ్చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement