మోంథా తుపాను కాకినాడ జిల్లా వాసుల్లో భయాందోళన రేపుతోంది. పెను తుపానుగా మారి ఊహించని రీతిలో విధ్వంసం కలిగిస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా ప్రజలు భీతిల్లుతున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. పెను తుపానుగా మారిపోయి, కాకినాడ సమీపంలో తీర దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. తుపాను తీరం దాటే సమయంలో సుమారు 110 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తాయని, కుండపోతగా వర్షం పడుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో 1996 నాటి ప్రళయాన్ని గుర్తు చేసుకుని కాకినాడ జిల్లా వాసులు కంపితులవుతున్నారు.
1996 ప్రళయం
1996 నవంబరు 6న కాకినాడ – యానాం మధ్య తీరం దాటిన ప్రపంచ తుపాను కోనసీమను కకావికలం చేసింది. సుమారు 215 కిలోమీటర్ల వేగంతో వీచిన పెను గాలులు ధాటికి కోనసీమ ప్రాంతం చిన్నాభిన్నమైంది. సముద్ర తీరంలో అలలు భారీ ఎత్తున అలలు ఎగసిపడి ఉప్పెన ముంచెత్తడంతో కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో సముద్ర తీర మత్స్యకార గ్రామాలు ధ్వంసమయ్యాయి. కాట్రేనికోన మండలం భైరవపాలెం, బలుసుతిప్ప గ్రామాలు నామరూపాల్లేకుండా పోయాయి.
భారీగా ప్రాణ, ఆస్తి నష్టం
అధికారిక లెక్కల ప్రకారం.. నాటి తుపాను బీభత్సానికి 1,077 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 2.25 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 6.47 లక్షల ఇళ్లు దెబ్బ తిన్నాయి. వీటిలో 40 వేల ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. వేలాది పశువులు, మూగ ప్రాణులు మృత్యువాత పడ్డాయి. 5.97 లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. 20 లక్షలకు పైగా కొబ్బరి చెట్లు నేల కూలాయి. ఆ తుపాను వచ్చి సుమారు 30 ఏళ్లవుతున్నా నాటి విషాదం ఈ ప్రాంత వాసులకు ఇప్పటికీ కళ్ల ముందే కదలాడుతోంది.
ప్రభుత్వ వైఫల్యం
1996 నాటి తుపాను నుంచి కోలుకునేందుకు కోనసీమ (Konaseema) వాసులకు పదేళ్ల సమయం పట్టిందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నాటి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి చంబ్రాబు నాయుడు సీఎంగా ఉన్నారు. తుపాను ముందు హెచ్చరికలు చేయకపోవడంతో పాటు కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోవడంతో కోనసీమకు తీరని నష్టం జరిగింది.

ప్రస్తుతం.. అప్రమత్తం
నాటి అనుభవాలను గమనంలోకి తీసుకుని కాకినాడ జిల్లా (Kakinada District) అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మోంథా తుపాను (Cyclone Montha) నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఉప్పాడ రోడ్డును ముందు జాగ్రత్తగా మూసివేశారు. జిల్లాలోని స్కూల్స్, కాలేజీలు అన్నింటికీ నాలుగు రోజులు సెలువులు ప్రకటించారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకుండా కట్టడి చేశారు. అలాగే పొలం పనులను వాయిదా వేసుకోవాలని రైతులకు సూచించారు.
చదవండి: కాకినాడ తీరానికి ఉప్పెన ముప్పు!
గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులందరినీ అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొవడానికి సిద్ధం చేశారు. కలెక్టర్ షణ్మోహన్ సగిలితో పాటు జిల్లా ప్రత్యేక అధికారి మైలవరపు కృష్ణతేజ (Krishna Teja Mylavarapu) ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, కిందిస్థాయి అధికారులకు తగువిధంగా ఆదేశాలిస్తున్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సహాయక చర్యలను అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా వైద్యపరంగా అన్ని జాగ్రత్తలు చేపడుతున్నారు.



