కరోనా మరణాలతో ఉలిక్కిపడిన ఏపీ | Covid chaos in the state again | Sakshi
Sakshi News home page

కరోనా మరణాలతో ఉలిక్కిపడిన ఏపీ

Jul 9 2026 5:59 AM | Updated on Jul 9 2026 6:52 AM

Covid chaos in the state again

వైఎస్సార్‌ కడప జిల్లాలో ఇద్దరు మృతి 

మృతులిద్దరికీ ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లో పాజిటివ్‌గా నిర్ధారణ 

బుధవారం వరకు ప్రభుత్వానికి తెలియక పోవడంపై చర్చ  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు వైరస్‌ బారినపడి మంగళవారం మృతి చెందడంతో ఒక్కసారిగా వైద్య శాఖ ఉలిక్కి పడింది. మృతులిద్దరికీ ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లో పాజిటివ్‌ అని తేలడంతో తదుపరి నిర్ధారణ పరీక్ష కోసం వారి నమూనాలను మహారాష్ట్రలోని పూణే వైరాలజీ ల్యాబ్‌కు పంపడానికి కడప జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మృతుల్లో ఒకరికి 43 ఏళ్లు, మరొకరికి 60 ఏళ్లుపైనే ఉన్నాయని తెలిసింది. 43 ఏళ్ల వ్యక్తి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృత్యువాత పడగా, 60 ఏళ్లుపైబడిన వ్యక్తి తమిళనాడు రాష్ట్రంలోని సీఎంసీ వెల్లూరులో చికిత్స పొందుతూ మరణించారు. 

కడప జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లూరు సీఎంసీతో సంప్రదించి అక్కడ మృతి చెందిన వ్యక్తి నమూనాలు సేకరించే పనిలో పడ్డారు. అయితే టెక్నాలజీ వాడకంలో ఎంతో ముందున్నామని చెప్పే సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి ఈ మృతుల గురించి బుధవారం వరకు తెలియక పోవడం గమనార్హం. కోవిడ్‌తో ఇద్దరు మృతి చెందారనే విషయం రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి బుధవారం తెలిసింది. 

డయేరియా, కలరా, అంతుచిక్కని వ్యాధులతో పాటు, కోవిడ్‌తో ప్రజలు మరణించాక కూడా ప్రభుత్వానికి కనీస సమాచారం ఉండటం లేదు. విజయనగరం జిల్లా గుర్లలో కలరా వ్యాప్తి, గతేడాది గుంటూరు రూరల్‌ తురకపాలెంలో అంతుచిక్కని వ్యాధితో మరణాలు వంటి ఇతర ఘటనల్లో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇది పాలనలో వైఫల్యమే కాకుండా, ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని వైద్య శాఖలో చర్చ జరుగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement