ఎస్‌పీఎంలో మరమ్మతులకు వచ్చిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు (ఫైల్)
ట్రాన్స్‌కోలో అంతులేని అవినీతి
ఎస్‌పీఎంలలో కోట్ల విలువైన స్క్రాప్, ట్రాన్స్‌ఫార్మర్లు మాయం
ఎస్‌ఈలకు తెలిసే ఎస్‌పీఎంలలో స్కాం జరిగినట్టు నిర్ధారణ
కీలకమైన వారి పేర్లు బయటపెట్టిన విజిలెన్స్ రిపోర్ట్
ఏడాది పాటు నివేదికను తొక్కిపెట్టిన సంస్థలోని ఓ కీలక డైరెక్టర్
ఎస్‌పీఎంలలో స్కాంకు సహకరించిన ఎస్‌ఈలకే వరుస ప్రమోషన్లు
రిటైర్మెంట్‌లతో గుట్టుగా తప్పించుకుంటున్న కీలక పాత్రధారులు
తిరుపతి డిస్కంలో బయటపడిన ‘తుక్కు స్కాం’ ఇప్పుడు విద్యుత్ శాఖనే కుదిపేస్తోంది. కోట్ల రూపాయల విలువైన స్క్రాప్ మెటీరియల్, ట్రాన్స్‌ఫార్మర్లు మాయమైనా బాధ్యులపై చర్యలు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. విజిలెన్స్ విచారణలో అధికారుల నిర్లక్ష్యం, అక్రమాలకు సహకారం స్పష్టంగా బయటపడినప్పటికీ, ఆ నివేదికను ఏడాది పాటు సంస్థలోని ఓ డైరెక్టర్ స్థాయి అధికారి మూలన పడేయడం దుమారం రేపుతోంది.
తనిఖీలు చేయాల్సిన అధికారులు కళ్లుమూసుకోగా, అదే స్కాంలో పాత్రదారులైన వారికి వరుస పదోన్నతులు రావడం మరింత వివాదాస్పదమైంది. మరోవైపు కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఈ స్థాయి అధికారులు ఎలాంటి చర్యలు ఎదుర్కోకుండానే రిటైర్మెంట్‌తో సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోవడం హాట్ టాఫిక్‌గా మారుతోంది. ఉమ్మడి చిత్తూరు జల్లా పరిధిలో పెద్ద ఎత్తున ‘తుక్కు దందా’ జరిగినట్టు స్పష్టమవుతోంది. ట్రాన్స్‌కోలో తుక్కు అవినీతిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
సాక్షి, టాస్‌్కఫోర్స్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ స్థాయిలో తుక్కు అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ నివేదికలో వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. డిస్కం పరిధిలోని పలు ఎస్‌పీఎం (స్టోర్–ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ యూనిట్లు)ల్లో కోట్ల విలువైన స్క్రాప్ మెటీరియల్ మాయమైనట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. వినియోగంలో లేని పాత ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ సామగ్రి, కాపర్ కేబుల్స్, అల్యూమినియం, ఇనుప సామగ్రి తదితర వస్తువులు అధికారిక రికార్డుల్లో ఉన్నప్పటికీ, భౌతికంగా కనిపించకపోవడం స్కాంను బట్టయలు చేస్తోంది. ముఖ్యంగా పీలేరు, పలమనేరు, మదనపల్లి ఎస్‌పీఎంలలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు తమ నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం.
ఎస్‌ఈల నిర్లక్ష్యమే కారణం
ఎస్‌పీఎంలపై పర్యవేక్షణ బాధ్యత వహించే సూపరింటెండింగ్ ఇంజినీర్లు (ఎస్‌ఈలు) ప్రతి ఆరు నెలలకోసారి తనిఖీలు నిర్వహించాలి. అయితే ఆ తనిఖీలు సక్రమంగా జరగక పోవడం, ఒకరిద్దరు ఎస్‌ఈలు అక్కడ స్కాం జరుగుతున్నట్టు తెలిసినా తనిఖీలకు వెళ్లకపోవడం వల్లే కోట్ల రూపాయల స్కాంకు అవకాశం దొరికిందని విజిలెన్స్ తమ నివేదికలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అంతేగాక ఎస్‌పీఎంలలో తప్పు జరుగుతోందని డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీరు స్థాయి అధికారి తన పైఅధికారి అయిన ఎస్‌ఈకి రాత పూర్వకంగా సమాచారం పంపినా సదరు ఎస్‌ఈ సకాలంలో స్పందించలేదన్న విషయాన్ని కూడా విజిలెన్స్ అధికారులు తమ రిపోర్టులో తెలియజేసినట్టు సమాచారం.
ఏడాదిగా మూలన పడ్డ విజిలెన్స్ రిపోర్ట్
తుక్కు స్కాంను బయటపెట్టిన విజిలెన్స్ రిపోర్టును ఎస్పీడీసీఎల్ అధికారులకు ఇచ్చినప్పటికీ సంస్థలోని ఓ కీలక డైరెక్టర్ ఏడాదిగా బయటకు రానివ్వలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇది బయటకు వస్తే ఉన్నత స్థాయి అధికారులపై చర్యలు తప్పవన్న ఉద్దేశంతోనే తొక్కిపెట్టారన్న అనుమానాలు ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది. విజిలెన్స్ నివేదిక బయటకు రానందున తప్పునకు సహకరించిన ఆ ఉన్నత స్థాయి అధికారులపై చర్యలు తీసుకునే ప్రక్రియ నిలిచిపోయిందని ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది.
రిటైర్మెంట్‌తో సేఫ్ గేమ్
తుక్కు స్కాంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు అధికారులు వరుస పదోన్నతులతో పాటు పదవీ విరమణ చేసి సేఫ్ జోన్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. విజిలెన్స్ నివేదికను దాచిపెట్టి విచారణ ఆలస్యం చేయడం వల్లే వారు ఎలాంటి చర్యలు ఎదుర్కోకుండానే రిటైర్డ్‡ అయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ స్కాంలో సుమారుగా రూ.25 కోట్లు మేరకు సంస్థకు నష్టం వాటిల్లినా, బాధ్యులు మాత్రం సురక్షితంగా తప్పించుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం తుక్కు స్కాంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్క్రాప్ మెటీరియల్ మాయం ద్వారా ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది..? ఇందులో ఎవరి పాత్ర ఎంత..? విజిలెన్స్ నివేదికను ఎందుకు దాచిపెట్టారు..? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. బాధ్యులైన వారి నుంచి సంస్థ ఆదాయానికి నష్టం కలిగిన రూ.25 కోట్లను రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తప్పు చేసిన వారికే పదోన్నతులా?
విజిలెన్స్ నివేదికలో పేర్లు వచ్చిన కొందరు అధికారులకు వరుసగా పదోన్నతులు లభించడం ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. స్క్రాప్ స్కాంకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొనే ఎస్‌ఈలకు ప్రమోషన్లు కల్పించి క్షేత్ర స్థాయిలో పనిచేసే ఒకరిద్దరిపై చర్యలు తీసుకోవడం వెనుక సంస్థలోని ఓ డైరెక్టర్ అండదండలు ఉన్నాయా..? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజాయితీగా పనిచేసే అధికారులను పక్కనబెట్టి, అక్రమాలకు సహకరించిన వారినే ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు విద్యుత్ ఉద్యోగుల్లో బలంగా వినిపిస్తోంది.


