శవం తెచ్చిన తంటా.. ఇద్దరు ఆలయ అధికారుల సస్పెండ్‌

A corpse Caused To Suspended Of 2 Temple Employees In Chittoor - Sakshi

ఇద్దరు ఆలయ ఉద్యోగులపై వేటు

మరో ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు

సాక్షి, శ్రీకాళహస్తి: ఓ మృతదేహం పెద్ద ఉపద్రవమే తెచ్చింది. ఇద్దరు ఆలయ ఉద్యోగులపై వేటు పడేలా చేసింది. మరో ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపునకు కారణమైంది. ఆ మృతదేహం కథేమిటో తెలుసుకోవాలంటే.. ముక్కంటి ఆలయ అనుబంధ భరద్వాజ తీర్థంలోని భరద్వాజేశ్వరాలయ సమీపంలో సోమవారం రాత్రి  అధికారుల అనుమతి లేకుండా 7 గంటల సమయంలో ఓ మృతదేహాన్ని ఖననం చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం దిరశనమాల గ్రామానికి చెందిన అనిల్‌ (34) మృతదేహమది. స్థానికంగా ముక్కంటీశుని ఆలయం వద్ద ఓ కుంకుమ దుకాణంలో అతడు పనిచేసేవాడు. అనారోగ్యం బారినపడి చనిపోయాడు. ఓ వాహనంలో మృతదేహాన్ని తీసుకొచ్చి భరద్వాజ తీర్థంలో ఆలయం పక్కన ఖననం చేశారు. ఇక్కడ అవధూతగా ఉంటూ వచ్చిన కోట్లమ్మ శిష్యుడు అనిల్‌ అని, అందుకే ఆయన్ను ఇక్కడ ఖననం చేశామని ఖననం చేసిన వారు ప్రచారం చేశారు.

అయితే మృతునికి భార్య, ఓ పాప కూడా ఉండడంతో అతడిని ఎలా అవధూతగా చెబుతారని కొందరు ప్రశ్నించినా సమాధానం కరువైంది. ఇది కాస్తా చర్చనీయాంశమై ఆలయ ఈఓ పెద్ది రాజు దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. మృతదేహాన్ని ఖననం చేస్తున్నట్లు ఉద్యోగుల దృష్టికి వచ్చినా అడ్డుకోకపోవడంపై ఆగ్రహించారు. దీనికి బాధ్యులను చేస్తూ భద్రతాధికారిగా ఉన్న ఏఈఓ శ్రీనివాసరెడ్డిని, భరద్వాజేశ్వరాలయం అర్చకుడు అనిల్‌కుమార్‌ స్వామిని సస్పెండ్‌ చేశారు. అలాగే కాంట్రాక్ట్‌ సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ శ్రీనివాసులు, సెక్యూరిటీ గార్డు శేఖర్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యలకుగాను దేవదాయ కమిషనర్‌కు నివేదించారు. అలాగే, ఒకటవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదలా ఉంచితే, సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి భరద్వాజేశ్వరాలయ ప్రాంతంలోని సీసీ కెమెరాలు ఇప్పటివరకు పనిచేయకపోవడం..ఆ సమయంలోనే మృతదేహాన్ని ఖననం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.      

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top