విజయవాడ ధర్నాచౌక్‌లో ధర్నా చేస్తున్న సిహెచ్‌వోలు
చిరుద్యోగులకు మానసిక క్షోభ
వేధింపులను ప్రభుత్వం తక్షణమే ఆపాలి
కోతలు లేని ఇన్సెంటివ్ ఇవ్వాలి
ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పించాలి
స్పందించకుంటే ఉద్యమం ఉధృతం
ప్రభుత్వానికి సీహెచ్‌వోల అల్టిమేటం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు ఉద్యోగులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోందని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)లు మండిపడ్డారు. విజయవాడలోని ధర్నా చౌక్‌లో సోమవారం సర్కారు తీరుపై గళమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన సీహెచ్‌వోలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీహెచ్‌వోలు మాట్లాడుతూ రాత్రిపూట ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్‌ఆర్‌ఎస్) హాజరు పేరిట ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోతలు లేని ఇన్సెంటివ్ ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకూ పెండింగ్‌లో ఉన్న ఇన్సెంటివ్ బకాయిలు అన్నింటినీ వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ భద్రత కోసం వెంటనే కమిటీని వేయాలని, ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) సౌకర్యాన్ని తక్షణం పునరుద్ధరించాలని డిమాండ్‌చేశారు.
అద్దె భవనాల్లో కొనసాగుతున్న విలేజ్ క్లినిక్స్‌కు మూడు నెలల అడ్వాన్స్ రెంట్ చెల్లించాలని కోరారు. అద్దె బకాయిలు పేరుకుపోవడంతో యజమానుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. సీహెచ్‌వోల ధర్మ పోరాటానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎ.వి. నాగేశ్వరరావు, ఐద్వా నేత రమాదేవి సంఘీభావం తెలిపారు. అనంతరం నాగేశ్వరావు మాట్లాడుతూ సీహెచ్‌వోల పట్ల ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఈ సర్కారు ఉద్యోగ ద్రోహి అని అభివర్ణించారు.
రాత్రి ఎనిమిది గంటలకు హాజరు వేయాలని ప్రభుత్వమే కార్మీక చట్టాలను అతిక్రమించడం తగదన్నారు. రమాదేవి మాట్లాడుతూ రాత్రి హాజరుతో ముడిపెట్టి ఇన్సెంటివ్స్‌లో కోతలు పెట్టి చిరుద్యోగులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి సీహెచ్‌వోల ఉద్యోగ క్రమబద్ధికరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సీహెచ్‌వోల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రియాంక మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ప్రేమ్, సంయుక్త కార్యదర్శి సుధాకర్, కోశాధికారి సిద్దు పాల్గొన్నారు.


