వైఎస్సార్‌ జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకుంది

CM YS Jaganmohan Reddy Comments At Proddatur Public Meeting - Sakshi

మీలో ఒకడిగా తోడుంటాను

ప్రొద్దుటూరు సభలో సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి ప్రతినిధి, కడప: ‘నాన్న చనిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు వైఎస్సార్‌ జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంది. ప్రతి ఇంట్లో ఒక అన్న, తమ్ముడు, కొడుకుగా ఆశీర్వదించారు. ఈ రోజు మీ బిడ్డ ఈ స్థానంలో ఉన్నాడన్నా, ఇవన్నీ చేయగలుగుతున్నాడన్నా.. ఇదంతా దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులే’ అని సీఎం జగన్‌ అన్నారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఆయన ప్రొద్దుటూరులో రూ.515.90 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు.

ప్రొద్దుటూరు రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో పేదల ఇళ్ల కోసం ప్రభుత్వ స్థలాలు లేకపోతే ఏకంగా రూ.200 కోట్లు మంజూరు చేసి.. 22,212 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగామన్నారు. ‘ఇక్కడున్న సమస్యలు, పరిస్థితులు తెలిసిన వ్యక్తిని. ఈ జిల్లాలో ఏం జరిగినా అన్ని రకాలుగా ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాను. గత నెలలో అన్నమయ్య సాగర్, పింఛా రిజర్వాయర్‌లు తెగిపోయి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగింది. ఎంతో బాధనిపించింది.

ఈ జిల్లా వాడిగా, మీ బిడ్డగా బరువెక్కిన గుండెతో ఒక్క మాట చెబుతున్నాను. ఆ కుటుంబాలకు చనిపోయిన మనుషులనైతే  తెప్పించలేను గానీ, ఆ కుటుంబ సభ్యులలో ఒకడిగా అన్ని రకాలుగా తోడుగా ఉంటానని భరోసా ఇస్తున్నాను. మీ అందరి ప్రేమానురాగాల మధ్య ఈ రోజు ఇన్ని మంచి పనులకు శ్రీకారం చుడుతున్నాను. మీ అందరికీ ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు.

లక్షాధికారులుగా రైతులు 
► గోపవరం జాయింట్‌ ఫార్మింగ్‌ కో ఆపరేటివ్‌ సోసైటీ ప్రాజెక్టు భూముల్లో కొంత భాగాన్ని వ్యవసాయ–పారిశ్రామిక హబ్‌ ఏర్పాటుకు తీసుకున్నారు. ఇందులో లీజు ద్వారా భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ప్రస్తుతం రెండు ఎకరాల వంతున 201 మందికి పట్టాలు అందజేశారు.  
► ఈ సందర్భంగా పట్టాలు అందుకున్న ఎస్సీ రైతులు దేవదాసు, మాతంగి పుట్టి, రవీంద్రబాబు మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమకు పెద్ద పీట వేశారని సంతోషం వ్యక్తం చేశారు. భారీ పరిశ్రమకు సమీపంలో తమకు రెండు ఎకరాలకు పట్టా ఇచ్చి లక్షాధికారులుగా చేస్తున్నారన్నారు.   
► ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం అంజద్‌బాష, మంత్రులు గౌతమ్‌రెడ్డి, సురేష్, ధర్మాన కృష్ణదాస్, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, శాసన మండలి వైస్‌ ఛైర్మన్‌ జకియాఖానం, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.   
లీజు ద్వారా భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు పంపిణీ చేస్తున్న సీఎం జగన్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top