మే నాటికి పనులు పూర్తవ్వాలి: సీఎం జగన్‌ | CM YS Jagan Review Meeting Today Over Irrigation Projects | Sakshi
Sakshi News home page

‘గ్రావిటీ ద్వారా నీటిని పంపే ఏర్పాటును పరిశీలించండి’

Nov 11 2020 8:19 PM | Updated on Nov 11 2020 8:54 PM

CM YS Jagan Review Meeting Today Over Irrigation Projects - Sakshi

రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు పనుల కోసం ఉద్దేశించిన ఎస్పీవీ (స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌) రిజిస్ట్రేషన్‌ పూర్తైందని తెలిపిన అధికారులు అందుకు సంబంధించిన లోగోను చూపారు. ఇందుకు అంగీకారం తెలిపిన సీఎం జగన్‌... ఈ మేరకు ముందుకు వెళ్లాలని నిర్దేశించారు.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలవరం, వెలిగొండ, అవుకు టన్నెల్‌ -2  పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వివిధ సాగునీటి ప్రాజెక్టుల పురోగతి అంశంపై సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. నీటి పారుదలా శాఖా మంత్రి అనిల్‌ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఈఎన్‌సీ నారాయణరెడ్డితో పాటు ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మే నాటికి పనులు పూర్తవ్వాలి
సమీక్షా సమావేశంలో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్, కాలువలుకు సంబంధించి పనుల పురోగతిని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, నిర్ణీత వ్యవధిలో పాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. కాగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్రోచ్, స్పిల్‌ ఛానెల్‌ పనులు మే నాటికి పూర్తి చేయాలని, అంతకు ముందే కాఫర్‌ డ్యాం పనులు కూడా పూర్తి చేయాలని సీఎం ఈ సందర్భంగా వారిని ఆదేశించారు. అంతేగాకుండా పోలవరం నుంచి విశాఖపట్నం తాగు నీటి అవసరాలు తీర్చేలా ప్రత్యేక పైప్‌ లైన్‌ ఏర్పాటు కోసం కూడా ఆలోచన చేయాలని నిర్దేశించారు.

అదే విధంగా, ఎటువంటి పంపింగ్‌ లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని పంపించే ఏర్పాటును పరిశీలించాలని, తద్వారా పవర్‌ వినియోగం లేకుండా చేసే అవకాశాలనూ చూడాలన్నారు. పోలవరం ప్రాజెక్టులో నీరు 41.15 అడుగుల స్థాయికి చేరినప్పుడు కూడా బ్యాక్‌ వాటర్‌ (అప్లెక్స్‌ లెవల్‌)తో ఎక్కడా ఏ సమస్యలు తలెత్తకుండా భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ పూర్తి చేసి నిర్వాసితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం జగన్‌ అదేశించారు. (చదవండి: మోదీ, షాలకు సీఎం జగన్‌ కృతజ్ఞతలు)

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు..
ప్రకాశం జిల్లాలోని పూలసుబ్బయ్య  వెలిగొండ ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటరీ పనులకు సంబంధించి, ఈ ప్రాజెక్టులోని మొదటి సొరంగం పనులు దాదాపు పూర్తయ్యాయని, రెండో సొరంగం పనులు ఆగస్టు నాటికి పూర్తి చేసి రెండు టన్నెల్స్‌లో నీళ్లిచ్చే కార్యక్రమం చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం నెలవారీ ప్రణాళిక మేరకు నిధులు విడుదల చేయాలని సీఎం జగన్‌ వారిని ఆదేశించారు. 

అవుకు టన్నెల్‌-2
అవుకు టన్నెల్‌-2 పనుల్లో ఫాల్ట్‌ జోన్‌లో మిగిలిన 137 మీటర్లు సొరంగం పనిని మార్చి నాటికి పూర్తి చేసి, వచ్చే ఖరీఫ్ సీజన్‌ నాటికి మొత్తంగా 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. అదే విధంగా, అవుకు మూడో టన్నెల్‌కి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తైందని అధికారులు వివరించగా... సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు పనుల కోసం ఉద్దేశించిన ఎస్పీవీ (స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌) రిజిస్ట్రేషన్‌ పూర్తైందని తెలిపిన అధికారులు అందుకు సంబంధించిన లోగోను చూపారు. 

ఇందుకు అంగీకారం తెలిపిన సీఎం జగన్‌... ఈ మేరకు ముందుకు వెళ్లాలని నిర్దేశించారు. మరోవైపు చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరులో తొలిసారి పూర్తి సామర్థ్యం మేరకు 10 టీఎంసీల నీటిని నింపి.. రైతులకు నీరు విడుదల చేసిన విషయాన్ని తెలపగా... ఇప్పటికైనా పూర్తి సామర్థ్యంతో ప్రాజెక్టులు నింపగలిగామని అన్నారు. అదే విధంగా గండికోటలో కూడా ప్రస్తుత నీటి నిల్వ 18 టీఎంసీలు.. గతంలో కంటే అధిక స్ధాయిలో నిల్వచేయగలిగామని అధికారులు తెలపగా... 20 టీఎంసీల వరకు నిల్వ చేయాలని సీఎం ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement