చూడచక్కని బడి | CM YS Jagan held a high-level review on the progress of Manabadi Nadu Nedu | Sakshi
Sakshi News home page

చూడచక్కని బడి

Aug 5 2020 2:52 AM | Updated on Aug 5 2020 8:20 AM

CM YS Jagan held a high-level review on the progress of Manabadi Nadu Nedu - Sakshi

సాక్షి, అమరావతి:  మనబడి నాడు–నేడు రెండో దశ కార్యక్రమం ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. మొదటి దశలో దాదాపు 15వేలకు పైగా పాఠశాలలకు  మహర్దశ పట్టింది. రెండో దశలో మరో 14,584 పాఠశాలలు, విద్యాసంస్థలకు కొత్తరూపు తీసుకురానున్నారు. నాడు–నేడు కార్యక్రమం పనుల పురోగతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెండో దశ పనులకు సంబంధించి సీఎం కీలక ఆదేశాలు జారీచేశారు.

రెండు నెలల్లో వాటర్‌ ప్లాంట్లు..
► అన్ని స్కూళ్లలో పిల్లలకు పరిశుభ్రమైన తాగునీరు అందించేలా మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను కంపెనీలకు అప్పగించాలన్నారు. అక్టోబర్‌ నాటికి వాటిని ఏర్పాటుచేస్తామని అధికారులు చెప్పారు.
► నాడు–నేడులో మిగిలిన 31,073 స్కూళ్లు, విద్యా సంస్థలలో దాదాపు రూ.7,701 కోట్ల వ్యయంతో పనులు చేపట్టాల్సి ఉందని సమావేశంలో అధికారులు వెల్లడించారు. 
► రెండో దశలో 14,584 స్కూళ్లు, విద్యా సంస్థల్లో పనులకు రూ.4,732 కోట్లు వ్యయమవుతుందని.. ఈ నెలాఖరులోగా వాటిని గుర్తించి, ఈ ఏడాది నవంబర్‌ 14న పనులు ప్రారంభించి వచ్చే జూన్‌ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
► అదే విధంగా.. మూడో దశలో 16,489 స్కూళ్లు, విద్యా సంస్థల్లో రూ.2,969 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. వచ్చే ఏడాది జూన్‌ 30 నాటికి వీటిని గుర్తించి, నవంబర్‌ 14, 2021 నుంచి పనులు ప్రారంభించి 2022 జూన్‌ 30 నాటికి పూర్తిచేయనున్నారు.
► పనులన్నీ షెడ్యూల్‌ ప్రకారం కొనసాగించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. అందమైన వాల్‌ పెయింటింగ్స్, బొమ్మలు వేయాలని.. విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రతి స్కూల్‌ ఉండాలని ఆదేశించారు. 
► ప్రతి క్లాస్‌రూమ్‌లో అన్నీ రంగుల టేబుల్స్‌ ఏర్పాటుచేయాలని సూచించారు. – నాడు–నేడు కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తోందని.. ఈ ఏడాది అడ్మిషన్లకు అంచనాలకు మించి స్పందన కనిపిస్తోందని అధికారులు చెప్పారు.
► సెంట్రలైజ్డ్‌ కిచెన్‌కు సంబంధించిన ప్లాన్లను అధికారులు సమావేశంలో వివరించారు. వీలైనంత త్వరగా వాటిని ఖరారు చేసి, పూర్తి పరిశుభ్రం (హైజిన్‌)గా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
► వచ్చే నెల 5న స్కూళ్లు తిరిగి తెరవడానికి అన్ని ఏర్పాట్లుచేయాలని, ఈలోగా ఈ పనులన్నీ పూర్తికావాలన్నారు. ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి ఘనంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. అయితే, పాఠశాలలు ప్రారంభించే నాటికి మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు మినహా మొదటి విడత నాడు–నేడు పనులన్నీ పూర్తవుతాయని.. వాటర్‌ ప్లాంట్లను అక్టోబర్‌ మొదటి వారానికల్లా పూర్తిచేస్తామని అధికారులు చెప్పారు.
‘నాడు–నేడు’లో భాగంగా విశాఖ జిల్లా గిడిజాలలో నిర్మించిన తరగతి గదిలో ఏర్పాటు చేసిన టేబుళ్లు, కుర్చీలు 

జగనన్న విద్యా కానుక పరిశీలన
స్కూళ్లు తెరిచే రోజు (సెప్టెంబరు 5)న విద్యార్థులకు ఇవ్వనున్న జగనన్న విద్యా కానుక కిట్‌ మొత్తాన్ని సీఎం జగన్‌ పరిశీలించారు. పిల్లలకిచ్చే బ్యాగ్, బుక్స్, నోట్‌బుక్స్, బూట్లు, సాక్సులు, యూనిఫామ్‌ క్లాత్‌లను చూసి అధికారుల పనితీరును ప్రశంసించారు.

తొలిదశ ప్రగతిని వివరించిన అధికారులు
కాగా, తొలిదశ నాడు–నేడు కింద వివిధ స్కూళ్లలో చేపట్టిన పనులను అధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు వివరించారు. 
► కృష్ణాజిల్లా కంకిపాడు పంచాయతీలోని కోలవెన్నులో 1938లో కట్టిన  పాఠశాలను కూల్చేయాలని తల్లిదండ్రుల కమిటీ నిర్ణయించగా, నాడు–నేడులో పూర్తి రూపురేఖలు మార్చి నాడు–నేడు పరిస్థితులను ప్రదర్శించారు. 
► అలాగే, వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్ట మండలం రామచంద్రాపురం మండల పరిషత్‌ పాఠశాల, విశాఖ జిల్లా గిడిజాల జెడ్పీ హైస్కూల్‌తోపాటు మరికొన్ని పాఠశాలల ఫొటోలను కూడా సీఎంకు చూపించారు. సమీక్షలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, విద్యా శాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌తో పాటు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
‘నాడు– నేడు’ కార్యక్రమంతో కొత్త రూపు సంతరించుకున్న కృష్ణాజిల్లా కోలవెన్నులోని ప్రభుత్వ పాఠశాల   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement