సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని అత్యంత నిశితంగా పర్యవేక్షించాలి: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని అత్యంత నిశితంగా పర్యవేక్షించాలి: సీఎం జగన్‌

Published Wed, Oct 18 2023 1:21 PM

Cm Jagan Review Of Women And Child Welfare Department - Sakshi

సాక్షి, తాడేపల్లి: సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని అత్యంత నిశితంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రై రేషన్‌ పంపిణీపైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఇప్పుడు అమలవుతున్న విధానంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు. రేషణ్‌ నాణ్యత విషయంలో ఎక్కడా లోపాలు ఉండకూడదని చెప్పారు.

అందరికీ కూడా పౌష్టికాహారం అందించేలా చర్యలు
మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్‌ బుధవారం సమీక్ష చేపట్టారు.  తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం ఉన్న వారిని గుర్తించాలని పేర్కొన్నారు. వారందరికీ కూడా పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మందులు ఇచ్చే బాధ్యతను ఆరోగ్యశాఖ తీసుకుంటుందని.. పౌష్టికాహారం ఇచ్చే బాధ్యతను మహిళా, శిశుసంక్షేమ శాఖ చేపట్టాలని తెలిపారు.

గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు హిమోగ్లోబిన్‌ పరీక్షలు
గర్భిణీలు, పిల్లలకు టీకాలు అందించారా? లేదా? అన్నదానిపై పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ టీకాలు మిస్‌ అయితే వెంటనే వేయించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రతినెలా కూడా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు హిమోగ్లోబిన్‌ పరీక్షలు చేయాలని, జీవన శైలిలో మార్పులు కారణంగా వస్తున్న వ్యాధులపై  క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. ప్రతినెలా ఒకసారి క్యాంపు నిర్వహించేలా చూడాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఈ సమీక్షకు మంత్రి ఉషాశ్రీచరణ్‌, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్‌ ఎండీ అహ్మద్‌ బాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతుల కల్పన) కమిషనర్‌ కాటమనేని భాస్కర్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ ఎం జానకి, పౌరసరఫరాలశాఖ ఎండీ జి వీరపాండియన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జె. నివాస్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

చదవండి: చంద్రబాబు ప్లాన్‌ రివర్స్‌.. టీడీపీ క్యాడర్‌కు కొత్త టెన్షన్‌! 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement