
శిలాఫలకం వద్ద సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. మంత్రులు, ప్రజా ప్రతినిధులు
సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో రూ.122.90 కోట్ల వ్యయంతో నిర్మించే వరద రక్షణ గోడ (రిటైనింగ్ వాల్) పనులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. బుధవారం ఉదయం కనకదుర్గమ్మ వారధి వద్ద ఈ పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ నిర్మాణం ప్రారంభంతో విజయవాడ తూర్పు నియోజకవర్గ వాసుల చిరకాల స్వప్నం నెరవేరినట్లయింది. తద్వారా ఏటా వరదల సమయంలో తట్టా బుట్ట సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే బాధ విజయవాడ కృష్ణా నది పరీవాహక ప్రజలకు తప్పుతుంది. 1.5 కిలోమీటర్ల పొడవున కనకదుర్గ వారధి నుంచి కోటినగర్ వరకు వరద రక్షణ గోడ నిర్మిస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల సమయంలో సీఎం జగన్ ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా ఈ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మిస్తే ముంపునకు గురికాకుండా ఉంటుందని అధికారులు సూచించారు.
త్వరలో పనులకు శంకుస్థాపన చేస్తానని అప్పుడు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు బుధవారం ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతకు ముందు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) మేయర్ భాగ్యలక్ష్మి, స్థానిక 18వ డివిజన్ కార్పొరేటర్ అరవ వెంకట సత్యనారాయణ, మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన వీఎంసీ కార్పొరేటర్లను ముఖ్యమంత్రి పేరు పేరునా పలకరించి అభినందించారు. నదీ తీరంలో వంతెన కింద నిల్చొని ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్న కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రజలకు సీఎం చిరునవ్వుతో అభివాదం చేశారు.
12 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలాగా రక్షణ గోడ
ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నది తీర ప్రాంతంలో నివసించే ప్రజల ఇళ్లలోకి వరదల సమయంలో నీళ్లు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని నిరాశ్రయులవుతున్నారు. 2019లో కృష్ణా నది వరదల సమయంలో విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాలైన రాణిగారితోట, తారక రామానగర్, భూపేష్ గుప్తా నగర్ ప్రాంతాల్లో సీఎం పర్యటించి వరద కష్టాలు, వ్యథల నుంచి శాశ్వత పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే రక్షణ గోడ నిర్మాణం కోసం 2020 జనవరి 13న రూ.122.90 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 12 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకునేలాగా రక్షణ గోడ నిర్మాణం చేపడుతున్నారు. ఈ గోడ నిర్మాణం వల్ల దాదాపు 31 వేల మంది ప్రజలకు ముంపు నుంచి శాశ్వత ఉపశమనం లభించనుంది.