ఆస్పత్రుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి

CM Jagan Comments On Covid treatment and health hubs, hospital facilities - Sakshi

ఇందుకోసం ప్రత్యేక అధికారిని నియమించండి

స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ తయారు చేయండి

కోవిడ్‌ చికిత్స, హెల్త్‌ హబ్స్, ఆస్పత్రుల్లో వసతులపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

హెల్త్‌ హబ్స్‌తో వైద్య రంగం బలోపేతం.. వీటి ఏర్పాటుకు ఆవాసాలకు దగ్గరగా స్థలాలు 

50 వేల దిగువకు యాక్టివ్‌ కేసులు 

పాజిటివిటీ రేటు 5.23 శాతం

రాష్ట్ర వ్యాప్తంగా 134 ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు 

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రుల భవనాలు, వైద్య పరికరాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, ఇందుకోసం ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు ఎస్‌వోపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) తయారు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, శానిటేషన్, రోగులకు అందించే ఆహారంపై శ్రద్ధ పెట్టాలని, వీటిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. కోవిడ్‌–19 నియంత్రణ, చికిత్స, హెల్త్‌ హబ్స్, ఆస్పత్రుల్లో వసతులపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది హాజరుపై పర్యవేక్షణ కోసం పటిష్ట యంత్రాంగం ఉండాలన్నారు. ప్రభుత్వ, ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలున్న మందులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. 21 రోజుల్లో కచ్చితంగా ఆరోగ్యశ్రీ, 104, 108 బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో నాడు – నేడు కార్యక్రమాలు చేపట్టిన తర్వాత వాటి నిర్వహణకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలని, రోగులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందాలని చెప్పారు. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా వస్తున్న 16 మెడికల్‌ కాలేజీలు, ఆధునీకరిస్తున్న 11 పాత వైద్య కళాశాలలు, హెల్త్‌ హబ్స్‌తో ఆరోగ్య రంగం మరింత బలోపేతం అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హెల్త్‌ హబ్స్‌కు స్థలాలు.. ఆవాసాలకు దగ్గరగానే ఉండేలా చూడాలన్నారు. అప్పుడే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారని చెప్పారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించడమే ప్రధాన లక్ష్యంగా హెల్త్‌ హబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
కోవిడ్‌ నియంత్రణ, చికిత్స, హెల్త్‌ హబ్స్, ఆస్పత్రుల్లో వసతులపై క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

హెల్త్‌ హబ్స్‌లలో ఉత్తమ వైద్యం
► జిల్లాల్లో హెల్త్‌ హబ్స్‌పై గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏయే చికిత్సల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారన్న దానిపై వివరాలు వెల్లడించారు. క్యాన్సర్, గుండె జబ్బులు, చిన్న పిల్లల సర్జరీల కోసం అధికంగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని తెలిపారు. 
► ఈ వ్యాధులకు ఇక్కడి హబ్స్‌లో వైద్య సేవలు అందేలా.. ఆ రకమైన స్పెషాల్టీ ఆస్పత్రుల ఏర్పాటుకు హబ్స్‌లో ప్రాధాన్యత ఇచ్చేలా చూస్తున్నామని చెప్పారు.  

పాజిటివిటీ రేటు తగ్గుతోంది..
► రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు గణణీయంగా తగ్గుతున్నాయని, ఆరు జిల్లాల్లో ఐదు శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు సగటు 96.59 శాతం ఉంటే ఏపీలో 96.67 శాతం ఉందని తెలిపారు. సీఎంకు వారు ఇంకా ఏం చెప్పారంటే..
► 50 వేల దిగువకు యాక్టివ్‌ కేసులు. పాజిటివిటీ రేటు 5.23 శాతం. కడప, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు.
► ప్రైవేటు ఆస్పత్రుల్లో అక్యుపై అయిన పడకల్లో 76.51 శాతం రోగులకు ఆరోగ్య శ్రీ కింద చికిత్స. 
► 104కు గణనీయంగా తగ్గిన కాల్స్‌. జూన్‌ 25న కేవలం 1,021 కాల్స్‌ మాత్రమే వచ్చాయి. 
► 3,148 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఉన్నాయి. ఇందులో 1,095 మందికి సర్జరీలు చేశారు. 237 మంది మరణించారు. 1,398 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగిలిన వారికి చికిత్స కొనసాగుతోంది.
► రాష్ట్ర వ్యాప్తంగా 134 ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. 50 అంతకంటే ఎక్కువ పడకలున్న ఆస్పత్రుల్లో జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు. సెప్టెంబర్‌ నాటికి 97 ప్లాంట్లు ఏర్పాటవుతాయి. మిగిలిన 37 ప్లాంట్లు రానున్న మార్చి నాటికి పూర్తి చేస్తాం.
► ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top