నిన్ను సస్పెండ్‌ చేయిస్తా: టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్‌ | Clashes between TDP MLA Shajahan Basha and CI Kala Venkataramana In Madanapalle | Sakshi
Sakshi News home page

నిన్ను సస్పెండ్‌ చేయిస్తా: టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్‌

May 27 2026 5:26 AM | Updated on May 27 2026 5:29 AM

Clashes between TDP MLA Shajahan Basha and CI Kala Venkataramana In Madanapalle

సీఐని హెచ్చరిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా

అడుక్కుతినైనా బతుకుతా: సీఐ కౌంటర్‌

యువకుడిని సీఐ తన్నారని గ్రామస్తుల ఆరోపణ  సీఐపైకి దూసుకెళ్లిన జనం.. పోలీసులపై దాడికి యత్నం    

మదనపల్లె/టౌన్, సాక్షి: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని వేంపల్లిలో గంగజాతర సాక్షిగా మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాలూకా సీఐ కళా వెంకటరమణ ఒక యువకుడిని బూటుకాలితో తన్నారనే ఆరోపణలతో మొదలైన వివాదం.. చివరకు టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా, సీఐ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. గ్రామస్తులు సీఐపైకి దూసుకెళ్లడమేగాక బెంగళూరు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసులపై దాడికి ప్రయత్నించారు. వేంపల్లిలో మంగళ, బుధవారాల్లో గంగజాతర జరగాల్సి ఉంది. 

గతంలో ఇక్కడ రెండువర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగిన నేపథ్యంలో.. ఈసారి గొడవలు జరగకుండా రౌడీïÙటర్లు, అనుమానితులను గుర్తించి కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు సీఐ కళా వెంకటరమణ తన సిబ్బందితో గ్రామానికి వెళ్లారు. గ్రామానికి చెందిన శ్రీనివాసులునాయుడుని పిలిచి గొడవలకు వెళ్లొద్దని మందలించారు. ఈ సందర్భంగా ఎదురుతిరిగిన శ్రీనివాసులును సీఐ బూటుకాలితో తన్నారని గ్రామస్తులు ఆరోపించారు. సీఐ ప్రవర్తనపై ఆగ్రహించిన గ్రామస్తులు వందలాదిగా వేంపల్లి క్రాస్‌ వద్దకు చేరుకుని బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. పోలీసులు ఈ రాస్తారోకోను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో రెండు వర్గాల మధ్య అరుపులు, కేకలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా కొందరు గ్రామస్తులు సీఐ వెంకటరమణపై దాడికి ప్రయత్నించగా కొందరు అడ్డుకున్నారు.  

సస్పెండ్‌ చేయిస్తే.. దారికి వస్తావు: ఎమ్మెల్యే హెచ్చరిక  
మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చిన్నబాబు వేర్వేరుగా అక్కడకు చేరు­కు­న్నారు. వీరిరాకతో గ్రామస్తులు రెండువర్గాల వైపు చీలిపోయారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే, సీఐ మధ్య అందరి ముందే మాటల యుద్ధం నడిచింది. ‘నా ముందే బెదిరిస్తావా? నీ ప్రవర్తన బాగాలేదు. నువ్వు వచ్చినప్పటికీ  నుంచి ప్రైవేట్‌ విషయాల్లో జోక్యం చేసుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్నావ్‌. నిన్ను సస్పెండ్‌ చేయిస్తేనే దారికి వస్తావ్‌’ అంటూ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా వేలు చూపిస్తూ సీఐని హెచ్చరించారు. ‘నాపై గ్రామస్తులే తిరగబడుతున్నారని చెబుతున్నా మీరు వినడం లేదు. రాయలసీమలో ఎక్కడికైనా వెళ్తా. అవసరమైతే రోడ్డుపై అడుక్కుతినైనా ఉంటా’ అంటూ సీఐ వెంకటరమణ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. తరువాత ఈ విషయమై ఎమ్మెల్యే ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. 

నేనెవరినీ కొట్టలేదు: సీఐ  
అనంతరం వేంపల్లిలో నెలకొన్న ఉద్రిక్తతలపై సీఐ కళా వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ తాను ఎవరినీ కొట్టలేదని చెప్పారు. శ్రీనివాసులునాయుడు దురుసుగా ప్రవర్తిస్తుంటే మందలించానే తప్ప కొట్టలేదని చెప్పారు.  

సీఐపై ఫిర్యాదు: సీఐ కళా వెంకటరమణ తనపై చేయి చేసుకున్నాడని గ్రామస్తుడు శ్రీనివాసులు నాయుడు ఫిర్యాదు చేసినట్లు డీఎస్పీ పావని మంగళవారం తెలిపారు. 
ఈ ఫిర్యాదుపై సమగ్ర విచారణ చేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement