నేడు సివిల్స్‌ ప్రిలిమ్స్‌ 

Civils‌ Prelims On 4th October - Sakshi

పరీక్ష సమయానికి 10 నిమిషాలు ముందే ప్రవేశ గేట్లు మూసివేత 

సాక్షి, అమరావతి:  ఐఏఎస్, ఐపీఎస్‌ తదితర ఆలిండియా సర్వీస్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన సివిల్స్‌–2020 ప్రిలిమ్స్‌ పరీక్ష ఆదివారం (నేడు) జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి పేపర్‌–1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి పేపర్‌–2 ఉంటుంది. కోవిడ్‌ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలన్న వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో పరీక్షలను యథావిధిగా నిర్వహించేందుకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాట్లు చేసింది. కోవిడ్‌ ప్రోటోకాల్‌ ప్రకారం, సుప్రీంకోర్టు సూచనలను అనుసరించి పరీక్షలు నిర్వహిస్తారు.  

► దేశవ్యాప్తంగా 72 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలలో మొత్తం 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 
► దేశవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది ఈ పరీక్షకు దరఖాస్తుచేయగా ఏపీ నుంచి 30,199 మంది పరీక్ష రాసేందుకు ఆప్షన్‌ ఇచ్చారు. 
► ఏపీలో పరీక్షల నిర్వహణకు నలుగురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా యూపీఎస్సీ నియమించింది. 
► అభ్యర్థుల ఈ–అడ్మిట్‌ కార్డులను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్లో పొందుపరిచింది. 
► వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవడమే కాకుండా సివిల్స్‌ తుది ఫలితాలు వెలువడే వరకు కూడా ఈ–అడ్మిట్‌ కార్డులను భద్రపరచుకోవాలని యూపీఎస్సీ సూచించింది. 
► అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్ద ఈ–అడ్మిట్‌ కార్డుతో పాటు అధికారికి ఫొటో గుర్తింపుకార్డును చూపించాలి. రెండింటిలోని ఫొటోలు ఒకేమాదిరిగా ఉండాలి. 
► పరీక్ష ప్రారంభానికి పది నిముషాల ముందే ప్రవేశద్వారాలను మూసివేస్తారు.  
► పరీక్ష కేంద్రాల్లోకి బాల్‌పాయింట్‌ పెన్నును అనుమతిస్తారు. చేతి గడియారాలు, స్మార్ట్‌ఫోన్లు, బ్లూటూత్‌ ఆధారిత పరికరాలు, ఇతర డిజిటల్‌ పరికరాలను నిషేధించారు.  
► మాస్కులు లేకుంటే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. పారదర్శక సీసాల్లో శానిటైజర్‌ను అనుమతిస్తారు.   

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top