సీఐ వెంకటరమణపై సస్పెన్షన్‌ వేటు | CI Venkataramana suspended | Sakshi
Sakshi News home page

సీఐ వెంకటరమణపై సస్పెన్షన్‌ వేటు

Apr 6 2026 4:48 AM | Updated on Apr 6 2026 4:48 AM

CI Venkataramana suspended

యువతి పరువు హత్యకు సహకరించిన మాచర్ల టౌన్‌ సీఐ 

అందుకుగాను రూ.6.5 లక్షలు లంచం తీసుకున్న వైనం 

ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం 

దర్యాప్తులో వెల్లడైన విస్తుపోయే నిజాలు 

మాచర్ల: వివాదాస్పద పోలీసు అధికారి తురకా వెంకటరమణను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఆది నుంచీ ఆయన ఎక్కడ విధులు నిర్వహించినా ఆరోపణలే. ఎక్కువకాలం ఏ స్టేషన్‌లోనూ పనిచేసిన దాఖలాలు లేవు. తాజాగా యువతి పరువు హత్యలో సహకరించినట్టు తేలడంతో మాచర్ల టౌన్‌ సీఐ వెంకటరమణను సస్పెండ్‌ చేస్తూ గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 

కేసు వివరాల్లోకి వెళ్తే.. మార్చి మొదటి వారంలో మాచర్ల పట్టణానికి చెందిన కామనబోయిన చౌడేశ్వరి(21) అదృశ్యమైనట్లు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. చౌడేశ్వరి అదృశ్యానికి జమ్మలమడకకు చెందిన నాగరాజు కారణమని యువతి తండ్రి చంద్ర శ్రీను ఫిర్యాదు చేశాడు. తొలుత కేసు నమోదు చేయకపోగా సీఐ ప్రవర్తన సరిగా లేదంటూ చౌడేశ్వరి తల్లిదండ్రులు మాచర్ల టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ముందు మార్చి 10న ఆత్మహత్యాయత్నం చేశారు. 

తరువాత కేసు నమోదు చేసి విచారణలో చౌడేశ్వరి, నాగరాజు వివాహం చేసుకున్నారని తెలుసుకొని, వారిని స్టేషన్‌కు పిలిపించారు. తండ్రి చంద్ర శ్రీనుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం చౌడేశ్వరి మేజర్‌ అయినప్పటికీ ఐదు రోజులపాటు తన పుట్టింటికి వెళ్లేలా సీఐ వెంకటరమణ బెదిరించి పంపాడు. ఇందుకోసం సుమారు రూ.6.5 లక్షలు లంచం తీసుకున్నాడు. గత నెల 18న చౌడేశ్వరిని పరువు హత్య చేసిన తండ్రి చంద్ర శ్రీను దాన్ని ఆత్మహత్యగా ప్రచారం చేశాడు. 

పోస్టుమార్టంలో ఆత్మహత్యగా రిపోర్టు ఇప్పించేలా సీఐ వెంకటరమణ ప్రయత్నం చేసినప్పటికీ వీలుపడలేదు. దీంతో ఇది హత్యగా తేలింది. సీఐ పాత్రపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో చంద్ర శ్రీను, గంగ మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా పరువు హత్య చేశామని, సీఐ వెంకటరమణకు లంచం ఇచ్చామని ఒప్పుకున్నారు. దీంతో యువతి మరణానికి పరోక్షంగా కారణమైన సీఐ వెంకటరమణపై సస్పెన్షన్‌ వేటు వేయగా, మరో ముగ్గురు సిబ్బందిపై పల్నాడు జిల్లా ఎస్పీ చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.  

అధికారపార్టీ అండదండలతో.. 
16 నెలల కిందట మాచర్లకు ఎస్‌ఐగా వచ్చిన వెంటరమణ పది నెలల క్రితం ప్రమోషన్‌ పొంది మాచర్ల టౌన్‌ సీఐగా పోస్టింగ్‌ పొందారు. ఈ ఆరు నెలల్లో అధికార పార్టీ అండదండలతో రెచ్చిపోయారు. కర్ర పెత్తనంతో ప్రతి ఒక్కరినీ భయపెట్టడం, ఇబ్బందులకు గురిచేశారు. లోపల వేస్తా.. తాట తీస్తా.. అంటూ అందరినీ బెదిరించేవారు. 

సీఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత కేసుల పరిష్కారంలో భారీ మొత్తంలో అక్రమార్జన చేయసాగారు. ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడంతో వెంకటరమణ మరింత రెచ్చిపోయాడు. రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో పోలీసు వ్యవస్థను నాశనం చేయడం వల్లే చౌడేశ్వరి పరువు హత్యకు గురైందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement