ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఎటపాక మండలం గొల్లగూడెం ప్రభుత్వ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. మలేరియా నివారణలో భాగంగా విద్యార్థులకు సిబ్బంది పంపిణీ చేసిన క్లోరోక్విన్ మాత్రలు వికటించడంతో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
పాఠశాలలో మొత్తం 73 మంది విద్యార్థులకు ఈ మాత్రలు పంపిణీ చేయగా, వాటిని మింగిన కొద్దిసేపటికి వారిలో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే బాధితులను మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు పాఠశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విద్యార్థులకు మందుల పంపిణీలో జరిగిన పొరపాటుపై విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. ఈ దుర్ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


