‘మావిగన్‌’కు మద్దతు పెరుగుతుండడంతో డైవర్షన్‌ కుట్రలు | Chandrababu New Conspiracy on Mavigan: Andhra pradesh | Sakshi
Sakshi News home page

‘మావిగన్‌’కు మద్దతు పెరుగుతుండడంతో డైవర్షన్‌ కుట్రలు

Apr 10 2026 5:23 AM | Updated on Apr 10 2026 5:23 AM

Chandrababu New Conspiracy on Mavigan: Andhra pradesh

ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు పాట్లు

అచ్చెన్నాయుడి అవాకులు, చెవాకులు అందులో భాగమే

అమరావతి వద్దు.. మావిగన్‌ ముద్దు అంటున్న రాష్ట్ర ప్రజానీకం

అమరావతి అసాధ్యమని తెలిసీ రాజధాని లేకుండా చేస్తున్న చంద్రబాబు

మావిగన్‌ బెటర్‌ ఆప్షన్‌ అంటున్న జగన్‌ మాటకు పెరుగుతున్న ప్రజా మద్దతు

భారం లేని మావిగన్‌ మార్గాన్ని బాబు ఎందుకు వద్దంటున్నారు?

ఆచరణ సాధ్యం కాని అమరావతి వైపు పరుగులెందుకు?.. అన్ని వర్గాలలోనూ ఇదే చర్చ

రూ.20వేల కోట్లతోనే మహానగరం సాధ్యమవుతుంటే వద్దనడం ఏమిటి?

రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, తాగునీటికి రూ. 2 లక్షల కోట్లు ఖర్చుపెట్టడం ఎందుకు?

అసలు ఆ నిధులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎన్ని దశాబ్దాలకు పూర్తి చేస్తారు?

ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకే.. బాబు డైవర్షన్‌ రాజకీయాలు

సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేసిన ‘మావిగన్‌’ (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) రాజధాని ప్రతిపాదనకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ, అన్ని వర్గాలలోనూ మద్దతు పెరుగుతోంది. ఎక్కువ ఖర్చు లేకుండానే ఒక మహానగరాన్ని అభివృద్ధి చేసుకునే మార్గమున్నప్పుడు ఆచరణ సాధ్యం కాని అమరావతి వల్ల ఉపయోగమేమిటన్న చర్చ జరుగుతుండడంతో అధికారపార్టీలో అలజడి మొదలైంది. మూడు నగరాలను కలుపుతూ హైవేలు ఉండడం, పోర్టు, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఉండడం.. తక్కువ ఖర్చుతోనే, తక్కువ కాలంలోనే మావిగన్‌ను ఓ మహానగరంగా అభివృద్ధి చేసుకునేందుకు కలసివచ్చే అంశాలుగా ఆర్థికవేత్తలు, నిపుణులు చెబుతున్నారు.

రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, తాగునీరు వంటి సదుపాయాలకే రూ. 2 లక్షల కోట్లు అవసరమయ్యే అమరావతి అస్సలు సాధ్యమయ్యేది కాదని తెలిసీ చంద్రబాబు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని జనం చర్చించుకుంటున్నారు. అమరావతి ప్రతికూలాంశాలను, మావిగన్‌ సానుకూలాంశాలను జనం బేరీజువేసుకుంటున్నారు. ఇది మింగుడుపడని చంద్రబాబు వెంటనే డైవర్షన్‌ అస్రా్తన్ని బయటకు తీశారు. అచ్చెన్నాయుడుతో ఓ విలేకరుల సమావేశం పెట్టించి అవాకులు, చెవాకులు పలికించారు.. అచ్చెన్నాయుడి అసందర్భ ప్రేలాపనలు బాబుగారి డైవర్షన్‌ రాజకీయంలో భాగమేనన్న విషయం అందరికీ అర్థమైపోయింది.. 

రూ. 2 లక్షల కోట్లతో రోడ్లు, డ్రైనేజీలా.. ఇక రాజధాని ఎప్పుడు?
అమరావతి కోసం మొదట తీసుకున్న 50 వేల ఎకరాల్లోనే కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీటి సౌకర్యాల కల్పనకు కేంద్రానికి, బ్యాంకులకు చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం ఎకరానికి రూ.2 కోట్లు అవుతుంది. అంటే 50 వేల ఎకరాలకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాలి. ఇంకా భవనాల ఖర్చు అదనం. దీనికే దిక్కులేదంటే మళ్లీ మరో 50 వేల ఎకరాలు అదనంగా సేకరిస్తున్నారు. దీనికి మరో రూ.లక్ష కోట్లు అవుతుంది. అంటే లక్ష ఎకరాల్లో కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, తాగునీరు కోసం రూ.2 లక్షల కోట్లు కావాలి.

ఇంకా నిర్మాణాలకు, అభివృద్ధికి డబ్బులు ఎలా వస్తాయి? రాష్ట్రానికేమన్నా అంత ఆదాయముందా..? ఇది అదనంగా చేయాల్సిన అప్పే కదా.. అసలు ఇదంతా చేయడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అంత సుదీర్ఘ కాలంలో రూ.2 లక్షల కోట్లు వ్యయం కాస్తా రూ.10 లక్షల కోట్లకు పెరుగుతుందని ఆర్థికవేత్తలంటున్నారు. అసలు ఇదంతా సాధ్యమయ్యేదేనా అని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరూ చర్చించుకుంటున్నారు. అలాగే దేశంలో ఎక్కడ కూడా ప్రభుత్వాలు భవనాలు కట్టగానే రాజధాని తయారైపోవడం మనం చూడలేదు.

ఆర్థిక కార్యకలాపాలకు ఎక్కువ అవకాశం ఉన్న నగరాలే రాజధానులుగా అభివృద్ధి చెందాయి. ఇప్పటి వరకు అమరావతిలో సదుపాయాలు లేవు.. ప్రభుత్వం కడతానంటున్న బిల్డింగులూ లేవు.. ఇక ఆర్థిక కార్యకలాపాలెక్కడ? మావిగన్‌ ప్రాంతంలో ఇప్పటికే అన్ని సదుపాయాలున్నాయి. పోర్టు, ఎయిర్‌పోర్టు, హైవేలున్నాయి. ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ప్రభుత్వ బిల్డింగులు కట్టుకుంటే సరిపోతుంది.. ఇలాంటి విషయాలన్నీ జనం బేరీజు వేసుకుంటున్నారు.

సోషల్‌ మీడియాలో ‘మావిగన్‌’ హోరు..
అమరావతి కంటే మావిగన్‌ బెస్ట్‌ అని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. మావిగన్‌లో ఇప్పటికే పోర్టు ఉంది, సముద్ర తీరం, విమానాశ్రయం ఉన్నాయి. బస్టాండ్, రైల్వే స్టేషన్, రహదారులు ఇలా అనేక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అమరావతిలో ఏముంది? అని వారు నిలదీస్తున్నారు. అమరావతిలో కేవలం నీరు, రోడ్లు, డ్రెయినేజీలకే రూ.2 లక్షల కోట్లు ఖర్చుచేయాల్సి ఉంటుందని, ఇందులో 10 శాతం అంటే కేవలం రూ.20 వేల కోట్లు మాత్రమే ఖర్చుచేస్తే మావిగన్‌ అత్యుత్తమ రాజధాని అవుతుందని లెక్కిస్తున్నారు. అంతేకాదు అమరావతిలో నిర్మాణాలకు, ఇతర ప్రాంతాల్లో నిర్మాణాలకు ఖర్చు విషయంలో భారీ వ్యత్యాసం ఉండటం వెనుక అవినీతి దాగుందని ఉదాహరణలతో సహా బయటపెడుతున్నారు.

అమరావతిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం భ్రమరావతి చేస్తోందంటూ పోస్టులు పెడుతున్నారు. సామాజిక మాధ్యమాలలోనే కాదు.. సామాన్య జనంలోనూ వైఎస్‌ జగన్‌ ప్రతిపాదనపై తీవ్ర చర్చ జరుగుతోంది. అమరావతి కోసం 2 నుంచి 4 ట్రిలియన్‌ డాలర్లు అవసరమవుతాయని గతంలో చంద్రబాబు మాట్లాడిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అబ్బే.. అవన్నీ ఫేక్‌ వీడియోలని మంత్రి లోకేశ్‌ ట్వీట్‌ చేయడం చూస్తే చంద్రబాబు ప్రభుత్వంలో మావిగన్‌ రేపిన కల్లోలం అర్థమవుతూనే ఉందని విశ్లేషకులంటున్నారు. లోకేశ్‌ ట్వీట్‌ను ఖండిస్తూ నాడు చంద్రబాబు ప్రసంగించిన వీడియోలతో పాటు ఎకనమిక్‌ టైమ్స్‌ సహా పలు జాతీయ పత్రికలలో వచ్చిన క్లిప్పింగ్స్‌ కూడా నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు. 

సమాధానాలు లేకే డైవర్షన్‌ కుట్రలు..
తక్కువ ఖర్చుతోనే మావిగన్‌ను మహానగరంగా అభివృద్ధి చేసుకునే అవకాశమున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదన్న ప్రశ్నలు మొదలయ్యాయి.. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలోనే రాజధానిని అభివృద్ధి చేసుకునే ప్రతిపాదనను పక్కనపెట్టేసి లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అమరావతివైపు చంద్రబాబు ఎందుకు పరుగులు తీస్తున్నారని అన్ని వైపుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అమరావతి ప్రాజెక్టు పనుల కోసం అయినవారికి అధిక ధరలకు టెండర్లు, మొబిలైజేషన్‌ అడ్వాన్సులు వంటివన్నీ రోజుకొకటి బయటపడుతున్నాయి. సోషల్‌ మీడియాలోనూ, టీవీ చర్చలలోనూ ఇది ప్రధానాంశంగా మారడం చంద్రబాబు అండ్‌కో కు తలనొప్పిగా తయారయ్యింది. దాంతో డైవర్షన్‌ రాజకీయాలకు తెరతీశారు. అచ్చెన్నాయుడును రంగంలోకి దింపి అసందర్భంగా మాట్లాడించడం.. మావిగన్‌పై ప్రజల దృష్టిని మరల్చడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగమేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు.

ఈ ప్రశ్నలకు బదులుందా బాబూ..?
పోర్టు, ఎయిర్‌పోర్టు, జాతీయ రహదారులు ఉన్న మావిగన్‌ ప్రాంతంలో తక్కువ ఖర్చుతోనే, తక్కువ సమయంలోనే మహానగరాన్ని అభివృద్ధి చేసుకోగలమని ఆర్థికవేత్తలు, నిపుణులు చెబుతున్న మాట నిజం కాదా?

అమరావతిలో లక్ష ఎకరాలలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, కరెంటు సదుపాయాలకు రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తేబోతున్నారు? ఇవి కాకుండా నిర్మాణాలకు, అభివృద్ధికి డబ్బులు ఎలా వస్తాయి? ఇవన్నీ ఎంత సమయంలో పూర్తి చేస్తారు? మొత్తం ఎన్ని దశాబ్దాలు 
పడుతుంది?
 ఆ రూ.2 లక్షల కోట్లలో పది శాతం అంటే రూ.20 వేల కోట్లతోనే మావిగన్‌ ప్రాంతంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయవచ్చన్న ప్రతిపాదనపై ఎందుకు మాట్లాడడం లేదు?

 2019కి ముందు చంద్రబాబు స్వయంగా చేసిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 50 వేల ఎకరాల్లో ప్రపంచంలో అత్యద్భుతమైన, బ్రహ్మాండమైన రాజధాని వస్తుందని బాహుబలి సెట్టింగులు చూపించారు. ఆ మాస్టర్‌ ప్లాన్‌ను ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు?
దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో చదరపు అడుగు (ఎస్‌ఎఫ్‌టీ) నిర్మాణానికి ఏకంగా రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు అవుతుంది. అంతంత ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఏ స్కాములతో ఇది పెరుగుతోంది?

అమరావతి ప్రాంతంలో పనుల కోసం అధిక ధరలకు టెండర్లు పిలవడం, అయినవారికే అప్పగించడం.. ఎలాంటి పనులు చేయకుండానే ముందుగానే మొబిలైజేషన్‌ అడ్వాన్సులిచ్చేయడం, అందులో కమీషన్లు కాజేయడంపై వస్తున్న ఆరోపణలపై ఎందుకు మాట్లాడడం లేదు?
 రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఏడేళ్లు సీఎంగా ఉండి లక్ష ఎకరాల అమరావతిలో ఏమేమి కట్టారు? అమరావతి తన పెట్‌ ప్రాజెక్టు అని చెప్పే చంద్రబాబు ఏ మేరకు నిర్మాణాలు చేశారు? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement