అమరావతి సెల్ఫ్ మోనిటైజేషన్ ప్రాజెక్టు.. దీనిని ఎవరూ కదపలేరు
2027 మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు మావిగన్ అంటున్నారని, తాము చేస్తున్నది కూడా అదేనని, అదే సీఆర్‌డీఏ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సైకో ప్రవర్తనలతో రౌడీయిజం బ్యాచ్ వితండవాదాలు చేస్తోందని.. ఏమీ అనకుండానే ఓ పత్రికపై దాడిచేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి వెనుక రాజకీయ పార్టీ లేకపోతే ఇంటినుంచి బయటకు రాగలడా అని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రాన్ని వీరు సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని.. మనమంతా కలిసి కాపాడుకోవాలన్నారు.
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం సూరేపల్లిలో గురువారం ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘ఇప్పటికే విభజనవల్ల, గత పాలకులవల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. ఇప్పుడిప్పుడే రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నాం. అడవుల్లో ఉండే ఉగ్రవాదులు దాడులు చేసి వెళ్లిపోతారు. ఇతను కూడా అంతే. ఎక్కడో ఉండి అప్పుడప్పుడు వచ్చి దుష్ప్రచారం చేసి పారిపోతాడు. సద్విమర్శలు చేస్తే సమాధానం ఇస్తాం. అమరావతి సెల్ఫ్ మోనిటైజేషన్ ప్రాజెక్టు.
విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అంటున్నారు. అది సీఆర్డీఏ రీజియన్. వెయ్యి మంది సైకోలు వచ్చినా అమరావతిని కదపలేరు. ఇలాంటి తరహా వ్యక్తులను అరెస్టు చేయడానికినాకు నిమిషం పట్టదు. కానీ, చట్టం తన పని తాను చేసుకుంటుంది. నంద్యాలలో పర్యటిస్తుంటే ఏ తప్పు చేయకపోయినా నన్ను అరెస్టుచేసి జైల్లో పెట్టారు.
రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం
మేం రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. ప్రజల ఆస్తులకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 ప్రక్రియ పూర్తిచేసి 1.12 కోట్ల పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తిచేస్తాం.
‘22ఏ’ నుంచి 1.37 లక్షల ఎకరాలకు విముక్తి
ఇక గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు ఇనామ్ భూములను 22ఏ జాబితా నుంచి 1.37 లక్షల ఎకరాలను తొలగిస్తున్నాం. మరో లక్ష ఎకరాల సర్వీసు ఇనామ్ భూములకు కూడా 22ఏ జాబితా నుంచి విముక్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం. అలాగే, రాష్ట్రంలో ఫ్రీహోల్డ్ కింద అర్హత కలిగిన 9.25 లక్షల ఎకరాలపై భూ యజమానులకు యాజమాన్య హక్కులు కల్పిస్తున్నాం’ అని చంద్రబాబు అన్నారు.


