తిరుపతి జిల్లా నాయుడుపేటలో సీఎం ప్రసంగిస్తుండగా జనాలు లేచి వెళ్లిపోవడంతో ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు
రాష్ట్రంలో 21 నెలల్లో ఒక్క ఇంటికీ స్లాబ్ వేయని చంద్రబాబు సర్కారు
2014–19 మధ్య 5 శాతం కూడా పూర్తి చేయని వైనం
జగన్ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను ఇప్పుడు తానే కట్టించినట్టు బాబు ప్రచారం
2019–24 మధ్య జగన్ హయాంలోనే 2.62 లక్షల టిడ్కో ఇళ్లల్లో 1,77,546 పూర్తి
ఇది నిజమేనని శాసనసభలోనే అంగీకరించిన మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ
మిగిలిన ఇళ్ల పనులు 80 శాతం పైగా పూర్తి చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం
2024లోనే దాదాపు లక్ష ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ
గత ప్రభుత్వంలో పూర్తయిన ఇళ్లకు రంగులు వేసి క్రెడిట్ చోరీకి బాబు యత్నం
జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలనే తిరిగి పంపిణీ
పట్టాలపై ‘2019–20లో నిర్మించిన ఇళ్లు’ అని స్పష్టంగా ముద్రించినా బాబు గప్పాలు
సాక్షి, అమరావతి: ప్రపంచంలో ఎక్కడ మంచి జరిగినా తన ఖాతాలో వేసుకోవడంలో సిద్ధహస్తుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. సోమవారం తిరుపతి జిల్లా నాయుడుపేటలో పంపిణీ చేసిన టిడ్కో ఇళ్ల పట్టాలపై ‘2019–20 సంవత్సరంలో నిర్మించిన ఇళ్లు’ అని స్పష్టంగా కనిపించడం చూసి సభలోని వారే ముక్కున వేలేసుకున్నారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 21 నెలల్లో రాష్ట్రంలో 5.50 లక్షల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసిందని, గతేడాది నవంబర్‌లో 3 లక్షల ఇళ్లను పేదలకు అప్పగించిందని బాబు చెప్పడం విని విస్తుపోయారు.
రెండో విడతలో భాగంగా నాయుడుపేట మండలం, పుదూరు నుంచి లక్ష టిడ్కో ఇళ్లతోపాటు మరో 1.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్టు గొప్పలుపోవడంపై నివ్వెరబోయారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వంలో పూర్తి చేసిన టిడ్కో ఇళ్లకు రంగులు వేసి తానే కట్టించినట్టు చెప్పుకోవడం చూస్తుంటే బాబు క్రెడిట్ చోరీలో తనకు తానే సాటి అనేలా ఉందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బాబు ‘కట్టు’కథల కనికట్టు
2015–16 మధ్య చేపట్టిన టిడ్కో ఇళ్ల కాంట్రాక్టులను నాటి టీడీపీ ప్రభుత్వం దోపిడీకి పరాకాష్టగా మార్చేసింది. ఆ సంవత్సరం కేంద్రం 1,37,533 ఇళ్లను మంజూరు చేస్తే కేవలం 81 మాత్రమే పూర్తి చేశారు. 2017–18లో 2,39,062 ఇళ్లు మంజూరు చేస్తే 25,818 పూర్తిచేశారు. నాడు చంద్రబాబు రాష్ట్రంలో ఏ నగరంలో లేనంతగా నిర్మాణ ధరలు పెంచి అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు.
అయినప్పటికీ మంజూరైన ఇళ్లల్లో ఐదు శాతం కూడా నిర్మాణం పూర్తిచేయనేలేదు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో అరకొరగా నిర్మించిన ఇళ్లను హడావుడిగా లబ్ధిదారులకు అప్పగించి ఏదో చేసేసినట్టు బిల్డప్ ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో 2019 మే నాటికి కేంద్ర ప్రభుత్వం 4.91 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే కేవలం 77,350 ఇళ్ల నిర్మాణం కోసం పునాదులు వేసి వాటిలో 20 వేల ఇళ్లు మాత్రమే అందులోనూ 60 శాతం పనులే చేశారు.
జగన్ ప్రభుత్వంలోనే 1,77,546 ఇళ్లు పూర్తి
2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ హయాంలోనే టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం జరిగింది. ప్రతిచోటా ఇళ్ల నిర్మాణంతో పాటు నూరు శాతం మౌలిక సదుపాయాలు కల్పించాకే లబ్ధిదారులకు అందించారు. మొత్తం 2,62,212 ఇళ్లు అవసరమని గుర్తించి వాటిలో 1,77,546 ఇళ్లు పూర్తి చేయడంతో పాటు దాదాపు లక్ష ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ విషయం మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ శాసనసభ సాక్షిగా అంగీకరించారు కూడా. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనుల్లో దాదాపు 80 శాతం పూర్తి చేశారు. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన 21 నెలల పాలనలో టిడ్కో ఇళ్లకు ఎక్కడా స్లాబులు వేసిన దాఖలా లేదు. కానీ క్రెడిట్ మాత్రం తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం.
ఆ 1.5 లక్షల ఇళ్లు గత ప్రభుత్వంలో నిర్మించినవే
రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం అమలు చేసింది. ఈ పథకం ద్వారా 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల స్థలాలను మహిళల పేరిట ఉచితంగా పంచింది. ఆ ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ రూ.1.15 లక్షల కోట్ల పైమాటే. పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం ద్వారా ఏకంగా 17 వేలకుపైగా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు.
అంతేకాకుండా జగనన్న కాలనీల్లో 19 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. వీటికి టిడ్కో ఇళ్లు 2.62 లక్షలు అదనం. కాగా, ఎన్నికలు ముగిసే నాటికి 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి వైఎస్ జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది. ఇక సాధారణ ఇళ్లలో 8 లక్షలకు పైగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 1.28 లక్షలు స్లాబ్ పూర్తయిన, 99 వేల ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయి. ఇందులో చాలా వరకు తుది దశ నిర్మాణాలూ పూర్తయినప్పటికీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్టేజ్ అప్‌డేట్ చేయని పరిస్థితి నెలకొంది.
జగన్ హయాంలో పూర్తయితే బాబు షో
వైఎస్ జగన్ హయాంలో పూర్తయిన ఇళ్లకు స్టేజ్ అప్‌డేట్ చేసి తామే నిర్మించినట్టు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. గతేడాది నవంబర్‌లో పేదలకు 3 లక్షల ఇళ్ల పంపిణీ పేరిట షో చేశారు. అప్పట్లో అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఇళ్లు జగన్ ప్రభుత్వం 2021–22లో కట్టినవే కావడంతో అప్పట్లో బాబు ప్రభుత్వం అభాసుపాలైంది.
అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గని బాబు సర్కార్ సోమవారం మరో 2.5 లక్షల ఇళ్లను పేదలకు పంపిణీ పేరిట మరోమారు దు్రష్పచారానికి తెరలేపింది. ఈ 2.5 లక్షల ఇళ్లలో లక్ష గత ప్రభుత్వంలోనే పూర్తి చేసిన టిడ్కో ఇళ్లు కాగా, మిగిలిన 1.5 లక్షల ఇళ్లు కూడా గత ప్రభుత్వంలో నిర్మించిన సాధారణ ఇళ్లు కావడం గమనార్హం. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున పేదలకు స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చిన బాబు నేటికీ ఒక్క గజం స్థలం పేదలకు ఇవ్వలేదు.


