సర్కారు ‘మాస్టర్‌’ప్లాన్‌ | Chandrababu Master Plan on Mega DSC-2025: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సర్కారు ‘మాస్టర్‌’ప్లాన్‌

May 25 2026 5:23 AM | Updated on May 25 2026 5:23 AM

Chandrababu Master Plan on Mega DSC-2025: Andhra Pradesh

ప్రణాళిక ప్రకారమే డీఎస్సీ స్కాం!

 టెట్‌ సమయంలో ఉన్నపళంగా కన్వీనర్‌ తొలగింపు  

ఆ బాధ్యతలు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కు అప్పగింత  

డీఎస్సీ పేపర్‌ తయారీ, పరీక్ష నిర్వహణ ఒక్కరి చేతుల్లోకే.. 

ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తును కాంట్రాక్టు ఉద్యోగి చేతిలో పెట్టిన వైనం 

ఎంతో భద్రతతో జరగాల్సిన పేపర్‌ తయారీలో కాంట్రాక్‌ ఉద్యోగి పాత్ర 

పోస్టుకు ఎంపికైనట్టు ఎస్‌ఎంఎస్‌లు పంపాకా టెస్ట్‌ మెస్సేజ్‌ అంటూ దాటవేత  

జరిగిన లీకేజీ బయటకు రాకుండా దాచే యత్నం

సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 పేరుతో భారీ స్కామ్‌కు చంద్రబాబు ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ వేసిందా? ప్రణాళిక ప్రకారమే నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులను నిలువునా ముంచేసిందా? అంటే డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ నుంచి ఉద్యోగాల భర్తీ వరకు జరిగిన పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తోంది.  వాస్తవానికి డీఎస్సీ పరీక్ష పూర్తయిన తర్వాత మెరిట్‌ లిస్టులను జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ)లకు అందించాలి. కానీ అంతా తామే చేస్తామని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయమే మొత్తం ప్రక్రియను చేతిలోకి తీసుకుంది. పరీక్ష నిర్వహణ­లో లోపాలు ఉన్నాయని, తమకు అన్యాయం జరుగుతోందని అభ్యర్థులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా అంతా సక్రమమేనంటూ బుకాయించింది.

దరఖాస్తు ప్రక్రియ మొదలు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ వరకు అంతా తన చేతిలోనే పెట్టుకున్న ఉన్నతాధికారులు పరీక్ష నిర్వహణలో కీలకమైన విధుల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించడం విస్మ­యం కలిగిస్తోంది.  వాస్తవానికి డీఎస్సీ పేపర్‌ తయారీని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) చూస్తుంది. ప్రశ్నల తయారీ, జవాబుపత్రాల వ్యాలి­డేషన్‌ ఎంతో కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థల మధ్య చేపట్టాలి. కానీ ఈ మొత్తం ప్రక్రియను ఓ కాంట్రాక్టు ఉద్యోగి చేతిలో పెట్టడం గమనార్హం. అంతకు ముందే టెట్‌ కన్వీనర్‌ను తొలగించి ఆ బాధ్యతలను మరొకరికి అప్పగించడం కూడా సర్కారు పాత్రపై అనుమానాలకు బలం చేకూరుస్తోంది.   

టెట్‌ కన్వీనర్‌ను తొలగించి..   
వాస్తవానికి ఏపీ టెట్‌ కన్వీనర్‌గా ఉండే అధికారే డీఎస్సీకి కూడా కన్వీనర్‌. టెట్‌ సెల్‌కు విద్యాశాఖలోని జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారిని ప్రభుత్వం టెట్‌ కన్వీనర్‌గా నియమించింది. అయితే, టెట్‌ పరీక్షలు ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే ఆయనను ఆ బాధ్యతల నుంచి ఉన్నఫళంగా తొలగించి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ను కన్వీనర్‌గా నియమించింది. దీంతో టెట్‌ నిర్వహణ, డీఎస్సీ పేపర్‌ తయారీలో ఒకే అధికారి కొనసాగారు. అనంతరం ఎస్సీఈరీ్టలో కేవలం కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి నవీన్‌కు కేవలం డీఎస్సీ ప్రశ్నలు తయారీతో పాటు వాటిని ఆన్‌లైన్‌ చేయడం చేసే బాధ్యతలు అప్పగించారు. అతను కూడా డీఎస్సీకి హాజరవుతున్నాడని తెలిసినా అధికారులు అదే విధుల్లో కొనసాగించడం కొసమెరుపు.

అసలు రహస్యంగా జరగాల్సిన కీలక విధుల్లో కాంట్రాక్టు ఉద్యోగిని ఎలా నియమించారన్నది పెద్ద ప్రశ్న. ఫలితాలు విడుదల కాగానే కాంట్రాక్టు ఉద్యోగి నవీన్‌ కృష్ణా జిల్లా సోషల్‌ స్టడీస్‌ టాపర్‌గానూ, టీజీటీలో ఆరో ర్యాంకు సాధించడంతో లీకేజీ వ్యవహారం బయటపడింది. దీంతో పరువు పోతుందేమోనని భయపడిన అధికారులు అతడిని బెదిరించి విధుల నుంచి తొలగించినట్టు సమాచారం. దీంతో నవీన్‌ తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించడంతో విషయం బయటకు రాకుండా అతనిని తమదైన శైలిలో సముదాయించినట్టు విశ్వసనీయ సమాచారం.

ఈ క్రమంలో భారీగా నగదు చేతులు మారాయన్న విమర్శలూ విద్యాభవన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. లీకేజీ  వ్యవహారాన్ని దాచేందుకు అధికారులు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. జిల్లా స్థాయిలో జరగాల్సిన ఎంపికల ప్రక్రియనూ తమ చేతుల్లోకి తీసుకున్నారు. జిల్లా సెలక్షన్‌ కమిటీలను కేవలం ఎంపికైన అభ్యర్థుల సర్టీఫికెట్ల పరిశీలనకే పరిమితం చేశారు.  

కాల్‌ లెటర్ల జారీలో ‘టెస్టింగ్‌’  
డీఎస్సీ నియామకాల్లో తొలి నుంచీ అనేక అవకతవకలకు పాల్పడిన చంద్రబాబు ప్రభుత్వ కుట్రలో మరో కోణమిది. కాల్‌ లెటర్ల జారీలో ‘టెస్టింగ్‌’ల (ఎస్‌ఎంఎస్‌) పేరుతో ఉపాధ్యాయ ఉద్యోగార్థుల భవితవ్యంతో ఆడుకుంది. ఒకే కేటగిరీకి చెందిన వారిలో ముందు, వెనుక ఉన్నవారికి లెటర్లు పంపడం, మధ్యలో ఉన్నవారికి ఇవ్వకపోవడం గమనార్హం. దీంతోపాటు అభ్యర్థుల డీఎస్సీ మార్కులూ రోజుకో విధంగా మార్చేసింది, ఇంగ్లిష్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ (ఈపీటీ) పాసైనట్టు ప్రకటించి, తర్వాత వెబ్‌సైట్‌ నుంచి డేటా తొలగించి, ‘నాట్‌ క్వాలిఫైడ్‌’ అని ప్రకటించింది.

ప్రత్యేక విభాగంలోని ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ)ల ఉద్యోగాలకూ ఎసరు పెట్టే ఎత్తుగడ వేసింది. ఈపీటీ అవసరం లేదని నోటిఫికేషన్‌లో ప్రకటించి అందుకు అనుగుణంగా హాల్‌టికెట్లు ఇచ్చి పరీక్ష నిర్వహించింది. తర్వాత ఈపీటీ పాసవలేదని కాల్‌ లెటర్లు నిలిపివేసింది. ‘మేము మెరిట్‌ లిస్టులో ఉన్నా కాల్‌ లెటర్లు రాలే’దంటూ వేలమంది అభ్యర్థులు జిల్లాల్లో కౌన్సెలింగ్‌ సెంటర్ల వద్ద ఆందోళన చేస్తే అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం రాజకీయ రంగు పులిమి తప్పులను కప్పిపుచ్చే యత్నం చేసింది.  

ప్రతిభకు అడుగడుగునా అన్యాయం
డీఎస్సీ నోటిఫికేషన్‌ దగ్గర నుంచి కాల్‌ లెటర్ల (ఎస్‌ఎంఎస్‌) జారీ, సర్టీఫికెట్ల పరిశీలన వరకు అభ్యర్థుల జీవితాలను పణంగా పెట్టే రీతిలోనే ప్రక్రియ నడిచింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్‌ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు.  16,347 ఉపాధ్యాయు పోస్టులకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమర్పించారు. అభ్యర్థులకు ఆయా పరీక్షలను సర్కారు వేర్వేరుగా నిర్వహించింది. ఇందులో ప్రతిభ గల అభ్యర్థులు ఎస్జీటీతోపాటు స్కూల్‌ అసిస్టెంట్, టీజీటీ మూడు పోస్టులు సాధించారు.

మెరిట్‌ ప్రకారం మూడు పోస్టులకు కాల్‌ లెటర్లు పంపాల్సి ఉన్నా దరఖాస్తులో మొదట ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్‌ లెటర్లు పంపారు. దీంతో అభ్యర్థి సాధించిన పోస్టుల్లో నచి్చన పోస్టు ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇలా దాదాపు 4 వేల మంది ఉన్నత అవకాశం కోల్పోయారు. డీఎస్సీ నిర్వహణలో తమదే పేటెంట్‌గా చెప్పుకుంటున్న టీడీపీ సర్కారు అడుగడుగునా అడ్డగోలుగా తప్పులు చేసి అభాసుపాలైంది.   ప్రతిభావంతుల భవిష్యత్తును నాశనం చేసింది.  

హైకోర్టు ఆక్షేపించినా..!
చంద్రబాబు ప్రభుత్వంలో డీఎస్సీ నిర్వహణలో లోపాలు ఉన్నాయని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తాము రెండు, మూడు పోస్టులకు ఎంపికైతే ఒక పోస్టుకే కాల్‌ లెటర్‌ పంపి.. తమ ఉన్నత ఉద్యోగ హక్కుకు భంగంకలిగించారని వందలాది మంది పిటిషన్లు వేయడంతో హైకోర్టు విచారణ చేపట్టింది. ఉన్నత ఉద్యోగం అభ్యర్థి హక్కు అని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందినవారికి పోస్టు ప్రిపరెన్సీ క్రమంలో కాకుండా ఉన్నత అర్హత గల ఉద్యోగం ఇవ్వాలని అక్టోబర్‌ 12నే మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

అయినా వాటిని పట్టించుకోకుండా అక్టోబర్‌ 15న ఎంపిక ప్రక్రియను సర్కారు పూర్తిచేసేసింది. దీంతో మరో సారి అభ్యర్థులు కోర్టుకెళ్లగా న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశి్నంచింది. ఇది దారుణమైన, దుర్మార్గమైన చర్యగా అభివరి్ణంచింది. 2 నెలల్లోగా వారికి ఉన్నత ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులిచ్చి ఏడునెలలైనా అభ్యర్థులకు న్యాయం జరగలేదు.  

Advertisement
 
Advertisement
Advertisement