రాజధానిలో మరో స్కామ్‌.. దేవుడికే శఠగోపం | Chandrababu Govt Scam In temple land of Capital Amaravati land acquisition | Sakshi
Sakshi News home page

రాజధానిలో మరో స్కామ్‌.. దేవుడికే శఠగోపం

May 25 2026 5:05 AM | Updated on May 25 2026 5:05 AM

Chandrababu Govt Scam In temple land of Capital Amaravati land acquisition

సర్వే నంబరు 271–ఏలో 10.6 ఎకరాల భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద తీసుకుంటూ.. మోతుకూరి సుబ్బారావుకు ప్లాట్లు కేటాయిస్తూ 2025 జూన్‌ 18న ఒప్పందం చేసుకున్న సీఆర్‌డీఏ

రాజధాని భూ సమీకరణలో ఆలయ భూమికి గాను టీడీపీ నేతలకు నజరానా

వెలగపూడిలో శ్రీవేణుగోపాలస్వామికి సర్వే నంబర్‌ 271–ఏలో 10.6 ఎకరాల భూమి

ఈ భూమిని ఆక్రమించుకున్న టీడీపీ నేత మోతుకూరి సుబ్బారావుకు నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయింపు 

నిర్మాణంలో ఉన్న సీఎం చంద్రబాబు ప్యాలెస్‌కు సమీపంలో 10,600 గజాల విస్తీర్ణంతో 6 నివాస ప్లాట్లు 

ఇదే ప్రాంతంలోని ఈ–6 రోడ్డుకు సమీపంలో 2,650 గజాల చొప్పున 2 వాణిజ్య ప్లాట్లు   

2015–18లో ఇది దేవాలయ భూమి అని స్పష్టం చేసిన దేవదాయ శాఖ 

2024లో చంద్రబాబు సర్కారు రాగానే మారిన సీన్‌ 

వంగవీటి మోహన రంగా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ ఎమ్మెల్యే చక్రం తిప్పిన వైనం 

ఈ భూమికి సంబంధించి తన అనుచరుడు మోతుకూరికి నివాస, వాణిజ్య ప్లాట్లు, కౌలు చెల్లించాలని ఉన్నత స్థాయిలో ఒత్తిడి

రంగంలోకి దిగిన పేకాటలో చేయి తిరిగిన మంత్రి.. ఫలితంగా మోతుకూరికి నివాస, వాణిజ్య ప్లాట్లు, కౌలు కేటాయిస్తూ 2025 జూన్‌ 18న సీఆర్‌డీఏ ఒప్పందం

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో రోజుకో కుంభకోణం వెలుగు చూస్తోంది. చదరపు అడుగు నిర్మాణానికి ఏకంగా రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తూ.. నిపుణులు విస్తుపోయేలా చేస్తుండటమే కాకుండా ప్లాట్ల కేటాయింపులో జరిగిన మాయాజాలం రైతులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో దేవుడి భూములను అస్మదీయులకు కట్టబెట్టి దేవాలయ వ్యవస్థను కూడా చంద్రబాబు సర్కార్‌ వదలకుండా భ్రష్టు పట్టిస్తోందని స్పష్టమవుతోంది. రాజధాని ప్రధాన ప్రాంతం(సీడ్‌ కేపిటల్‌ ఏరియా)లోని వెలగపూడి వేణుగోపాలస్వామి మాన్యం సర్వే నెంబరు 271–ఏలోని 10.6 ఎకరాల భూమిని టీడీపీ నేత మోతుకూరి సుబ్బారావు, మోతుకూరి రాజ్యలక్ష్మి ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు.  సుబ్బారావు.. వంగవీటి మోహన రంగా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న విశాఖపట్నంకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడు. 

సదరు నేత ఆక్రమణలో ఉన్న ఆలయ భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద తీసుకుంటూ.. దానికిగానూ మోతుకూరి సుబ్బారావుకు సీఎం చంద్రబాబు నిర్మించుకుంటున్న ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో 10,600 గజాల విస్తీర్ణంతో కూడిన 6 నివాస ప్లాట్లు కేటాయించారు. ఈ ప్రాంతంలోనే ఈ–6 రోడ్డుకు సమీపంలో 2,650 గజాల విస్తీర్ణంతో కూడిన రెండు వాణిజ్య ప్లాట్లను కేటాయించారు. తొలి ఏడాది ఎకరానికి రూ.30 వేలు.. ఆ తర్వాత ప్రతి ఏటా రూ.3 వేలు పెంచుకుంటూ 10.6 ఎకరాలకు పదేళ్లకు సంబంధించిన కౌలును కూడా ప్రభుత్వం ఆయనకు చెల్లించేసింది. దేవుడికి మాత్రం 2013 భూసేకరణ చట్టం ప్రకారం 10.6 ఎకరాలకు సంబంధించిన పరిహారాన్ని దేవదాయ శాఖకు చెల్లించాలని నిర్ణయించింది. అంటే.. దేవుడికి భూమికిగాను పరిహారంతో సరిపెట్టేసిన చంద్రబాబు సర్కార్‌.. ఆ భూమిని ఆక్రమించిన టీడీపీ నేతకు మాత్రం అత్యంత విలువైన ప్రాంతంలో నివాస, వాణిజ్య ప్లాట్లతోపాటు కౌలును కూడా చెల్లించడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

రాజధానిలో నివాస ప్లాటు గజం రూ.50 వేలు, వాణిజ్య ప్లాటు(250 గజాలు) రూ.2.70 కోట్లు పలుకుతోందని చంద్రబాబు ప్ర­భుత్వం 2024 సెప్టెంబర్‌లో ప్రపంచ బ్యాంకుకు నివేదిక ఇచ్చింది. ఈ లెక్కన మోతుకూరి సుబ్బారావుకు ఇచ్చిన ప్లాట్ల విలువ రూ.81.62 కోట్లు కావడం గమనార్హం. ఇదొక్కటే కాదు నెక్కళ్లులో శ్రీమళ్లేశ్వరస్వామి వారి ఆలయం, శ్రీవేణుగోపాలస్వామి వారి ఆలయాలకు చెందిన భూములతోపాటు రాజధాని గ్రామాల్లో 173.22 ఎకరాలను ఇదే రీతిలో వాటిని ఆక్రమించి, సాగుచేసుకుంటున్న వారికి లబ్ధి చేకూర్చింది. వాటిని భూ సమీకరణ కింద రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న సీఆర్‌డీఏ.. దేవాదాయ శాఖకు పరిహారంతో సరిపెట్టి.. ఆక్రమించుకున్న వారికి నివాస, వాణిజ్య ప్లాట్లు, ఏటా కౌలు చెల్లిస్తోంది.  

వెలగపూడిలో సీఎం చంద్రబాబు నిర్మిస్తున్న ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో మోతుకూరి సుబ్బారావుకు కేటాయించిన 10,600 గజాల విస్తీర్ణంతో కూడిన ఆరు నివాస ప్లాట్లు  

సీఆర్‌డీఏ అథారిటీ తీర్మానం.. కబ్జాదారులకు ప్రయోజనం 
గుంటూరు జిల్లాలో తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో 217 చదరపు కిలోమీటర్ల (53,749.49 ఎకరాలు) ప్రాంతాన్ని 2015లో ప్రభుత్వం రాజధానిగా ప్రకటించింది. అటవీ, ప్రభుత్వ భూమిపోనూ, మిగతా భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం (భూ సమీకరణ పథకం) కింద సమీకరించాలని నిర్ణయించింది. 29 గ్రామాల్లో 1,017.09 ఎకరాల దేవాదాయ శాఖ భూమి ఉంది. ఇందులో 843.87 ఎకరాలను భూ సమీకరణ పథకం కింద తీసుకున్న సీఆర్‌డీఏ.. సంబంధిత ఆలయాలకు రాజధానిలో నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించి, ఏటా కౌలు చెల్లిస్తూ వస్తోంది. మిగతా 173.22 ఎకరాల భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వారిలో అధిక శాతం టీడీపీ నాయకులు, సానుభూతిపరులు కావడంతో అప్పటి చంద్రబాబు సర్కార్‌ వారికి ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. 

ఆక్రమించుకున్న వారి నుంచి ఆ భూమిని దేవాదాయ శాఖ స్వా«దీనం చేసుకోవడం కష్టంగా మారిందని, బలవంతంగా తీసుకుంటే వాటిని ఆక్రమించుకున్న వారి జీవనోపాధి దెబ్బ తింటుందని సన్నాయి నొక్కులు నొక్కింది. ఈ క్రమంలో 2016 సెప్టెంబర్‌ 20న జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ 6వ సమావేశంలో.. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూమికిగాను సంబంధిత ఆలయానికి పరిహారం చెల్లించి, ఆ భూమిని ఆక్రమించుకుని, సాగు చేసుకుంటున్న వారికి నివాస, వాణిజ్య ప్లాట్లతోపాటు కౌలును కూడా చెల్లించాలని తీర్మానం చేసింది. దాన్ని అమలు చేస్తూ 2018 అక్టోబర్‌ 11న ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో ఎంఎస్‌ నంబర్‌ 330) జారీ చేసింది.  

సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కి.. 
దేవాలయ భూములపై దేవుడికి సేవ చేసేవారు, ఇనాముదార్లకు కేవలం అనుభవించే హక్కు మాత్రమే ఉంటుందని, వాటిపై ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవని, విక్రయించడానికి ఏమాత్రం వీల్లేదని.. దేవుడి భూములు దేవుడికే చెందుతాయని 1998లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. వింజమూరు రాజగోపాలాచారికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మధ్య నడిచిన దేవాలయ భూమి వ్యాజ్యంలో.. దేవుడి భూమి దేవుడికే చెందుతుందని.. సేవ చేసే వారికి వాటిపై ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవని స్పష్టం చేస్తూ 2015లో హైకోర్టు సైతం తీర్పు ఇచ్చింది. 

ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో వైకుంఠపురం శ్రీవెంకటేశ్వరస్వామికి భజంత్రిగా సేవ చేసే వ్యక్తి.. సేవ చేసినందుకుగాను తాను సాగు చేసుకుంటున్న దేవాలయ భూమిని విక్రయించడంపై వ్యాజ్యం (డబ్ల్యూపీ 1718/2019) దాఖలైంది. దీనిపై విచారించిన హైకోర్టు.. 1998లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ఉటంకిస్తూ.. దేవుడి భూమిపై దేవుడికే సర్వాధికారాలు ఉంటాయని, సేవ చేసే వారికి, ఇతరులకు ఎలాంటి హక్కులు ఉండవని స్పష్టం చేసింది. కానీ.. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను తుంగలో తొక్కుతూ సీఆర్‌డీఏ అథారిటీ 6వ సమావేశంలో దేవుడి భూములను ఆక్రమించుకున్న వారికి ప్రయోజనం చేకూర్చుతూ నిర్ణయం తీసుకున్నారని భక్తులు, ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.   

నెక్కళ్లులోనూ ఇదే తరహా దందా 
నెక్కళ్లులో శ్రీమళ్లేశ్వరస్వామి ఆలయానికి సర్వే నంబరు 59లో 11.45 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రూ.1,87,58,864.38 పరిహారం ఇవ్వాలని, అదే గ్రామంలో శ్రీవేణుగోపాలస్వామి ఆలయానికి సర్వే నంబరు 158లో ఉన్న 14.07 ఎకరాల భూమికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం రూ.2,30,51,285.75 పరిహారంగా ఇవ్వాలని సీఆర్‌డీఏ అధికారులు లెక్కగట్టారు.  
⇒ ఈ రెండు ఆలయాలకు సంబంధించిన 25.52 ఎకరాల భూమికిగానూ మొత్తంగా రూ.4,18,10,150.14 పరిహారంగా సీఆర్‌డీఏ దేవదాయ శాఖకు చెల్లించింది. ఆ భూమిని ఆక్రమించుకుని, సాగు చేసుకుంటున్న వారికి మాత్రం రాజధానిలో నివాస, వాణిజ్య ప్లాట్లు, ఏటా కౌలును చెల్లిస్తూ సీఆర్‌డీఏ ఒప్పందం చేసుకుంది.  
⇒ శ్రీమల్లేశ్వరస్వామి ఆలయ భూమిని ఆక్రమించుకుని, సాగు చేసుకుంటున్న అబ్బూర రజిని, రామినేని రామారావు, పూజల పద్మ చౌడేశ్వరి, రామినేని మళ్లీశ్వరి, రామినేని బాబు, రామినేని పూర్ణచంద్రరావు, రావెల శ్రీనివాసరావు, రావెల రామచంద్రరావు, రావెల రాంబాబులకు సీఆర్‌డీఏ నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించింది. వారికి ఏటా కౌలు కూడా చెల్లిస్తోంది.  
⇒ శ్రీవేణుగోపాలస్వామి ఆలయ భూమిని ఆక్రమించుకుని, సాగు చేసుకుంటున్న మాడపాటి సింహాద్రి, భట్టిప్రోలు షేక్‌ జమీల్, గుమ్మా శివలీల, చదలవాడ చలపతిరావు, గుర్రపూసల చిట్టెమ్మ, మేడూరి వీరరాజేశ్వేరమ్మ, గుమ్మా శ్రీనివాసరావు, గుమ్మా లక్ష్మినారాయణ, పొదిలి బోడ­య్య, షేక్‌ ఏసోబు, చదలవాడ లక్ష్మీబాయమ్మ, చదల­వాడ సుబ్బారావు, గుమ్మా వెంకటరావు, కూరుకూ­టి వెంకటనరసమ్మలకు నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించిన సీఆర్‌డీఏ.. వారికి ఏటా కౌలు కూడా చెల్లిస్తోంది.  


నిషేధం తొలగించి లబ్ధి చేకూర్చేలా అడుగులు! 
⇒ ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో 4.67 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. వాటిని అస్మదీయులకు, టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం 2014–19 మధ్య, ఈ 23 నెలల కాలంలో ఇలాంటి పలు నిర్ణయాలు తీసుకుందని భక్తులు, ధార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.  
⇒ వాస్తవానికి ప్రభుత్వం దేవదాయ శాఖ భూముల క్రయవిక్రయాలు జరగకుండా.. వేరొకరు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి వీల్లేకుండా నిషేధిత జాబితాలో పెట్టింది. అయితే ప్రైవేట్‌ వ్యక్తుల భూముల సర్వే నంబర్లు మారి, దేవాలయాల భూముల్లో కలిపారంటూ లక్షన్నర ఎకరాల దేవాలయాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు చంద్రబాబు సర్కార్‌ కసరత్తు చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఉండే దేవాలయాల భూములను 33 ఏళ్ల పాటు ప్రైవేట్‌ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో 139) జారీ చేసింది.  

⇒ కృష్ణా జిల్లా గొడుగుపేట దేవాలయానికి చెందిన భూమి విజయవాడలోని గొల్లపూడిలో ఉంటే.. ఆ భూమిని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ కోసం, గోల్ఫ్‌ కోర్టు కోసం కేటాయించారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు ఇందులో రాత్రికి రాత్రి మట్టిని తోలారు. దీనిపై భక్తులు సుప్రీంకోర్టు వరకు వెళ్లి స్టే తెచ్చుకోవాల్సి వచ్చింది.  
⇒ కాకినాడ శ్రీభావనారాయణస్వామి ఆలయ భూము­లను క్రికెట్‌ స్టేడియం కోసం కేటాయిస్తూ ఆదేశాలిచ్చారు. ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉందన్న సాకుతో వైఎస్సార్‌ కడప జిల్లాలోని పుష్పగిరి మఠం పేరిట అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారం గ్రామ పరిధిలోని 259 సర్వే నంబరులో ఉన్న 6.89 ఎకరాల భూమిని అమ్మేయడానికి అనుమతి ఇస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవన్నీ కళ్లారా చూస్తున్న భక్తులు.. దేవుడి ఆస్తులను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే అస్మదీయులకు వాటిని కట్టబెడుతోందని మండిపడుతున్నారు. ఇలాగైతే ఆయా ఆలయాల నిర్వహణ, నిత్య కైంకర్యాలు, ఉత్సవాలకు ఇక్కట్లు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీఆర్‌డీఏతో చేసుకున్న ఒప్పందంలో సాక్షి సంతకం చేసిన వట్టిగుంట వేణుగోపాలరెడ్డికి తనకు కేటాయించిన 600 గజాల వాణిజ్య ప్లాటును ఇచ్చిన మోతుకూరి సుబ్బారావు(ఆ ప్లాటును వేణుగోపాలరెడ్డికి విక్రయించారా లేదా ఇందులో మర్మమేమిటన్నది వారిద్దరికే ఎరుక) 

పేకాటలో చేయితిరిగిన మంత్రి ఒత్తిడితో..
⇒ వెలగపూడిలో శ్రీవేణుగోపాలస్వామికి సర్వే నెంబరు 271–ఏలో 10.6 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని మోతుకూరి రాజ్యలక్ష్మి, మోతుకూరి సుబ్బారావు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారని భక్తులు చెబుతున్నారు. రాజధాని భూ సమీకరణ కింద నోటిఫికేషన్‌ జారీ చేసినప్పుడు 9.1 ఫారమ్‌లో ఆ భూమి పట్టా భూమిగా.. మోతుకూరి రాజ్యలక్ష్మి, సుబ్బారావుకు చెందినదిగా సీఆర్‌డీఏ చూపింది. దీనిపై దేవదాయ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ భూమి దేవుడిదని రికార్డులు చూపడంతో సీఆర్‌డీఏ అధికారులు 9.5 ఫారమ్‌లో దాన్ని దేవాదాయ శాఖ భూమిగా మార్చారు.  

⇒ కానీ.. ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద ఆ భూమిని తీసుకుంటూ జారీ చేసిన 9.22 ఫామ్‌లో మాత్రం.. ఆ భూమి దేవాదాయ శాఖతోపాటు మోతుకూరి రాజ్యలక్ష్మికి చెందినట్లుగా చూపడం గమనార్హం. దీనిపై కూడా దేవదాయ శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అçప్పట్లో ఆ భూమికి సంబంధించి.. ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద దాన్ని తీసుకుంటూ అటు మోతుకూరి సుబ్బారావుతోగానీ, ఇటు దేవదాయ శాఖతోగానీ సీఆర్‌డీఏ అభివృద్ధి ఒప్పందం చేసుకోలేదు.

మోతుకూరి సుబ్బారావుతో సీఆర్‌డీఏ చేసుకున్న ఒప్పందంలో సాక్షిగా సంతకం చేసిన వట్టిగుంట వేణుగోపాలరెడ్డి  

⇒ 2024లో చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చాక.. వంగవీటి మోహన రంగా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న విశాఖపట్నంకు చెందిన ఓ ఎమ్మెల్యే తన అనుచరుడైన మోతుకూరి సుబ్బారావుకు నివాస, వాణిజ్య ప్లాట్లు, కౌలు దక్కేలా చేయడానికి పావులు కదిపారు. ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. మోతుకూరి సుబ్బారావుకు ఉన్నత స్థాయిలో ఆశీస్సులు అందడంతో పేకాటలో చేయి తిరిగిన మంత్రి రంగంలోకి దిగారు. వేణుగోపాలస్వామి భూమికి సంబంధించి మోతుకూరి సుబ్బారావుతో ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం ఒప్పందం చేసుకోవాలని సీఆర్‌డీఏ అధికారులపై ఆ మంత్రి ఒత్తిడి తెచ్చారు.

⇒ దాంతో 2025 జూన్‌ 18న ఆ భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద తీసుకుంటూ మోతుకూరి సుబ్బారావుతో సీఆర్‌డీఏ ఒప్పందం చేసుకుంది. అనంతరం నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించింది. కౌలును కూడా చెల్లించింది. ఇందుకుగాను పేకాటలో చేయి తిరిగిన మంత్రి వెయ్యి గజాల నివాస ప్లాటును నజరానాగా అందుకున్నారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement