దోపిడీ విజన్‌.. స్కామ్‌కు డిజైన్‌ | Chandrababu Govt Scam with Gannavaram International Airport farmers Land | Sakshi
Sakshi News home page

దోపిడీ విజన్‌.. స్కామ్‌కు డిజైన్‌

May 18 2026 5:10 AM | Updated on May 18 2026 12:46 PM

Chandrababu Govt Scam with Gannavaram International Airport farmers Land

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు

2015లో ఈ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి కేసరపల్లి, బుద్దవరం, చిన్నఅవుటుపల్లి, అల్లాపురంలలో భూ సమీకరణ  

రాజధానిలో కంటే గన్నవరం విమానాశ్రయం ల్యాండ్‌ పూలింగ్‌లోనే అధిక ప్రయోజనం కల్పించిన సర్కారు 

తద్వారా సీఎం చంద్రబాబు సన్నిహితులు బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్‌, ఆలూరు బుజ్జి తదితరులు గన్నవరం సమీపంలో భూముల కొనుగోలు 

అదే భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఇచ్చి రాజధానిలో అత్యంత కీలక ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు దక్కించుకున్న వైనం 

39.15 ఎకరాలు ఇచ్చిన సీఎం సన్నిహితుడు, సినీ నిర్మాత అశ్వనీదత్‌కు వెస్ట్రన్‌ బైపాస్‌ వద్ద మూడు రోడ్ల కూడలిలో 17,580 గజాల వాణిజ్య ప్లాటు 

దీనికి సమీపంలో వెయ్యి గజాల చొప్పున 38 ప్లాట్లు .. మరో 150 గజాల నివాస ప్లాటు

బలుసుకు అమృత యూనివర్సిటికీ ఎదురుగా 3,660 గజాల వాణిజ్య ప్లాట్‌.. దానికి సమీపంలోనే 14,640 గజాల నివాస ప్లాట్‌  

ఇక్కడ సర్కారు లెక్కల ప్రకారం వెయ్యి గజాలు రూ.5 కోట్లు.. వాణిజ్య ప్లాట్‌ రూ.2.70 కోట్లు.. ఈ లెక్కన ‘గన్నవరం’ భూములు 687 ఎకరాలకు రాజధానిలో రూ.5,298 కోట్ల విలువైన ప్లాట్లు 

కౌలు రూపంలో మరో రూ.49.80 కోట్లు.. మొత్తంగా రూ.5,347.80 కోట్లని లెక్కలు వేస్తున్న రాజధాని రైతులు 

తమకు మాత్రం చెరువులు, ముంపు ప్రాంతాలు, శ్మశానాల పక్కన ప్లాట్లా.. అంటూ ఆగ్రహం  

ఇంతా చేసి ఇప్పుడు రాజధానిలోని రావెల వద్ద 4,618 ఎకరాల్లో అమరావతి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సర్కార్‌ సిద్ధం 

ఫలితంగా రాజధానిలో దక్కించుకున్న భూముల ధరలు పెంచుకోవడమే లక్ష్యం 

అస్మదీయునికి ఎయిర్‌పోర్టు పనులు అప్పగించి కమీషన్లు దండుకోవడమే ధ్యేయం

సాక్షి, అమరావతి: దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) విజన్‌తో చంద్రబాబు సర్కారు కుంభకోణాలకు డిజైన్‌ చేస్తుందనడానికి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయమే నిదర్శనమని మేధా­వులు, ఆర్థిక నిపుణులు, ప్రజా సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. 2015లో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధికి భూ సమీకరణ చేసిన ఇదే చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఆ విమానాశ్రయానికి బొంద పెడుతూ తాడికొండ మండలం రావెల వద్ద 4,618 ఎకరాల్లో అమరావతి అంతర్జాతీయ విమానాశ్ర­యాన్ని నిర్మించడానికి వడివడిగా అడుగులు ముందుకు వేస్తుండటం తెలిసిందే. అప్పట్లో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి అవసర­మైన 687 ఎకరాలను భూ సమీకరణ కింద తీసు­కుని.. రాజధానిలో నివాస, వాణిజ్య ప్లాట్లతోపాటు కౌలు ఇస్తామన్న సమాచారాన్ని అస్మదీయులకు చేర­వేసింది. దాంతో సీఎం చంద్రబాబుకు సన్నిహితు­లైన బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్, ఆలూరు బుజ్జిబాబు, ఆలూరు శ్రీనివాసరావు వంటి వారు తక్కువ ధరలకే గన్నవరం మండలం కీసర­పల్లి, చిన్నఅవుటుపల్లి, బుద్ధవరం, అల్లాపురం, అజ్జంపూడి గ్రామాల్లో విమానాశ్రయం విస్తరణకు అవసరమైన భూములను కొనుగోలు చేశారని రైతులు చెబుతున్నారు. 

అవే భూములను భూ సమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) కింద గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధికి అప్పగించి.. రాజ«ధానిలో అత్యంత ప్రధానమైన ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లను వారు దక్కించుకున్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి కీసరపల్లిలో 39.15 ఎకరాల భూమిని సీఎం చంద్రబాబు సన్నిహితుడు, సినిమా నిర్మాత చలసాని అశ్వనీదత్‌ భూ సమీకరణ కింద ఇచ్చి.. రాజధానిలో వెస్ట్రన్‌ బైపాస్‌కు సమీపంలో మూడు రోడ్ల కూడలిలో 17,580 గజాల వాణిజ్య ప్లాటు, దానికి సమీపంలోనే వెయ్యి గజాల చొప్పున 38 నివాస ప్లాట్లు, 150 గజాల మరొక నివాస ప్లాటును దక్కించుకున్నారు. అశ్వనీదత్‌ 17,580 గజాల వాణిజ్య ప్లాటును యూనియన్‌ బ్యాంకులో తనఖా పెట్టి రూ.85 కోట్లు అప్పు తీసుకోవడం గమనార్హం. తమకు మాత్రం తమ భూములను తనఖా పెట్టి అప్పు తీసుకోవడానికి సర్కార్‌ మోకాలడ్డిందంటూ రాజధాని రైతులు మండిపడుతున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన తమకు చెరువులు, ముంపు ప్రాంతాలు, శ్మశానాల పక్కన ప్లాట్లను లాటరీ పేరుతో అంటగట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గన్నవరం భూ సమీకరణలో మరో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ 
విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయంగా అభివృద్ధి చేయడం కోసం కొత్త రన్‌ వే, కొత్త టెర్మినల్, ఫ్లై ఓవర్లు, మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టేందుకు రూ.4 వేల కోట్ల వ్యయంతో 2015లో కేంద్రం సిద్ధమైంది. అందుకు అవసరమైన 687 ఎకరాలను తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ భూమిని భూ సమీకరణ కింద సమీకరించాలని అప్పటి చంద్రబాబు సర్కార్‌ నిర్ణయించింది. పట్టా భూమైతే ఎకరానికి.. మెట్ట, జరీబుతో సంబంధం లేకుండా వెయ్యి గజాల నివాస ప్లాటు, 450 గజాల వాణిజ్య ప్లాటుతోపాటు ఏడాదికి రూ.50 వేలు చొప్పున.. ప్రతి ఏటా రూ.5 వేలు పెంచుతూ పదేళ్లపాటు కౌలు ఇస్తామని నిర్ణయించింది. ఇదే విషయాన్ని అస్మదీయులకు ఉప్పందించింది. 

అదే రాజధానిలో ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూమి ఇస్తే.. పట్టా భూమైతే అదీ జరీబు అయితేనే ఆ మేరకు ప్రయోజనం కలుగుతుంది. అదే మెట్ట భూమైతే ఎకరానికి వెయ్యి గజాల నివాస ప్లాటు, 250 గజాల వాణిజ్య ప్లాటు, ఏడాదికి రూ.30 వేల చొప్పున కౌలు ఇస్తారు. రాజధానిలో కంటే గన్నవరం విమానా­శ్రయానికి భూ సమీకరణ కింద భూమి ఇస్తేనే అధిక ప్రయోజనం చేకూరుతుంది. దాంతో గన్నవరం విమానాశ్రయం విస్తరణకు సమీకరించే 687 ఎకరాల్లో (గన్నవరం మండలం కీసరపల్లి, చిన్నఅవుటుపల్లి, అల్లాపురం, బుద్ధవరం, అజ్జంపూడి గ్రామాల్లో) పచ్చ గద్దలు వాలాయి. తమతో తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేస్తూ తొలుత అగ్రిమెంటు చేసుకుని, భూ సమీకరణ నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత రిజిస్ట్రేషన్‌ చేసుకుని.. వాటిని ప్రభుత్వానికి అప్పగించారని రైతులు వాపోతున్నారు. 

సీఎం సన్నిహితుల్లో కొందరు ఇలా..
సీఎం చంద్రబాబుకు బలుసు శ్రీనివాసరావు అత్యంత సన్నిహితుడు. రాజధానిలో భారీ ఎత్తున కాంట్రాక్టు పనులు దక్కించుకున్నారు. ఈయన కీసరపల్లిలో సర్వే నెంబరు 280/4లో 1.80, 282/7లో 0.11, 282/8లో 0.84, 252/1ఏలో 1.42, బుద్ధవరంలో సర్వే నెంబరు 463/14లో 0.68, 463/12లో 0.45, 463/16లో 0.52, 463/15లో 0.39, 463/13లో 0.48 ఎకరాలు మొత్తం 6.69 ఎకరాలు కొనుగోలు చేసి విమానాశ్రయానికి ల్యాండ్‌ పూలింగ్‌ కింద అప్పగించారు. 

⇒ రాజధాని ప్రాంతంలో మందడం గ్రామానికి చెందిన బెజవాడ రమేష్‌ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు. ఆయన, తండ్రితో కలిసి గన్నవరం మండలం కీసరపల్లిలో సర్వే నంబర్‌ 252/1బీలో 1.91 ఎకరాలు, 251/2లో 1.50, బుద్ధవరంలో 477/7లో 0.44, 477/12లో 0.89, 452/4ఏలో 0.76, 225/2లో 2.94, 250/26లో 2.53, 426/1లో 4.12 ఎకరాలు (బెజవాడ రమేష్‌ తండ్రి బెజవాడ సాంబ­శివరావు), 484/5లో 0.63, 484/4/బీ2లో 0.33, 476/3సీలో 0.35, 476/2సీలో 0.25, 476/3సీలో 1.15, 511/7లో 1.04, 460/1ఏ/2లో 0.64, 452/4సీలో 2.91, 479/4లో 1.29, 491/3బీలో ఎకరం, అల్లాపురంలో సర్వే నంబరు 8/3ఏలో 0.50, 8/3సీలో 0.50, 8/3డీలో 0.50,  చిన్నఅవుటుపల్లిలో సర్వే నంబర్‌ 43/4/బీ2లో 0.32, అజ్జంపూడిలో సర్వే నంబరు 155/1లో 0.27, 40/3లో ఎకరం,  56/2లో 0.24, 56/3బీలో 0.17 వెరసి 28.18 ఎకరాలు కొనుగోలు చేసి గన్నవరం విమానాశ్రయానికి ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఇచ్చారు.

⇒ రాజధానిలో మందడం గ్రామానికి చెందిన ఆలూరు బుజ్జిబాబు, ఆయన సోదరుడు ఆలూరు శ్రీనివాసరావులతో సీఎం చంద్ర­బాబుకు సాన్నిహిత్యం ఉంది. వీరు గన్నవరం మండలం కీసరపల్లిలో సర్వే నంబరు 251/1బీలో 1.91 ఎకరాలు, అజ్జంపూడిలో సర్వే నంబరు 142/2లో 0.93, 150/1లో 0.18, బుద్ధవరంలో సర్వే నంబరు 484/5లో 0.63, 516/4లో 1.21, చిన్నఅవుటుపల్లిలో సర్వే నంబరు 40/3లో ఎకరం.. వెరసి 5.86 ఎకరాలను ఆలూరు బుజ్జిబాబు.. గన్నవరం మండలం బుద్ధవరంలో సర్వే నెంబరు 426/2ఏ/1లో 3.96 ఎకరాలు, 426/1ఏలో 2.26, 516/4లో 1.21, 426/2ఏ/1లో 3.81.. వెరసి 11.24 ఎకరాలను కొనుగోలు చేసి గన్నవరం విమానా­శ్రయానికి ల్యాండ్‌ పూలింగ్‌ కింద అప్పగించారు. 

⇒ గన్నవరం మండలం కీసరపల్లిలో చలసాని అశ్వనీదత్‌కు 39.15 ఎకరాల భూమి ఉంది. అశ్వనీదత్‌ భార్య వినయకుమారి సర్వే నంబరు 250/3లో 4, 250/5లో 4, 205/8లో 6.15, 250/6ఏలో ఎకరం, 250/7లో 4, 250/6బీలో ఎకరం.. మొత్తం 20.15 ఎకరాలు.. చలసాని అశ్వనీదత్‌ సర్వే నంబరు 250/3లో 5, 250/4లో 4, 250/9లో 10.. మొత్తం 19 ఎకరాలు వెరసి రూ.39.15 ఎకరాలు భూమిని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూ సమీకరణ కింద ఇచ్చారు.

లాటరీలో వీళ్లకే జాక్‌పాట్‌!
గన్నవరం విమానాశ్రయం అభివృద్ధికి వీరంతా సమీకరణ కింద భూములు ఇచ్చినందుకు రాజధాని ప్రాంతంలో వారికి నివాస, వాణిజ్య ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించామని సీఆర్‌డీఏ చెబుతోంది. కానీ.. ప్రధాన ప్రాంతంలో రహదారులకు సమీపంలోనే చలసాని అశ్వనీదత్, బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్‌ తదిరుతలకు ప్లాట్లు ఎలా తగిలాయని, తమకు అలా ఎందుకు తగలలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.

సినీ నిర్మాత అశ్వనీదత్‌కు రాజధాని­లోని వెస్ట్రన్‌ బైపాస్‌ సమీపంలో మూడు రోడ్ల కూడలిలో కేటాయించిన 17,580 గజాల వాణిజ్య ప్లాటు 

⇒ చలసాని అశ్వనీదత్, ఆయన భార్య భూ సమీకరణ కింద ఇచ్చిన 39.15 ఎకరాలకుగాను రాజధానిలో వెస్ట్రన్‌ బైపాస్‌కు పక్కనే.. డైమండ్‌ సర్కిల్‌కు అతి సమీపంలో ఉత్తరాన 15.6, తూర్పున 25, పశ్చిమాన 17 మీటర్ల రోడ్డు అంటే మూడు రోడ్ల కూడలిలో 17,580 గజాల విస్తీర్ణం కలిగిన వాణిజ్య ప్లాటు దక్కడం గమనార్హం. ఇక ఆ ప్లాటుకు అత్యంత సమీపంలోనే వెయ్యి గజాల విస్తీర్ణంతో కూడిన 38 ప్లాట్లు.. 150 గజాల విస్తీర్ణంతో కూడిన మరో నివాస ప్లాటు పక్కపక్కనే అశ్వనీదత్‌ కుటుంబానికి దక్కడం తమను విస్మయానికి గురిచేసిందని రాజధాని రైతులు వాపోతున్నారు.

⇒ బలుసు శ్రీనివాసరావు గన్నవరం ఎయిర్‌పోర్టుకు భూ సమీకరణ కింద ఇచ్చిన భూమికి గాను.. రాజధానిలో అమృత యూని­వర్సిటికీ సమీపంలో తూర్పున 50 మీటర్ల రోడ్డు, పశ్చిమాన 17 మీటర్ల రోడ్డుతో కూడిన 3,660 గజాల వాణిజ్య ప్లాటును లాటరీ ద్వారా సీఆర్‌డీఏ కేటాయించడం గమనార్హం. ఈ ప్లాటుకు సమీపంలోనే 25 మీటర్ల రోడ్డు పక్కనే 14,640 గజాల విస్తీర్ణంతో కూడిన నివాస ప్లాటును బలుసు దక్కించుకున్నారు.

సీఎం చంద్రబాబు సన్నిహితుడు బలుసు శ్రీనివాసరావుకు రాజధానిలో అమృత యూనివర్సిటీకి ఎదురుగా 50 మీటర్ల రహదారి పక్కనే కేటాయించిన 3,660 గజాల వాణిజ్య ప్లాటు  

⇒ బెజవాడ రమేష్‌కు రాజధానిలో.. వెస్ట్రన్‌ బైపాస్‌ సమీపంలో అశ్వనీదత్‌కు చెందిన 17,580 గజాల వాణిజ్య ప్లాటుకు సమీపంలోనే తూర్పున 17 మీటర్లు, దక్షిణాన 25 మీటర్ల రోడ్డుతో కూడిన 5,940 గజాల విస్తీర్ణం కలిగిన వాణిజ్య ప్లాటును కేటాయించారు. దాని పక్కనే ఆలూరు బుజ్జికి 1,350 గజాల ప్లాటును ఇచ్చారు. వాటి సమీపంలోనే మిగతా వాణిజ్య ప్లాట్లు, నివాస ప్లాట్లను వారికి లాటరీ ద్వారా కేటాయించడం గమనార్హం.

సీఎం చంద్రబాబు సన్నిహితుడైన బెజవాడ రమేష్‌కు అశ్వనీ దత్‌కు కేటాయించిన వాణిజ్య ప్లాటు సమీపంలోనే 5,940 గజాలతో కూడిన రెండు ప్లాట్లను కేటాయించిన సీఆర్‌డీఏ 

ఆ భూముల విలువ రూ.5,338 కోట్లు.. అభివృద్ధి పనులకు రూ.4 వేల కోట్లు 
రాజధానిలో కేటాయించిన నివాస ప్లాట్‌ గజం రూ.50 వేల చొప్పున ఎకరానికి వచ్చే వెయ్యి గజాలకు రూ.5 కోట్లు.. వాణిజ్య ప్లాట్‌ ధర రూ.2.70 కోట్లు పలుకుతుందని 2024 సెప్టెంబర్‌లో సీఆర్‌డీఏ వేసిన అంచనాల ఆధారంగా ప్రపంచ బ్యాంకుకు చంద్రబాబు సర్కార్‌ నివేదిక ఇచ్చింది. ఈ లెక్కన గన్నవరం విమానాశ్రయం కోసం తీసు­కున్న 687 ఎకరాలకుగాను రాజధానిలో కేటాయించిన నివాస, వాణి­జ్య ప్లాట్ల విలువ రూ.5,298 కోట్లు. ఎకరానికి పదేళ్లకు కౌలు రూ. 7.25 లక్షల చొప్పున 687 ఎకరాలకు రూ.49.80 కోట్లు. ఈ లెక్కన గ­న్నవరం ఎయిర్‌పోర్ట్‌ కోసం తీసుకున్న భూమి విలువ రూ.­5,347.80 కోట్లన్నమాట.ఈ ఎయిపోర్టును అంతర్జాతీయ వి­మా­నాశ్ర­యంగా అ­భి­వృద్ధి చేయడానికి కేంద్రం రూ.4 వేల కోట్లు వ్యయం చేసింది. అంటే.. ఈ ఎయిర్‌పోర్ట్‌ కోసం రూ.9,338.80 కో­ట్ల మేర ఖర్చు చేసినట్లు స్పష్టమవుతోంది. 2024 వరకు గన్నవరం విమానాశ్రయాన్ని రాజ«­దానిలో అంతర్భాగంగానే ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఇది రాజ­ధాని ప్రాంతానికి 35 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ నేపథ్యంలో రాజధానికి మరో విమానాశ్రయం అవసరం ఎంతమాత్రం లేదని మేధావులు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
రాజధానిలో నివాస ప్లాటు గజం రూ.50,000.. వాణిజ్య ప్లాటు రూ.2.70 కోట్లు పలుకుతుందని 2024 సెప్టెంబర్‌లో సీఆర్‌డీఏ వేసిన అంచనా ఆధారంగా ప్రపంచ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక  

‘డబ్బుల్‌’ ధమాకాకు స్కెచ్‌
⇒ రాజధాని నిర్మాణం కోసం ఉమ్మడి గుంటూరు జిల్లాలో తుళ్లూరు, తాడికొండ, మంగళగరి మండలాల పరిధిలోని 29 గ్రామాలలో ప్రభుత్వం 2015లో  29,442 మంది రైతుల 
నుంచి 34,823.12 ఎకరాలు సమీక­రించింది. మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూమి కలిపి 53,748 ఎకరాల్లో (217 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టినట్లు ప్రకటించింది.

⇒ ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో అత్యద్భుతమైన రాజధాని నిర్మిస్తామంటూ అప్పట్లో సీఎం చంద్ర­బాబు గొప్పగా ప్రకటించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణం, రహదారులు.. మురుగు నీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు.. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చినా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతుందని, దాన్ని అమ్మగా వచ్చే నిధులతో అమరావతి తనను తానే నిర్మించుకుంటుందని సీఎం చంద్రబాబు అనేకసార్లు సెలవిచ్చారు. అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సిటీ అంటూ గొప్పలు చెప్పారు.

⇒ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత 29 గ్రామాలకే రాజధాని పరిమితమైతే చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందంటూ చంద్రబాబు కుండబద్ధలు కొట్టారు. ఇంటర్నేషనల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్‌ సిటీ, స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌ వస్తేనే రాజధానిలో భూముల ధరలు పెరుగుతాయని చెప్పుకొచ్చారు. అయితే ఆ ఇంటర్నేషనల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్‌ సిటీ, స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌కు భూములు లేవని చెప్పడంతో రైతులు విస్తుపోతున్నారు.

⇒ వాటి కోసం 11 గ్రామాల్లో 44,676.74 ఎకరాల సమీకరణకు లీకులు ఇచ్చారు. రాజధాని రైతుల్లో ఆగ్రహాన్ని పసిగట్టి.. దాన్ని చల్లార్చేందుకు మలి విడతలో 20,484 ఎకరాలకు సమీకరణ నోటిఫి­కేషన్‌ ఇచ్చారు. ఇదే సమయంలో తాడి­కొండ మండలం రావెల వద్ద 4,618 ఎకరాల్లో రూ.3,409 కోట్ల వ్యయంతో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఆ భూ­మిని సేకరించాలా? సమీకరించాలా అన్నది నిర్ణయి­స్తామని ప్రభుత్వం చెబుతోంది.

⇒ ఇప్పటికే రాజధానికి సమీకరించిన 53 వేల ఎకరాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్‌ తదితర కనీస మౌలిక సదుపాయాల కల్పనకే రూ.1.50 లక్షల కోట్లు అవసరం. తాజాగా సమీకరిస్తున్న 20,484 ఎకరాలతోపాటు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు సమీకరించే భూమిని కలుపుకుంటే ఆ సౌకర్యాల కోసం మరో రూ.1.50 లక్షల కోట్లు అవసరమని నిపుణులు చెబుతున్నారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి ఆ వ్యయం రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని అధికారుల అంచనా. ఆ రూ.3 లక్షల కోట్లను అప్పుగా తేవాల్సిందే.

⇒ ఈ అప్పును వడ్డీతో కలిపి చెల్లించడానికి ఇంకెన్ని రూ.లక్షల కోట్లు అవసరమవుతాయో అంచనా వేసుకోవచ్చని, ఇలాగైతే రాజధాని రాష్ట్రానికి గుదిబండగా మారడం ఖాయమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాజధానిలో భూముల ధరలు పెంచుకోవడం.. ఎయిర్‌పోర్టు పనులను అస్మదీయునికి అప్పగించి కమీషన్లు దండుకోవడం కోసం చంద్రబాబు సర్కారు గన్నవరం ఎయిర్‌పోర్టుకు మంగళం పాడటంతో పాటు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి  నెడుతోందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement