పని చెయ్‌.. పైసలు అడక్కు | Chandrababu Govt messing with lives of contract lecturers in AP | Sakshi
Sakshi News home page

పని చెయ్‌.. పైసలు అడక్కు

May 7 2026 5:13 AM | Updated on May 7 2026 5:13 AM

Chandrababu Govt messing with lives of contract lecturers in AP

కాంట్రాక్ట్‌ లెక్చరర్ల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లపై బాబు ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. ఓ పక్క ‘నో వర్క్‌.. నో పే’ అంటూనే 12 నెలలు పని చేయాలంటోంది. మే నెలకు మాత్రం ఉచితంగా పనిచేయాలని లేకుంటే జూన్‌ నుంచి ప్రారంభమయ్యే వచ్చే విద్యా సంవత్సరానికి సర్వీసును పునరుద్ధరించేది లేదని బెదిరిస్తోంది. మే నెలలో అడ్మిషన్లు, ఫెయిలైన విద్యార్థులకు అదనపు తరగతుల నిర్వహణ చూడాలని ఆదేశించిన అధికారులు.. అందుకు వేతనం మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఇంటర్‌ విద్యలో 3,618 మంది, పాలిటెక్నిక్‌లో 303 మంది కాంట్రాక్టు లెక్చరర్లు (మొత్తం 3,921 మంది) తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  

పాలిటెక్నిక్‌లో పరిస్థితి మరీ ఘోరం 
ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో పనిచేస్తున్న 303 మంది కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌కు గతేడాది నుంచి 11 నెలల జీతమే ఇస్తున్నారు.  మే నెలకు ‘నో వర్క్‌.. నో పే’ విధానం అమలు చేస్తున్నారు. అయితే, వీరితో పనిచేయించుకోకున్నా.. మే నెలలో పరీక్ష పత్రాల వేల్యుయేషన్‌ చేసేందుకు గతేడాది అవకాశం కల్పించారు. ఒక్క పేపర్‌ దిద్దినందుకు రూ.18 రెమ్యూనరేషన్‌ ఇస్తారు. రోజుకి ఒక లెక్చరర్‌ 80 పేపర్స్‌ వేల్యూ చేయాలి, అంటే రోజుకు రూ.1,440 సంపాదించుకునే వీలుంది. కానీ, ఈ ఏడాది ప్రభుత్వం ఆ అవకాశాన్ని కూడా ఆపేయడంతో నెలరోజుల పాటు తాము ఎలా బతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే కాంట్రాక్ట్‌ అధ్యాపకులను కాదని ప్రభుత్వం ప్రైవేటు పాలిటెక్నిక్‌ లెక్చరర్లకు వేల్యుయేషన్‌ అవకాశం ఇవ్వడం గమనార్హం. ‘మే నెలకు జీతం ఎలాగూ లేదు.. కనీసం పేపర్‌ దిద్దితే వచ్చే కూలీతోనైనా కుటుంబ పోషణ చేసుకోవచ్చని భావించాం.  కానీ దానికీ తమను అనుమతించడం లేదు’ అని ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లు వాపోతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement