ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటల అర్థాలు వేరు అంటూ ఉంటారు చాలామంది. చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అన్నది ఆయనగారి నైజమన్న విమర్శలూ లేకపోలేదు. ‘‘అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించాలి’’ అని ఆయన ఈ మధ్య తరచూ చెబుతూ వస్తున్నారు. దీంట్లో తప్పేముంది? అని ఎవరికైనా అనిపిస్తుంది కానీ.. ఆయనను ఫాలో అయ్యేవారికి, సీనియర్ అధికారులకు మాత్రం అందులోని మతలబు ఏమిటో స్పష్టంగా తెలుసు.
అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించేందుకు ఫ్యామిలీ కార్డులు మంజూరు చేయాలని చంద్రబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించి ఫ్యామిలీ కార్డే ప్రామాణికంగా స్కీములు అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఇది పైపైకి బాగానే అనిపిస్తున్నా మీడియా కథనాలను పరిశీలిస్తే మాత్రం... లబ్ధిదారులకు కోతపెట్టే ప్రమాదాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. అర్హత అన్న పదంలోనూ రాజకీయం చేస్తున్నారన్నమాట. తమది పొలిటికల్ గవర్నెన్స్ అని రాజ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, వైసీపీకి ఓటు వేస్తారు అనుకున్నవారికి స్కీములలో కోత పెట్టే ఆలోచన చేస్తున్నారని జనసామాన్యం అనుకుంటోంది. ప్రభుత్వం పనితీరుపై అభిప్రాయ సేకరణ అంటూ చేస్తున్న సర్వేల ద్వారా ఈ ప్రయోగం జరుగుతోందని కొందరు అంటున్నారు.
ప్రభుత్వ సరళి బాగోలేదన్న వారిని, సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా గుర్తించి వారిని బెదిరించడమో, లేక వారికి అందుతున్న స్కీములను కట్ చేయడమో చేసే పన్నాగం జరుగుతోందని కొంతమంది బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. రాజకీయ కోణం కాకుండా, బాగా సంపన్నులై ఉండి, ప్రభుత్వ స్కీమ్‌లను అన్యాయంగా తీసుకుంటుంటే వారిని తొలగించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కాని చెప్పేది ఒకటి, చేసేది మరొకటిగా ఉండే చంద్రబాబు ప్రభుత్వం విధానాల వల్ల ప్రజలలో అలజడి ఏర్పడుతోంది.చంద్రబాబు మాటల ప్రకారం... వ్యవసాయ భూమి ఉన్నా, మున్సిపాల్టీలో ఆస్తి కలిగి ఉన్నా, గ్రామాలలో రూ.200 కన్నా ఎక్కువ ఆస్తి పన్ను కడుతున్నా, ఏభై యూనిట్లకన్నా ఎక్కువ కరెంట్ వాడుతున్నా, పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నా, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నా, ప్రైవేటు ఉద్యోగిగా ఈపీఎఫ్ చెల్లిస్తున్నా..ఇలా పలు కండిషన్లు పెట్టి ఇవేవి ఉన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులే అని తేలుస్తారట. వాస్తవానికి ఈ షరతులు పేదల పొట్టకొట్టే అవకాశాలే ఎక్కువ.
ఎన్టీఆర్ భరోసా కింద రూ.నాలుగు వేలు తీసుకుంటూ ఏ కుటుంబానికైనా మరో పథకం ఇవ్వరన్నమాట. ఇప్పటికే దీనికి సంబంధించి సర్వే చేశారట. దాని ప్రకారం ఆయా స్కీములకు ఏకంగా 94 శాతం మంది అనర్హులు అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 1.7 కోట్ల కుటుంబాలు ఉంటే, ఈ సర్వే ప్రకారం కేవలం 10.2 లక్షల కుటుంబాలే పేదవి. వీరికి మాత్రమే స్కీములు వస్తాయని చెప్పకపోయినా, అనర్హత పేరుతో ఎక్కువ మందికి పథకాలను రద్దు చేయవచ్చని భయపడుతున్నారు. ఏ కుటుంబానికి అయినా రూ. 48 వేలకు మించి ప్రయోజనం రాకుండా చూడాలన్నది వీరి ఉద్దేశం అని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో అర్థం అవుతున్నాయని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలు ఇష్టారాజ్యంగా బడా కాంట్రాక్టర్లకు పందేరం చేస్తున్న ప్రభుత్వం పేదల స్కీములపై ఇన్ని రకాల ఆంక్షలు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి.
గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయా కుటుంబాలకు వివిద స్కీముల కింద అర్హత ఉంటే,అవన్ని ఇచ్చేవారు. తద్వారా కొన్ని కుటుంబాలకు ఏడాదికి లక్ష నుంచి లక్షన్నర వరకు లబ్ది పొందాయని అప్పట్లో వారే స్వయంగా చెప్పేవారు. పోనీ తన విధానం వేరని ఒక కుటుంబానికి ఒక పథకమే ఇస్తానని కాని, అర్హత ప్రమాణాలు నిర్ణయిస్తామని కాని ఎన్నికల సమయంలో చెప్పారా అంటే అదేమీ లేదు. ఆకాశమే హద్దుగా వాగ్ధానాలు చేశారు. ప్రజాగళం పేరుతో ఇచ్చిన మానిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీల గురించి ఏమి రాశారా అని పరిశీలిస్తే ఎక్కడా కండిషన్లు పెట్టలేదు. అర్హులకే ఈ స్కీములు ఇస్తామన్న మాట కూడా చెప్పలేదు. ఎన్నికల ప్రచార సభలలో కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికి స్కీముల ప్రయోజనాలు దక్కుతాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు పదే, పదే చెప్పేవారు. ఉదాహరణకు ఆడబిడ్డ నిధి కింద 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ఉన్న మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని, ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటే మూడువేలు, ముగ్గురు ఉంటే 4500, నలుగురు ఉంటే ఆరు వేలు అంటూ వేలంపాట మాదిరి చంద్రబాబు పాడేవారు. ఇప్పుడేమో ఆ పథకాన్నే ఎగవేస్తున్నారు.
అది ఇవ్వకపోగా ఇస్తున్న అరకొర స్కీములలో కోత పెట్టాలని ప్రయత్నాలు ఆరంభించారు. జగన్ ప్రభుత్వం కుటుంబంలోని ఒక విద్యార్ధికి పదిహేను వేలు ఇస్తుంటే, తాము అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్దికి రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. ఆ సందర్భంలో ఎక్కడా అర్హత ప్రస్తావనే తేలేదు. ఇప్పుడు వీటిని ఫ్యామిలీ కార్డు ఆధారంగా ఏమైనా తగ్గిస్తారేమో చూడాల్సి ఉంటుంది. బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ అని అన్నా, మూడువేల నిరుద్యోగ భృతి అని ప్రచారం చేసినా ఎక్కడా కండిషన్లు ఉంటాయని పేర్కొనలేదు. బహుశా ఎలాగూ వాటిని ఇచ్చేది లేదులే అని ముందుగానే అనుకుని మానిఫెస్టోలో పెట్టి ఉండాలి. వలంటీర్లకు జగన్ రూ.ఐదు వేలే ఇస్తున్నారని, తాము రూ.పది వేలు ఇస్తామని చెప్పి అసలు ఉద్యోగానికే ఎసరు పెట్టారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇలాగే చేస్తుంటారు. 1996 ఎన్నికలకు ముందు, తాను ఎన్టీఆర్ కన్నా గట్టిగా మద్య నిషేధం అమలు చేస్తానని, రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం కొనసాగిస్తామని హామీలు ఇచ్చారు. ఎన్నికలు అయిపోయాక మాట మార్చి మద్య నిషేధం ఎత్తివేశారు. సబ్సిడీ బియ్యం రేటు పెంచారు.
2014 టర్మ్‌లో రైతుల రుణాలు ఎంత ఉంటే అంత మాఫీ చేస్తామని ఊరించారు. తీరా అధికారం వచ్చాక అరొకర చేసి ఆశకు కూడా హద్దు ఉండాలని ఎద్దేవా చేశారు. అదే విపక్షంలో ఉంటే మాత్రం తెలుగుదేశం ధోరణి మరో రకంగా ఉంటుంది. ఉదాహరణకు నేదురుమల్లి జనార్ధనరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అనర్హుల రేషన్ కార్డులు తొలగించే కార్యక్రమం చేపడితే నానా రచ్చ చేసిన టీడీపీ, జగన్ ప్రభుత్వంపై కూడా పలు అబద్దాలు సృష్టించి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ కార్డు పేరుతో సంక్షేమ స్కీముల లబ్దిదారుల కోత పెట్టడం ఆరంబిస్తే చంద్రబాబు ప్రభుత్వం తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అవుతుందేమో!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


