పెట్రోల్, డీజిల్‌పై మాటతప్పి మోసం చేసిన చంద్రబాబు
అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని ప్రగల్భాలు
టీడీపీ మేనిఫెస్టోలోనూ ఇదే హామీ
ధరలు తగ్గించకపోగా మరింత పెంచిన వైనం.. ప్రజలపై ఏడాదికి రూ.3,600 కోట్ల పెట్రో భారం
ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికం
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమికి అధికారం కట్టబెడితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని ఊరూరా తిరిగి ప్రచారం చేసిన చంద్రబాబు ఆ పని చేయకపోగా ఇప్పుడు పెంచి ప్రజలను మోసం చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు తనయుడు లోకేశ్ సైతం పెట్రోల్ బంకుల ఎదుట సెల్పిలు దిగిమరీ.. రాష్ట్రంలో పెట్రో ధరలను పక్క రాష్ట్రాలతో పోల్చి విమర్శలు చేశారు. ఆటో డ్రైవర్లతో నిర్వహించిన సభల్లోను, టీడీపీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోను పెట్రోల్, డీజిల్‌పై ధరలను భారీగా తగ్గిస్తామని నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ విషయమే మరిచిపోయారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఇప్పుడు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.3కు పైగా పెరిగినా చోద్యం చూస్తూ సామాన్యులపై అదనపు భారాన్ని మోపారు.
రాష్ట్రంలో సరికొత్త రికార్డులు
ప్రస్తుతం రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.62, డీజిల్ ధర రూ.101.24 కు చేరింది. ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేశ్ చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో లీటర్ పెట్రోల్‌పై దాదాపు రూ.28 వరకు స్టేట్ సెస్ ఉంది. అధికారంలోకి రాగానే ఈ సెస్సుల్లో 50 శాతం తగ్గిస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ.. ఇప్పుడు ఆ 50 శాతం తగ్గింపు మాట దేవుడెరుగు.. ఉన్న ధరలపైనే అదనంగా రూ.3కు పైగా వడ్డించడంతో జనం బెంబేలెత్తుతున్నారు.
జనాల జేబులకు భారీ చిల్లు
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం వల్ల రాష్ట్ర ప్రజలపై పడుతున్న భారం రోజుకు రూ.10 కోట్లు. పెట్రోల్‌పై లీటరుకు రూ.3.29, డీజిల్‌పై లీటరుకు రూ.3.14 పెరిగింది. అంటే.. పెట్రోల్‌పై రోజుకు దాదాపు రూ.3.29 కోట్లు, డీజిల్‌పై రోజుకు దాదాపు రూ.6.71 కోట్ల అదనపు భారం రాష్ట్ర ప్రజలపై పడుతోంది. ఈ భారం నెలకు రూ.300 కోట్లు, ఏడాదికి దాదాపు రూ.3,600 కోట్లను ప్రభుత్వం సామాన్య ప్రజల జేబుల నుంచి లాగేసుకుంటోంది. నాడు ‘బాదుడే బాదుడు‘ అంటూ రోడ్లెక్కిన టీడీపీ నాయకులు ఇప్పుడు అధికారంలో ఉండి ఇంత పెద్దమొత్తంలో ప్రజలపై భారం వేయడం ఏమిటని విపక్షాలు, ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

ఆటో డ్రైవర్ల కన్నీళ్లు.. నిత్యావసరాల మంటలు
ఎన్నికల సభల్లో చంద్రబాబుఆటో డ్రైవర్లను ఆలింగనం చేసుకుని ‘మీ కష్టాలు నాకు తెలుసు. ఇంధన ధరలు తగ్గించి మిమ్మల్ని ఆదుకుంటా’ అని నమ్మబలికారు. కానీ.. ఇప్పుడు డీజిల్ ధర రూ.100 దాటడంతో ఆటో కార్మికుల బతుకులు రోడ్డున పడ్డాయి. సంపాదనంతా ఇంధనానికే సరిపోతుంటే.. కుటుంబాలను ఎలా పోషించాలని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. డీజిల్ ధరల పెంపు ప్రభావం రవాణా రంగంపై తీవ్రంగా పడింది. రవాణా చార్జీలు పెరగడంతో మార్కెట్‌లో కూరగాయలు, పప్పులు, బియ్యం వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి.

ఫలితంగా మధ్యతరగతి, పేద కుటుంబాల బడ్జెట్ పూర్తిగా తలకిందులైంది. మన రాష్ట్రంలోనే ఎందుకు ఎక్కువ ధరలు ఉన్నాయి, వీటిని ఎందుకు తగ్గించడం లేదనే దానికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. ఇప్పటికైనా చంద్రబాబు ఎన్నికలకు ముందు తాను చేసిన వాగ్దానాలు గుర్తు చేసుకుని ధరలు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్నికల ముందు పెట్రోల్ బంకుల వద్ద డ్రామాలాడిన లోకేశ్ ఇప్పుడు ఎందుకు మౌనముద్ర దాల్చారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలపై పెద్దఎత్తున హడావుడి చేసి ఇప్పుడు ప్రజలపై మరింత భారాలు మోపుతుండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పొరుగు రాష్ట్రాల్లో తక్కువ.. ఏపీలోనే ఎక్కువ
ప్రస్తుతం ఏపీ కంటే పొరుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. మన పక్కనే ఉన్న తమిళనాడులో లీటర్ పెట్రోల్ ధర రూ.103.67 ఉంటే, కర్ణాటకలో రూ106.17 ఉంది. పక్కనే ఉన్న తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ.110.89 ఉంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం తాజాగా పెంచిన రూ.3 వడ్డింపుతో లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.113.62కి చేరింది. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ రూ.98.96 ఉండగా, బెంగళూరులో రూ.94.10, చెన్నైలో రూ.95.25 మాత్రమే ఉంది. మన రాష్ట్రంలో మాత్రం రూ.101.24 దాటేసింది. దేశంలోనే అత్యధిక ధరలు ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ నిలిచింది. పక్క రాష్ట్రాల కంటే లీటరుకు రూ.3 నుండి రూ.10 వరకు అదనంగా బాదుతుండటంతో జనం అల్లాడుతున్నారు.


