అనగనగా మరో బరితెగింపు! రూ.1,100 కోట్ల భూమి.. 20 కోట్లకే | Chandrababu govt exploiting land under tourism development | Sakshi
Sakshi News home page

అనగనగా మరో బరితెగింపు! రూ.1,100 కోట్ల భూమి.. 20 కోట్లకే

May 7 2026 5:01 AM | Updated on May 7 2026 5:01 AM

Chandrababu govt exploiting land under tourism development

పర్యాటకాభివృద్ధి ముసుగులో చంద్రబాబు సర్కారు భూ దోపిడీ

తిరుపతి వన్‌ ప్రాజెక్టు పేరుతో భారీగా భూ పందేరం.. ఎకరం రూ.50 కోట్లకుపైగా ఉంటే కేవలం రూ.90 లక్షలకే తెగనమ్మకం 

కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుపతిపై కన్నేసిన ఓ మంత్రి

పర్యాటక పీపీపీ ప్రాజెక్టుల పేరుతో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలతో ఒప్పందం 

వేలం, లీజు ప్రాతిపదికన కాకుండా ఫ్రీహోల్డ్‌తో విక్రయం 

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉన్న సదరు మంత్రికి లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం 

పైగా ఎస్‌జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌తో పాటు పెట్టుబడికి మించి ప్రోత్సాహకాలు 

ఫలితంగా మీకింత–మాకింత పర్వంతో సరికొత్త దోపిడీ  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి ముసుగులో సర్కారు పెద్దలు భూములను కొల్లగొడుతున్నారు. కాగితాలపై ప్రైవేటు కంపెనీల పెట్టుబడులను చూపించి రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూములను కారుచౌకగా కాజేస్తున్నారు. ఆతిథ్య రంగంలో అనుభవం లేని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు ఎకరాలకు ఎకరాలు భూ పందేరం చేస్తూ మీకింత–మాకింత అంటూ దండుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుడు, ఓ బినామీ మంత్రికి లబ్ధి చేకూర్చేందుకు ‘తిరుపతి వన్‌’ ప్రాజెక్టు పేరుతో రెండు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు ఏకంగా రూ.వెయ్యి కోట్లకుపైగా విలువైన 22 ఎకరాలను ఎకరం కేవలం రూ.90 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కట్టబెడుతోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ నిర్ణయించిన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం రేటు ప్రకారం భూమిని ఫ్రీ హోల్డ్‌ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం విస్తుగొలుపుతోంది. 

‘తిరుపతి వన్‌’లో భూ ‘మంత్రి’! 
చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 25న ‘తిరుపతి వన్‌’ ప్రాజెక్టు పేరుతో కలియుగ దైవం పాదాల చెంత హైదరాబాద్, బెంగళూరుకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు దివ్యశ్రీ హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, సైబర్‌ సిటీ బిల్డర్స్‌–డెవలప్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కన్సార్షియంకు రూ.1,100 కోట్లకుపైగా విలువైన 22 ఎకరాల భూమిని కేటాయించింది. వాస్తవానికి సదరు కంపెనీలకు ఎక్కడా ఆతిథ్య రంగంలో అనుభవం లేదు. అయినప్పటికీ, తిరుపతి జిల్లా వ్యవహారాలు చూసే ఓ మంత్రి తిరుపతి వన్‌ ప్రాజెక్టులో కీలకంగా చక్రం తిప్పి భూ కేటాయింపులు చేపట్టారు. పైగా సదరు మంత్రికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా ఉంది. తిరుపతిపై తొలి నుంచి కన్నేసిన ఆ మంత్రి.. పర్యాటకం ముసుగులో ఓ ప్రాజెక్టును తీసుకొచ్చారు. రెండు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలను అడ్డుపెట్టి భూములు కొట్టేసే ఎత్తుగడ వేశారు. 

వాస్తవానికి తిరుపతి వన్‌ ప్రాజెక్టు విలువ రూ.1,200 కోట్లు అయితే.. ప్రభుత్వం భూమితో పాటు ప్రోత్సాహకాల కింద రూ.1,400 కోట్ల మేర లబ్ధి చేకూరుస్తుండటం గమనార్హం. సాధారణంగా విలువైన ప్రాంతాల్లో భూములను ప్రైవేట్‌ సంస్థలకు వేలం ద్వారా విక్రయించాలి. ఇతర రాష్ట్రాల్లో ఇలానే చేస్తున్నారు. లేదా తక్కువ వ్యవధికి లీజుకు ఇవ్వాలి. ఈ సంప్రదాయాలన్నింటినీ తుంగలో తొక్కుతూ సదరు మంత్రి ఒత్తిడి మేర­కు నామ మాత్రపు రేటుకు ఎకరం రూ.90 లక్షలకే రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు అమ్మేస్తుండడం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రూ.1,100 కోట్ల విలువైన భూమిని రూ.19.80 కోట్లకు ధారాదత్తం చేస్తోంది. దీంతో పాటు 15 ఏళ్ల పాటు ఎస్‌జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్, భూమి కొనుగోలు స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ రీయింబర్స్, ఐదేళ్లు పరిశ్రమ రేట్లకే విద్యుత్, ఐదేళ్లు విద్యుత్‌ సుంకం రీయింబర్స్‌మెంట్‌ కల్పిస్తుండటం గమనార్హం.   

 రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు ఎకరం కేవలం రూ.90 లక్షల చొప్పున కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో   

‘నోవేషన్‌ క్లాజ్‌’ ఎత్తివేత 
చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో ప్రభుత్వ భూములను పక్కా ప్రణాళిక ప్రకారం కూటమి నేతకు దోచిపెడుతోంది. ఏకంగా ఎస్‌ఆర్వో రేటుకే కారుచౌకగా అమ్మేస్తోంది. ఇదే కొనసాగితే ప్రభుత్వ భూమి తరిగిపోయి ప్రైవేటు వ్యక్తుల ఆదాయం పెరిగిపోతుంది. ఇక్కడ ప్రాజెక్టుల పేరుతో భూములు తీసుకుంటు­న్న సంస్థలు ఆ తర్వాత ఆ భూమిని ఏమాత్రం నిర్ది­ష్ట ప్రాజెక్టులకు వాడతారనే గ్యారంటీ లేదు. ప్రభు­త్వం దగ్గర కారు చౌకగా భూమిని తీసుకుని భవిష్యత్తులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి కోట్లు గడించే ఎత్తుగడలో సదరు మంత్రి పథకం వేశారు. అందుకే భూ బదలాయింపుల్లో ‘నోవేషన్‌ క్లాజ్‌’ను సైతం లేకుండా చేశారు. 

నోవేషన్‌ క్లాజ్‌ ఉంటే, ఒక ప్రాజెక్టు (భూమి) చేతులు మారినప్పుడల్లా పాత ఒప్పందంలోని పక్షాలు.. అంటే ప్రభుత్వ సమ్మతి కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా భూ బద­లాయింపులు చేసిన ప్రతిసారీ ప్రభుత్వం దృష్టికి వస్తుంది. అంటే, ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అనేది సాగదు. కేవలం ఏ ప్రాజెక్టుకైతే భూమి ఇచ్చా­రో దానికే వినియోగించాల్సి ఉంటుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ అనుమతితో బదలాయింపు చేస్తే కచ్చితంగా వచ్చే ఆదాయంలో ప్ర­భు­త్వానికి నిర్దిష్ట వాటా ఉంటుంది. ఇలా ఎన్నిసా­ర్లు బదలాయింపు చేసినా ప్రభుత్వానికి లాభాల్లో వా­టా­లు ఇవ్వాల్సిందే.దీంతో ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు ఏకంగా నోవేషన్‌ క్లాజ్‌ను ఎత్తేశారు.  

లీజు కాదు.. శాశ్వతంగా అమ్మకం
తిరుపతి రూరల్‌ మండలంలోని దామినీడులో జాతీయ రహదారి వెంబడి భూములకు మంచి డిమాండ్‌ ఉంది. పైగా ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి ఇప్పుడు దామినీడు మణిహారంగా మారుతోంది. అక్కడ ఎకరం భూమి బహిరంగ మార్కెట్‌లో రూ.50 కోట్లకుపైగా పలుకుతోంది. కానీ, చంద్రబాబు సర్కార్‌ మాత్రం కారుచౌకగా ఎకరం రూ.90 లక్షలకే అమ్మేస్తుండటం భూ దోపిడీకి అద్దం పడుతోంది. పైగా తిరుపతి వన్‌లో రూ.­1,226.32 కోట్ల మొత్తం ప్రాజెక్టులో ఫేజ్‌–1, ఫేజ్‌–2 కింద రూ.400 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్టు.. ఇందులో ఫేజ్‌–1.. 2029 మార్చి–ఏప్రిల్‌ నాటికి, ఫేజ్‌–2 మార్చి/ఏప్రిల్‌ 2031 నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పడం చూస్తుంటే రియల్‌ ఎస్టేట్‌ దందా స్పష్టంగా కనిపిస్తోంది. 

వాస్తవానికి దివ్యశ్రీ హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, సైబర్‌ సిటీ బిల్డర్స్‌–డెవలప్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు రెండూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్నాయి. ఈ సంస్థలు ‘తిరుపతి వన్‌’ ప్రాజెక్టులో భాగంగా ఇంటిగ్రేటెడ్‌ కల్చరల్, ఎంఐసీఈ (సమావేశాలు, ఇన్సెంటీవ్స్, సదస్సులు, ప్రదర్శనలు) డెస్టినేషన్‌ సెంటర్‌ను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. రూ.1,226.32 కోట్లు పెట్టుబడితో 1,500 మందికి ఉపాధి కల్పిస్తామని ఇందుకు 22 ఎకరాల భూమిని కోరాయి. ఈ భూమిని లీజుగా కాకుండా శాశ్వతంగా విక్రయించాలని కోరగా అందుకు ప్రభుత్వం అంగీకరించి అమ్మేస్తోంది.    

Advertisement
 
Advertisement
Advertisement