పారీ పస్సు ఛార్జీలు గరిష్ఠంగా రూ.6 లక్షలు చెల్లిస్తే చాలని ప్రభుత్వం జారీ చేసిన జీవో 304
రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినా.. బడా కంపెనీలకు రూ.కోట్ల రాయితీలు
వారు తీసుకునే రుణాలపై రిజిస్ట్రేషన్ చార్జీలు భారీగా తగ్గింపు
ఇకపై గరిష్టంగా రూ.6 లక్షలు చెల్లిస్తే చాలంటూ ప్రభుత్వం జీవో
దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి
సాక్షి, అమరావతి: కార్పొరేట్ కంపెనీలు తీసుకునే రుణాలపై రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా తగ్గిస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకవైపు అప్పుల్లో కూరుకుపోయిన తరుణంలో రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గిపోయే పరిస్థితి ఉన్నా ప్రభుత్వం కార్పొరేట్లకు లాభం చేకూర్చే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. భారీ పరిశ్రమలు, బడా కంపెనీలకు లాభం చేకూరేలా పారీ పస్సు చార్జీల డాక్యుమెంట్లపై రిజిస్ట్రేషన్ ఫీజుకు భారీ మినహాయింపులు ఇస్తూ శనివారం జీవో 304 జారీ చేసింది. ఇప్పటి వరకు బడా కంపెనీలు తాము తీసుకున్న రుణ మొత్తంపై 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉండేది. రుణం ఎంత ఎక్కువైతే.. ఫీజు కూడా అంత పెరిగేది. కానీ తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై గరిష్టంగా రూ.6 లక్షలు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ రాయితీ మూడేళ్ల పాటు అమల్లో ఉంటుందని జీవోలో స్పష్టం చేసింది. దీంతో రూ.వందల కోట్లు, రూ.వేల కోట్ల రుణాలు తీసుకునే పెద్ద కంపెనీలు భారీగా లాభపడనున్నాయి. ఉదాహరణకు రూ.500 కోట్ల రుణంపై సాధారణంగా రూ.2.5 కోట్ల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటే.. ఇప్పుడు కేవలం రూ.6 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. అంటే ఒక్కో భారీ రుణ ఒప్పందంపైనే ప్రభుత్వం కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతుంది.
రాష్ట్రంలో స్థిరాస్తుల మార్కెట్ విలువలను తరుచూ పెంచుతూ రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీల రూపంలో ప్రజలపై అదనపు భారం మోపుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. కార్పొరేట్ కంపెనీలకు మాత్రం మినహాయింపులు ఇవ్వడం గమనార్హం. చిన్న ఇల్లో, స్థలమో కొనుగోలు చేసే మధ్యతరగతి కుటుంబం రూ.లక్షల్లో రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లిస్తుండగా.. రూ.వేల కోట్ల రుణాలు తీసుకునే కార్పొరేట్ కంపెనీలకు మాత్రం సీలింగ్ పేరుతో ప్రత్యేక రాయితీలు ఇవ్వడం చంద్రబాబు సర్కారు తీరును స్పష్టం చేస్తోంది.


