మెగా ‘డీల్‌’ఎస్సీ..! | Chandrababu Govt Conspiracy On DSC Recruitment | Sakshi
Sakshi News home page

మెగా ‘డీల్‌’ఎస్సీ..!

May 26 2026 3:04 AM | Updated on May 26 2026 3:04 AM

Chandrababu Govt Conspiracy On DSC Recruitment

అడుగడుగునా చంద్రబాబు సర్కారు ద్రోహం

అర్హులైన అభ్యర్థుల భవిష్యత్తుతో దొంగాట  

సెప్టెంబర్‌ 25న అందరికీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు  

అదేరోజు అమరావతిలో సీఎం ఆధ్వర్యంలో వేడుకలు 

అక్టోబర్‌ 3 నుంచి కొత్త టీచర్లకు శిక్షణ ప్రారంభం 

అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు లేకుండానే కొందరు శిక్షణకు హాజరు 

నాలుగు రోజుల తర్వాత విడతల వారీగా నియామక పత్రాలు అందజేత 

తొలుత ఉద్యోగాలకు ఎంపికైనట్టు ప్రకటించి వేడుకలకు రావాలన్న వారిని పక్కనపెట్టిన వైనం  

సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీని చంద్రబాబు సర్కారు.. మెగా అవినీతి డీల్‌గా మార్చేసింది. అభ్యర్థుల బంగారు భవితతో దొంగాట ఆడింది. మెగా డీఎస్సీ–2025లో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. టెట్‌ పరీక్షల నిర్వహణ నుంచి డీఎస్సీ నియామక పత్రాలు ఇచ్చే దాకా అడుగడుగునా జరిగిన లోపాలు బయటపడుతున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన తర్వాత కూడా మరికొందరికి శిక్షణ కేంద్రంలో ఆర్డర్లు ఇచ్చారు. మరోపక్క జిల్లాల్లో సర్టీఫికెట్ల పరిశీలన తర్వాత మీరు ఉద్యోగానికి ఎంపికయ్యారని ప్రకటించిన అభ్యర్థులను సీఎం అధ్యక్షతన అమరావతిలో జరిగే వేడుకకు రావాలని అధికారులు ఫోన్‌ చేసి చెప్పి, తర్వాత మీరు ఎంపిక కాలేదని ప్రకటించారు.

ఇలాంటి చిత్ర విచిత్రాలెన్నో మెగా డీఎస్సీలో చోటు చేసుకున్నాయి. అలాగే, టెట్‌ పూర్తయ్యాక పరీక్ష రాసిన అభ్యర్థుల అందరి మార్కుల డేటా విద్యాశాఖ వద్ద ఉండాలి. కానీ ఈ డేటాను సక్రమంగా నిర్వహించకపోవడంతో ఏపీ టెట్‌లో అభ్యర్థులు సాధించిన మార్కులు ఎన్నో కూడా ప్రభుత్వం వద్ద లేవు. దీంతో మార్కుల సవరణ చేసే అవకాశం కూడా అభ్యర్థులకే అప్పగించారు. మరోవైపు క్రీడా కోటా డీఎస్సీ పోస్టు భర్తీలో పక్కా ప్రణాళిక ప్రకారమే స్కామ్‌లకు పాల్పడ్డారు. తొలి దశలో స్క్రీనింగ్‌ కమిటీ, తుది దశలో రాష్ట్ర స్థాయిలో అత్యున్నత అధికారుల కమిటీ పరిశీలించిన తర్వాత కూడా అనర్హులకు పోస్టులు దక్కడం విస్తుగొలుపుతోంది.   

టెట్‌ మార్కుల సవరణ అభ్యర్థులకే..  
ప్రభుత్వం 16,347 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. నోటిఫికేషన్‌ కంటే ముందే 2024 అక్టోబర్‌ 3 నుంచి 21 వరకు ఏపీ టెట్‌ నిర్వహించారు. అనంతరం సీపీటీ విధానంలో జూన్‌ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు రెండు షిఫ్టుల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. వాస్తవానికి టెట్‌ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో అభ్యర్థులు టెట్‌ పరీక్షలు నిర్వహించినప్పుడల్లా అభ్యర్థులు మార్కులు పెంచుకునేందుకు పరీక్షలు రాస్తారు. ఇందులో ఎక్కువగా వచ్చిన మార్కులనే డీఎస్సీలో పరిగణనలోకి తీసుకుంటారు. 

అయితే, విద్యాశాఖ వద్ద గతంలో నిర్వహించిన టెట్‌ స్కోరు వివరాలు లేకపోవడంతో అభ్యర్థులనే నేరుగా ఆన్‌లైన్‌లో టెట్‌ స్కోరు సవరించుకోవాలని కోరారు. నెలరోజుల్లో దాదాపు నాలుగు సార్లు ఈ అవకాశం ఇవ్వడంతో అభ్యర్థులు టెట్‌ స్కోరు నమోదు చేశారు. అయితే, ఎవరు ఎంత వేశారో లెక్కాపత్రం సర్కారు వద్ద లేకుండా పోయింది. దీంతో చేసేది లేక విద్యాశాఖ వద్ద ఉన్న స్కోరునే పరిగణనలోకి తీసుకుని ఆగస్టు 13న సవరించిన టెట్‌ స్కోరుతో డీఎస్సీ స్కోరు కార్డులు విడుదల చేశారు. దీనిపై ఎన్నో అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోకుండా ఎంపిక లిస్టును ప్రకటించారు. ఈ క్రమంలో చాలామంది అభ్యర్థులు ఉత్తమ స్కోరు సాధించినా ఉద్యోగాలు కోల్పోయారు.

ఎంపికైనవారికి కాదని.. కొత్తవారికి ఆర్డర్లు  
డీఎస్సీలో 16,347 పోస్టులకు 15,941 పోస్టుల భర్తీ చేశారు. సీఎం తొలి సంతకం చేసిన నోటిఫికేషన్‌ కావడంతో గతేడాది సెపె్టంబర్‌ 25న అమరావతిలో నియామకపత్రాల పంపిణీ వేడుక నిర్వహించారు. ఇందుకోసం పోస్టులకు ఎంపికైన అభ్యర్థులతో భారీస్థాయిలో సభ నిర్వహించారు. తొలుత సెపె్టంబర్‌ 19న వేడుకలు నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలకు ఒకరోజు ముందే రావాలని అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు ప్రత్యేకంగా ఫోన్‌ చేసి ఆహ్వానించారు. అయితే, వాతావరణం బాగాలేదని చెప్పి వేడుకలను సెప్టెంబర్ 25కి వాయిదా వేశారు.

అయితే, ఆరురోజుల వ్యవధిలో ఆహ్వానం అందుకున్న పలువురు అభ్యర్థులకు తిరిగి ఫోన్‌ చేసి మీరు పోస్టుకు ఎంపిక కాలేదని, వేడుకలకు రావొద్దని సమాచారం ఇచ్చారు. దీంతో పలవురు అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా 100 మందికిపైగా ఉన్నట్టు అంచనా. ఇంకోవైపు కొత్త టీచర్లకు అక్టోబర్‌ 3వ తేదీ నుంచి 10 రోజుల పాటు జిల్లాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అయితే, ఆగిరిపల్లిలో జరిగిన పీజీటీ, టీజీటీ శిక్షణ కేంద్రంలో నలుగురు అభ్యర్థులకు ఎలాంటి నియామక పత్రాలు లేకుండా ప్రణాళిక ప్రకారం అధికారులు శిక్షణకు పంపించారు.

అదే కేంద్రంలో శిక్షణ ప్రారంభమైన అనంతరం విడతల వారీగా వారికి నియామక పత్రాలు ఇవ్వడం కలకలం రేపింది. ఇలాంటి ఘటనలే పలు జిల్లాల్లో జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. మెరిట్‌లో ఉండి సర్టీఫికెట్ల పరిశీలన అనంతరం పోస్టుకు ఎంపికైనట్టు ప్రకటించిన అభ్యర్థులను తర్వాత ఎంపిక కాలేదని ప్రకటించడం.. ఎలాంటి ఆర్డర్‌ లేకుండానే కొందరిని శిక్షణకు పంపడం.. కొన్నిరోజుల తర్వాత వారికి నియామక పత్రాలు అందించడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

పక్కా ప్రణాళికతో ‘అవినీతి క్రీడ’ 
క్రీడా కోటాలో పోస్టులను భర్తీ చేయడంలో శాప్‌ కీలకంగా వ్యవహరించింది. శాప్‌ పాలక వర్గంలో సీఎం బంధువు, కీలక వ్యక్తి మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించి కథ మొత్తం నడిపించారు. ఇక్కడ, శాప్‌లోని తనకు నచ్చిన అధికారులు, కోచ్‌లను స్క్రీనింగ్‌ కమిటీలో నియ­మించి తాను తలచిందే జరిపించారు. వాస్తవానికి స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ శాప్‌ పరిపాలన అధికారిని పెట్టారు. సదరు అధికారిని డెప్యూటేషన్‌పై శాప్‌లోకి తీసుకొచ్చిందే మాస్టర్‌మైండ్‌. ఆరుగురితో స్క్రీనింగ్‌ కమిటీ వేయాలని ఉత్తర్వులు జారీ చేస్తే శాప్‌లో 8 ప్రత్యేక కమిటీలను పెట్టి ఇష్టారీతిన దరఖాస్తులను స్రూ్కటినీ చేయడం గమనార్హం. 

కమిటీలో స్రూ్కటినీ సమయంలో ఉన్న ఉద్యోగులను చివరి ఫైనల్‌ లిస్టు తయారు చేసే సమయంలో బయటకు పంపిణీ చేయ­డం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. సర్టీఫికెట్ల పరిశీల­నలో కీలకంగా వ్యవహరించిన ఓ డీఎస్‌డీవో ఇప్పుడు శాప్‌ ప్రధాన కార్యాలయంలో కీలక బాధ్యతల్లో కొనసాగుతున్నారు. స్క్రూటినీలో సీనియర్‌ కోచ్‌గా వ్యవహరించిన వ్యక్తి ఓ జిల్లాకు డీఎస్‌డీవో అయ్యా­రు. పేరుకే అసిస్టెంట్‌ డైరెక్టర్‌(టెక్నికల్‌) స్క్రీ­నింగ్‌ కమిటీలో సభ్యుడిగా పెట్టి ఓ కాంట్రాక్టు/అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగితో వ్యవహారం జరిపించేశారు. విచి­త్రం ఏమంటే! ఆడుదాం–ఆంధ్రాపై లేనిపోని ఆరోపణలు చేసి.. శాప్‌లో కీలకంగా వ్యవహరించారంటూ పేర్కొన్న సదరు కాంట్రాక్టు/అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగితోనే డీఎస్సీ డీల్స్‌ చేపట్టడం కొసమెరుపు. అసలు, స్క్రీనింగ్‌ కమిటీలో ఎవరు ఉన్నారు? ఎవరు ఏం చేశారో బయటకు పొక్కకుండా తంతు ముగించేశారు.  

ఫేక్‌ సర్టిఫికెట్లు.. ఫేక్‌ పుట్టిన తేదీలతో పోస్టులా?
ఇక్కడ స్క్రీనింగ్‌ కమిటీ ప్రాథమికంగా మెరిట్‌ జాబితా సిద్ధం చేయాలి. అది ప్రచురించిన తేదీ నుంచి ఏడు రోజుల్లోగా అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు కోరాలి. ఈ ప్రక్రియ ఎక్కడా జరగలేదు. కేవలం తుది మెరిట్‌ జాబితాను సిద్ధం చేసి రాష్ట్ర స్థాయి కమిటీకి పంపేశారు. రాష్ట్ర స్థాయిలో కమిటీలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి(సర్వీసెస్‌/మానవవనరులు), శాప్‌ ఎండీ ఉంటారు. 

సదరు రాష్ట్ర స్థాయి కమిటీ స్క్రీనింగ్‌ కమిటీ ఇచ్చిన నివేదికను సంపూర్ణంగా సమీక్షించాలి. రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదించిందే తుది జాబితా అవుతుంది. ఇందులో సమగ్ర సమీక్ష, పరిశీలనే చేయకపోవడంతోనే డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో ఘోరమైన తప్పి దాలు దొర్లాయి. పోస్టుల భర్తీ సమయంలో అభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులనూ కనీసం పరిగణనలోకి తీసుకోకుండా బుట్టదాఖలు చేయడం ఇందుకు నిదర్శనం. దీనికితోడు ఫేక్‌ సర్టీఫికెట్లు, దొంగ పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో వచ్చిన అభ్యర్థులకు ఉద్యోగాలను అత్యంత హేయంగా అమ్మేసుకోవడం గమనార్హం.

ఈ తప్పులకు ఎవరు బాధ్యులు..
ఫేక్‌ సర్టీఫికెట్లతో క్రీడాకారులను ఆడిస్తున్న క్రీడా సంఘాలపై శాప్‌ ఇటీవల కొరడా ఝుళిపించింది. పోలీసు కేసులు పెట్టి జైలుకు పంపించింది. మరీ, స్పోర్ట్స్‌ కోటాలో తప్పుల తడకగా పోస్టింగులు ఇచ్చి లక్షలాది మంది అభ్యర్థులకు అన్యాయం చేసినందుకు స్క్రీనింగ్‌ కమిటీ, రాష్ట్రస్థాయి కమిటీలను బాధ్యులను చేస్తుందా? అంటూ క్రీడాలోకం ప్రశి్నస్తోంది. విజయనగరం జిల్లాలో దొంగ పుట్టిన తేదీతో క్రీడల్లో పాల్గొన్న వ్యక్తికి ఉద్యోగం కట్టబెట్టిన ఘనటలో క్షేత్రస్థాయిలో ఆధారాలన్నీ స్పష్టంగా ఉంటే శాప్‌ ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

కనీసం, విచారణ ముగిసే వరకు కూడా ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేయాలని పాఠశాల విద్యను కోరకపోవడం గమనార్హం. నకిలీ క్రీడా సర్టీఫికెట్లు మాత్రమే కాకుండా డిగ్రీ అర్హత లేని వ్యక్తులకు ఉద్యోగాలు అమ్మేశారు.  ప్రతిభ గల క్రీడాకారుడికి డిగ్రీ ఉండి.. మెరిట్‌ స్పోర్ట్స్‌ సర్టీఫికెట్‌ ఉంటే వారికి ముందుగా పీఈటీ/పీడీ పోస్టు ఇచ్చి.. పొస్టు పొందిన ఐదేళ్లలోపు బీపీఈడీ కోర్సు పూర్తి చేయాలని నిబంధన పెట్టింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న మాస్టర్‌మైండ్‌ డిగ్రీ లేనివ్యక్తులకు ఫేక్‌ సర్టీఫికెట్లు సృష్టింపజేసి ఉద్యోగాలు అమ్మేశారు.

క్రీడల్లో జాతీయ స్థాయి పతకం సాధించిన ఓ వ్యక్తికి డిగ్రీ లేదు. దీంతో అతను వేరే రాష్ట్రాల్లో డిగ్రీ చదివినట్టు ఫొటోషాప్‌లో పట్టా క్రియేట్‌ చేసి తెచ్చుకుని పీఈటీ/పీడీ పోస్టు కొట్టేశారు. ఇప్పుడు ఆ ఉద్యోగి పశి్చమగోదావరి జిల్లాలో పీడీగా పని చేస్తున్నారు. ఇదిలా ఉంటే అర్హులైన మహిళా అభ్యర్థులతోనూ అసభ్య చాటింగులు చేసి కోరికలు తీర్చాలని మాస్టర్‌మైండ్‌ వేధించినట్టు ఆరోపణలు ఉన్నాయి. తన కోరిక తీర్చకుంటే పోస్టులు రావని బెదిరించినట్టు విమర్శలు వెల్లువెత్తడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement