మరో డైవర్షన్‌ డ్రామా! | Chandrababu Govt Another Diversion politics in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మరో డైవర్షన్‌ డ్రామా!

May 29 2026 4:51 AM | Updated on May 29 2026 12:38 PM

Chandrababu Govt Another Diversion politics in Andhra Pradesh

రెండేళ్ల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయలేని స్థితిలో ప్రభుత్వం  

అసలు మద్యం దోపిడీ బాగోతం టీడీపీదే..

వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తూ మరోసారి మద్యం అక్రమ కేసుకు పదును ఇందుకు ఎల్లో మీడియా వాయిద్య సహకారం 

ఈ కేసులో ఏ1తో సహా అందరికీ ఇప్పటికే బెయిల్‌ మంజూరు 

అభియోగాలకు సరైన ఆధారాలు చూపలేకపోయిన సిట్‌ 

చార్జ్‌షీట్‌ కూడా దాఖలు చేశాక సిట్‌ కుట్రలో పార్ట్‌–2కు శ్రీకారం 

ఈ క్రమంలో తాజాగా కేఎన్‌ఆర్‌కు వేధింపులు 

అసలు మద్యం దోపిడీ డాన్‌ చంద్రబాబే 

గతంలోనే ఆధారాలతో సహా నిగ్గుతేల్చిన సీఐడీ 

కూటమి అధికారంలోకి రాగానే ఆ కేసు క్లోజ్‌  

ఇదీ చంద్రబాబు మార్కు పన్నాగం  

సాక్షి, అమరావతి: చంద్రబాబు తన శకుని మార్కు కుతంత్రాలకు మరోసారి బరితెగించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ రెండేళ్ల అవినీతి, అసమర్థ పాలనపై వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకతతో బెంబేలెత్తుతున్న ఆయన డైవర్షన్‌ రాజకీయాలకు తెరతీశారు. ప్రభుత్వ రెండేళ్ల వైఫల్య, అవినీతి పాలనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా ఉద్యమానికి పిలుపునివ్వడంతో హడలిపోతున్నారు. అందుకే ఇప్పటికే సరైన ఆధారాలులేక మూలనపడేసిన అక్రమ కేసు బూజు దులిపారు. సిట్‌ దర్యాప్తు పేరిట కక్ష సాధింపు రాజకీయాలకు పదునుపెట్టారు. ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచార రాద్ధాంతానికి తెగబడుతున్నారు. తద్వారా.. ప్రభుత్వ అసమర్థ పాలన, అవినీతి బాగోతం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎంతకైనా దిగజారుతానని చంద్రబాబు మరోసారి నిరూపిస్తున్నారు. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్‌ ఆ కుట్రలకు వత్తాసు పలుకుతూ ఖాకీ ధర్మాన్ని విస్మరిస్తూ పచ్చదండు అవతారమెత్తింది. మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్‌ దర్యాప్తు పేరిట రెడ్‌బుక్‌ కుట్ర రెండో అంకానికి తెరతీసిన తీరే ఇందుకు నిదర్శనం.   

ఏ1 సహా అందరికీ బెయిల్‌.. 
మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్‌ తాజా హడావుడి కేవలం రాజకీయ కక్ష సాధింపునకేనని స్పష్టమవుతోంది. ఎందుకంటే.. ఈ కేసులో సిట్‌ ఆరోపణలన్నీ కూడా నిరాధారమని ఇప్పటికే స్పష్టమైంది. పైగా.. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్‌ కేసిరెడ్డితోపాటు సిట్‌ అరెస్టుచేసిన అందరికీ న్యాయస్థానం ఇప్పటికే బెయిల్‌ మంజూరు చేసింది. ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రిటైర్డ్‌ అధికారులు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్‌ కంపెనీ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్పలపై నమోదుచేసిన అభియోగాలకు సిట్‌ ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయింది. రాజకీయ కక్షతోనే వారిని అరెస్టుచేసినట్లు స్పష్టమైంది. దర్యాప్తు పేరిట సిట్‌ ఏడాదిపాటు చేసినదంతా కేవలం రెడ్‌బుక్‌ వేధింపులేనన్నది తేటతెల్లమైంది. ఇక ఈ అక్రమ కేసులో సిట్‌ ఇప్పటికే చార్జ్‌షీట్‌ కూడా దాఖలు చేసింది. దాంతో సాంకేతికంగా దర్యాప్తు ముగిసినట్లేనని.. న్యాయస్థానంలో విచారణ ప్రక్రియ కొనసాగించాలని న్యాయ నిపుణులు వ్యాఖ్యా­నిస్తున్నారు. అయితే, చంద్రబాబు ప్రభు­త్వం మాత్రం ఈ చట్ట నిబంధనలు, న్యాయ ప్రక్రియను బేఖాతరు చేస్తూ రాజకీయ కక్ష సాధింపే తమ లక్ష్యమన్నట్లుగా వ్యవహరిస్తోంది. అందుకే మద్యం విధానంపై అక్రమ కేసులో హఠాత్తుగా మరోసారి దర్యాప్తు పేరిట తమ కుట్రలో రెండో అంకానికి తెరతీసింది.  

విచారణ అనంతరం సిట్‌ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న కేఎన్‌ఆర్‌ 

కేఎన్‌ఆర్‌పై నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారం.. 
ఇక వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం కోసమే ఆ పార్టీ  పొలిటికల్‌ అసిస్టెంట్‌–పీఏ కె. నాగేశ్వరరెడ్డి (కేఎన్‌ఆర్‌)ని ప్రభుత్వం వేధిస్తోంది. కేఎన్‌ఆర్‌కు భారీ ఆస్తులున్నట్లు, అవన్నీ గత ఐదేళ్లలోనే సంపాదించినట్లు సిట్‌ చేస్తున్న దుష్ప్రచారం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి ఆయన సీనియర్‌ జర్నలిస్ట్‌. 2003 లోనే ‘వార్త’ దినపత్రికలో  ఎడిషన్‌ ఇన్‌చార్జ్‌గా పని చేశారు. ఆ సమయంలోనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వచ్చాక ఆ పార్టీకి పని చేస్తున్నారు. తన వ్యాపారాలు చూసుకుంటూనే పార్టీలో పొలిటికల్‌ అపాయింట్‌మెంట్లు చూస్తున్నారు. పార్టీకి నలుగురైదుగురు పీఏలు ఉన్నారు. అయితే కేఎన్‌ఆర్‌ ఒక్కరే పీఏ అన్నట్లు, మద్యం విధానంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు.. డిస్టిలరీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించినట్లు ఎల్లో మీడియా ద్వారా కట్టు కథలను ప్రచారంలోకి తెస్తున్నారు.  ఈ క్రమంలో పాత విషయాలను పట్టుకుని నెలకు కేవలం రూ.10వేలు–రూ.15 వేలతో ఉద్యోగం చేసిన కేఎన్‌ఆర్‌ ఆస్తులు ఎలా కొనుగోలు చేశారని ఈనాడు పత్రిక రాయడం హాస్యాస్పదంగా ఉంది.   తన వ్యాపారాల ద్వారా ఆయన చట్టబద్ధంగానే ఆస్తులు కొనుగోలు చేశారు. ఆ వాస్తవాలను వక్రీకరిస్తూ సిట్‌ అధికారులు ఎల్లో మీడియాకు లీకులు ఇవ్వడం.. కోతికి కొబ్బరికాయ దొరికినట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారంతో రాద్ధాంతం చేయడం ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది.  

అసలు మద్యం దోపిడీ బాగోతం టీడీపీదే..
సిట్‌ పేరుతో చంద్రబాబు చేస్తున్న రాద్ధాంతం చూస్తుంటే దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్లుగా ఉంది. ఎందుకంటే మద్యం విధానం ముసుగులో భారీ దోపిడీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబే. 2014–19లో ఏకంగా రూ.25వేల కోట్ల దోపిడీకి పాల్పడినట్లు సీఐడీ ఆధారాలతో సహా నిగ్గుతేల్చింది. కేబినెట్‌ ఆమోదంలేకుండా రెండు చీకటి జీవోలతో ప్రివిలేజ్‌ ఫీజులను రద్దుచేసి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టింది చంద్రబాబే. టీడీపీ సిండికేట్‌కు 7,884 మద్యం దుకాణాలు ఏకపక్షంగా కేటాయించడంతోపాటు మరో 7,884 పరి్మట్‌ రూమ్‌లు, 48వేల బెల్ట్‌ దుకాణాలతో దోపిడీకి పాల్పడ్డారు. ఎంఆర్‌పీ కంటే 20శాతం అధిక ధరలకు మద్యం విక్రయించి మొత్తంగా రూ.25వేల కోట్లు కొల్లగొట్టారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉండగా వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే లైసెన్సులు మంజూరు చేసింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క డిస్టిలరీకి లైసెన్స్‌ జారీచేయనేలేదు. మద్యం దోపిడీ కేసులో ఏ–1గా చంద్రబాబుతోపాటు ఇతరులను నిందితులుగా చేరుస్తూ సీఐడీ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఆ కేసులో చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారు. అయితే, 2024లో చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఆ కేసు దర్యాప్తును అటకెక్కించింది. అనంతరం అడ్డగోలుగా మూసివేసింది. ఇక 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరోసారి మద్యం దోపిడీకి చంద్రబాబు బరితెగించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలుచేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దుచేసేశారు. ఆ స్థానంలో ప్రైవేటు మద్యం దుకాణాలను ప్రవేశపెట్టి టీడీపీ సిండికేట్‌కు ఏకపక్షంగా కేటాయించారు. ఏకంగా 75వేల బెల్ట్‌ దుకాణాలు తెరచి ఊరూవాడా మద్యం ఏరులై పారిస్తున్నారు. ఎంఆర్‌పీ కంటే 20శాతం అధిక ధరలతో దోపిడీకి పాల్పడుతున్నారు. అంతేకాక.. నకిలీ మద్యం దందా ద్వారా కూడా భారీ దోపిడీకి తెగబడుతున్నారు. ఇలా మద్యం దోపిడీదారైన చంద్రబాబు కక్షపూరితంగా వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేస్తుండడం విడ్డూరంగా ఉంది.  

సోదాల పేరిట వేధింపులు..
ఈ అక్రమ కేసులో సిట్‌ అధికారులు సోదాల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. ఓ వైపు కేఎన్‌ఆర్‌ను వరుసగా రెండోరోజు సిట్‌ కార్యాలయంలో విచారిస్తూనే మరోవైపు ఆయన నివాసంలో సోదాల పేరిట నిబంధనలకు విరుద్ధంగా హంగామా చేశారు. ఆయన ల్యాప్‌టాప్, ఇతర వ్యక్తిగత సామగ్రితోపాటు కొన్ని కాగితాలను స్వా«దీనం చేసుకున్నారు. విదేశాల్లో చదువుతున్న కేఎన్‌ఆర్‌ పెద్ద కుమార్తె ప్రస్తుతం విజయవాడలో ఉన్నారు. ఆమె పాస్‌పోర్ట్, మొబైల్‌ ఫోన్‌ను కూడా స్వా­ధీనం చేసుకున్నారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు ఎంతగా అభ్యంతరం పెట్టినా పోలీసులు కనికరించలేదు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాశ్, న్యాయవాదులు గవాస్కర్, బసవారెడ్డి పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తంచేశారు. కేఎన్‌ఆర్‌ కుమార్తె పాస్‌పోర్ట్, ఫోన్‌ను ఎలా స్వాధీనం చేసుకుంటారని నిలదీయడంతో సిట్‌ అధికారులు వాటిని వెనక్కి ఇచ్చేశారు. మరోవైపు.. వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి నివాసంలో కూడా సిట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన్ని శుక్రవారం విచారణకు రావాలని నోటీసులు జారీచేశారు. కేఎన్‌ఆర్‌ను రాత్రి 9.30 వరకు విచారించిన అనంతరం విడిచిపెట్టారు.    

Advertisement
 
Advertisement
Advertisement