ఈఎన్‌టీ పరికరాల కొనుగోలులో బాబు సర్కార్ మరో అవినీతి బాగోతం
ఒకే పరికరం.. ఇద్దరు బిడ్డర్లు.. ముందస్తు ప్రణాళిక ప్రకారమే స్కెచ్
ఎల్–1 ద్వారా రూ.4.44 కోట్లకు 3 పరికరాల కొనుగోలుకు ఆమోదం
కృత్రిమ పోటీ సృష్టించి ప్రజాధనం లూటీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రులకు వైద్య పరికరాలు, మందులు కొనుగోలు మాటున చంద్రబాబు సర్కారు అవినీతికి పాల్పడుతోంది. తెలంగాణలో రూ.1.04 లక్షలకు సరఫరా చేసిన వ్యాక్యూమ్ ఎక్స్‌ట్రాక్టర్ పరికరాన్ని ఏపీలో రూ.3.13 లక్షలకు కొనుగోలు చేయడంతోపాటు అధిక ధరకు అజిత్రోమైసిన్ మందుల కొనుగోలు చేయడం వంటి అక్రమాలు ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ ఎంఎస్‌ఐడీసీ)లో ఇటీవల కాలంలో వెలుగు చూశాయి. తాజాగా సిమ్యులేటర్ ఫర్ ఇయర్, నోస్ (చెవి, ముక్కు) సర్జరీ పరికరాల కొనుగోలులో మరో కుంభకోణం వెలుగు చూసింది. ఒకే కంపెనీ పరికరాల కోసం టెయిలర్ మేడ్ నిబంధనలు.. వాటి సరఫరా కోసం ఇద్దరు బిడ్‌లు దాఖలు చేయడం ద్వారా కృత్రిమ పోటీ సృష్టించడం రూపంలో ప్రజాధనం లూటీకి తెరలేపారని వైద్య శాఖలో చర్చ నడుస్తోంది.
రూ.39 లక్షల వ్యత్యాసంతో వేర్వేరు బిడ్లు
ఈఎన్‌టీ వైద్య విద్యార్థులు సర్జరీలను నేరుగా రోగులపై కాకుండా వర్చువల్‌గా ప్రాక్టీస్ చేయడం కోసం ఈఎన్‌టీ సిమ్యులేటర్ ఉపయోగపడుతుంది. వీటిని విశాఖపట్నం, ఒంగోలు, విజయవాడ జీజీహెచ్‌లకు సమకూర్చడంతోపాటు భవిష్యత్‌లో సరఫరా కోసం రేట్ కాంట్రాక్ట్ (ఆర్సీ) ఖరారుకు ఏపీ ఎంఎస్‌ఐడీసీ కొద్ది నెలల కిందట టెండర్ పిలిచింది. సాధారణంగా ప్రభుత్వం నిర్వహించే టెండర్లలో వేర్వేరు కంపెనీల మధ్య పోటీ ఉండాలి. అయితే, సిమ్యులేటర్ టెండర్‌లో మాత్రం జర్మనీకి చెందిన వొక్సెల్ మ్యాన్ సైనస్ టెంపోకు చెందిన ఒకే రకం వైద్య పరికరం, సాఫ్ట్‌వేర్ సమకూరుస్తామని రెండు సంస్థలు వేర్వేరుగా టెండర్లు దాఖలు చేశాయి. ఒకే కంపెనీ తయారు చేసిన పరికరాల పేరిట ఓ సంస్థ రూ.4.44 కోట్లు, మరో సంస్థ రూ.4.83 కోట్ల చొప్పున ఒక్కో పరికరాన్ని సరఫరా చేసేలా టెండర్లు వేశాయి.
ఒకే కంపెనీ పరికరాన్ని రెండు సంస్థలు రూ.39 లక్షల వ్యత్యాసంతో బిడ్‌లు వేయడం వెనుక పెద్ద నాటకమే దాగి ఉందని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఒకే కంపెనీకి చెందిన పరికరాన్ని సరఫరా చేస్తామని వేర్వేరు సంస్థలు టెండర్‌లు వేస్తే దాన్ని సింగిల్ బిడ్‌గా పరిగణించి అధికారులు టెండర్ రద్దు చేసి మళ్లీ పిలవాలి. అనూహ్యంగా రూ.4.44 కోట్లతో పరికరాన్ని సమకూరుస్తామన్న పురా సంస్థ ఎల్–1గా నిలిచిందని, ఆ సంస్థ బిడ్‌ను బుధవారం వైద్య శాఖలోని బిడ్ ఫైనలైజేషన్ కమిటీ (బీఎఫ్‌సీ) వెల్లడించింది. ఈ లెక్కన పరిశీలిస్తే ప్రస్తుతం మూడు జీజీహెచ్‌లకు ఈ పరికరాల కొనుగోలు రూపంలో రూ.13.34 కోట్లు, భవిష్యత్‌లో మరికొన్ని ఆస్పత్రులకు సరఫరా రూపంలో మరింత ప్రజాధనాన్ని లూటీ చేయనున్నారు. తక్కువ ధరకే పరికరాలను కొనుగోలు చేస్తున్నామని భ్రమింపజేయడానికి ఎల్–1, ఎల్–2 మధ్య భారీ వ్యత్యాసం ఉండేలా చిత్రీకరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు టెండర్ వేసిన రెండు సంస్థల మధ్య ప్రత్యక్ష సంబంధాలున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి.
అజెండా మార్పించేసిన ఉన్నతాధికారి
టెండర్లకు సంబంధించి బీఎఫ్‌సీలో నిర్ణయాలు తీసుకోవడానికి ముందు మందులు, సర్జికల్స్, పరికరాల ధరలను చాట్ జీపీటీ, జెమ్ పోర్టల్, ఏఐ, ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా కూడా పోల్చాలని, ఆ ధరలను కూడా అజెండాలో పొందుపరచాలని కొద్ది నెలల క్రితం కీలక అధికారి ఏపీ ఎంఎస్‌ఐడీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో బుధవారం నిర్వహించిన బీఎఫ్‌సీ సందర్భంగా ఈఎన్‌టీ సిమ్యులేటర్ల ధరలను చాట్ జీపీటీ, జెమ్ పోర్టల్ వంటి మాధ్యమాల్లో పరిశీలించి రూ.కోటి నుంచి రూ.3 కోట్ల మేర ధర పలుకుతున్నట్టు అధికారులు అజెండాలో పెట్టినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సదరు కీలక అధికారి ‘ఆడిట్‌లో నన్ను ఇరికించాలని చూస్తున్నారా’ అంటూ అధికారులను మందలించినట్టు తెలిసింది. బుధవారం ముగిసిన బీఎఫ్‌సీ సమావేశ అజెండాలో గురువారం మార్పులు చేయించారని విశ్వసనీయ సమాచారం.


