పూలింగ్‌కిచ్చిన కోళ్ల ఫాం భూమి వద్ద రైతు చుండు నర్సిరెడ్డి
రాజధానిలోని వడ్డమానుకు చెందిన ఓ రైతు ఆవేదన
రెండో విడత ల్యాండ్ పూలింగ్‌లో 13 ఎకరాలు ఇచ్చాను.. అందులో రెండు కోళ్ల ఫారాలకు పరిహారం అడిగితే పట్టించుకోవడం లేదు
పదేళ్ల తర్వాత ఇస్తారట.. వాటి కోసం చాలా ఖర్చు చేశాను.. పూలింగ్ కోసం రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు
ప్రభుత్వాన్ని నమ్మినందుకు నట్టేట ముంచుతోంది.. ఈనాం, నిషేధిత భూముల వివరాలు ఆన్‌లైన్‌లో తొలగింపు దారుణం
నా భూమి నాకు వెనక్కిస్తే సాగు చేసుకుంటా
తాడికొండ: ‘రాజధాని కోసం నేను రెండో విడతలో 13 ఎకరాల భూమి పూలింగ్‌కు ఇచ్చాను. అందులో రెండు ఎకరాల్లో కోళ్ల ఫారాలున్నాయి. వాటికి పరిహారం అడిగితే పదేళ్లు పడుతుందని సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ తేజ చెబుతున్నారు. నా జీవనాధారాన్ని పోగొట్టుకుని ఎలా బతకాలి? ఇలాగైతే ఎలా?’ అని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వడ్డమానుకు చెందిన రైతు చుండు నర్సిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని పూలింగ్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందన్నారు. అధికారులు రైతుల గోడు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇటీవల రెండో విడత ప్రారంభించిన పూలింగ్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వంపై నమ్మకంతో తాను 13 ఎకరాలు ఇచ్చానన్నారు. ఇందులో సర్వే నెంబర్ 230/బీ, ఏ లలో 2.02 ఎకరాలలో కోళ్ల ఫారాలు ఉన్నాయని, వాటికి తొలి విడత పూలింగ్‌లో రైతులకు ఇచ్చినట్లే తనకు పరిహారం ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. అడిషనల్ కమిషనర్, ఇతర అధికారులు చెప్పిన మాటలు వింటుంటే బాధగా ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. కోళ్ల ఫారం నిర్మాణం కోసం అప్పట్లో చాలా ఖర్చు చేశానని.. ల్యాండ్ కన్వర్షన్, ఇతర ఫీజులు చెల్లించానని చెప్పారు. అప్పట్లో మరో రెండెకరాల భూమి కొనుగోలు చేసేంత ఖర్చు చేశానన్నారు. కానీ ఇప్పుడు అధికారులు పరిహారం అడిగితే పదేళ్లు పడుతుందని చెప్పడం దారుణం అని అన్నారు.
అయ్యా.. నా భూమి నాకిచ్చేయండి
తన భూమి తనకు తిరిగిస్తే 10 సంవత్సరాల తర్వాతే పూలింగ్‌కు ఇస్తానని రైతు చుండు నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు. ల్యాండ్ పూలింగ్‌ను తాను వ్యతిరేకిస్తున్నానని, కోళ్ల ఫారాలను ఏసీ ఫారాలుగా మార్చుకొంటే తనకు నెలకు రూ.5–6 లక్షల ఆదాయం వస్తుందని చెప్పారు. తన భూమి తనకు ఇప్పించాలన్నారు. దీనిపై తాను జిల్లా కలెక్టర్‌ను కలసి అర్జీ ఇచ్చానని తెలిపారు. ప్రభుత్వాన్ని నమ్మి పొలం ఇస్తే ఇలా నట్టేట ముంచుతారనుకోలేదని మండిపడ్డారు. రాజధానిలో ఈనాం భూములు, నిషేధిత భూములను ఆన్‌లైన్‌లో తొలగించి, ఇతర రైతులను పూలింగ్‌కు ఒప్పించడం కోసం భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. ఆ జాబితాలో తాను ఉన్నానని చెప్పారు. 22ఎ/1సీలో తనకు ఈనాం భూమి ఉందని, తమకు కనీస సమాచారం ఇవ్వకుండా సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు ఆ భూమిని ఆన్‌లైన్‌లో కనిపించకుండా చేశారని, అడిగితే తమకు సంబంధం లేదని, సీసీఎల్‌ఏ అధికారులు చేశారని సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులకు సంబంధం లేకుండా వీరి లాగిన్‌లో వారు ఎలా వచ్చి ట్యాంపరింగ్ చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తన భూమిని తనకిస్తే వ్యాపారమో, వ్యవసాయమో చేసుకుంటానని లేదా ల్యాండ్ కన్వర్షన్ చేసిన రెండెకరాల భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.


