శాంతిభద్రతలు భేష్‌

Central Govt Praises For AP Police Department - Sakshi

ఏపీ పోలీసులకు కేంద్రం ప్రశంసలు

కోర్టులు, ఇతర విభాగాలతో కలిసి బాధితులకు సత్వర న్యాయం

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు

అద్భుతమైన పనితీరుతో సత్తా చాటుతున్నారని కితాబు

మరో జాతీయ పురస్కారం సాధించిన ఏపీ పోలీసులు

ఐసీజేఎస్‌ అమల్లో ద్వితీయ స్థానం కైవసం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ శాంతిభద్రతల పరిరక్షణలోనే కాదు, అద్భుతమైన పనితీరులోనూ సత్తా చాటుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. రాష్ట్ర పోలీసులు సాధిస్తున్న అవార్డులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొంది. ఇంటర్‌ ఆపరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌ (ఐసీజేఎస్‌)కు మిగతా మూల స్తంభాలైన కోర్టులు, జైళ్లు, ఫోరెన్సిక్, తదితర విభాగాలతో కలసి బాధితులకు సత్వర న్యాయం అందేలా ఏపీ పోలీసులు కృషి చేస్తున్నారని, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నారని కేంద్ర హోం శాఖ అభినందించింది.

ఐసీజేఎస్‌ అమలుకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంగళవారం అవార్డులను ప్రకటించింది. ఈ విధానం అమలు,  వినియోగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఏపీ పోలీసు శాఖ జాతీయ స్థాయిలో రెండవ స్థానాన్ని సాధించింది. ఈ అవార్డును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ద్వారా రాష్ట్ర డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ వర్చువల్‌ విధానంలో అందుకున్నారు. మొదటి స్థానంలో మహారాష్ట్ర, మూడవ స్థానంలో తెలంగాణ నిలిచాయి. ఈ అవార్డులకు దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పోటీ పడ్డాయని కిషన్‌రెడ్డి తెలిపారు.

ఐసీజేఎస్‌ అంటే..
క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌లోని అన్ని విభాగాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, సమాచార మార్పిడి, విశ్లేషణలతో ఆన్‌లైన్‌ ద్వారా సమన్వయ పరిచే విధానమే ఇంటర్‌ ఆపరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌ (ఐసీజేఎస్‌). బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. అన్ని విభాగాలూ ఆన్‌లైన్‌లో సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ, వివరాలు ఎప్పటికప్పుడు అందజేస్తుండటంతో కేసుల పరిష్కారానికి పట్టే సమయం గణనీయంగా తగ్గిపోతుంది. ఈ విధానాన్ని ఏపీ పోలీసులు సమర్ధంగా అమలు చేస్తున్నారు. విచారణను వేగవంతంగా పూర్తి చేయడం, అతి తక్కువ సమయంలో చార్జిషీట్లు దాఖలు చేయడం తదితర అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరచడం, సాధించిన పురోగతితో ఏపీ పోలీసు శాఖ జాతీయ స్థాయిలో రెండవ స్థానాన్ని సాధించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ శాంతిభద్రతల పరిరక్షణకు చేస్తున్న కృషికి గాను ఏపీ పోలీసులు జాతీయ స్థాయిలో ‘స్కోచ్‌’ అవార్డులు సాధించడం గమనార్హం. 

సీఎం ప్రోత్సాహంతోనే సాధ్యమవుతోంది: డీజీపీ
జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన అవార్డును దక్కించుకున్న రాష్ట్ర పోలీస్‌ శాఖను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, హోం మంత్రి మేకతోటి సుచరిత అభినందించినట్టు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న పోలీసు శాఖకు అవార్డులు వస్తున్నాయని, సీఎం చొరవ, ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమవుతోందని చెప్పారు. రాష్ట్రంలోని మహిళలు, పిల్లలు, అన్ని వర్గాలకు చెందిన బాధితులందరికీ పారదర్శకత, జవాబుదారీతనంతో సత్వర న్యాయం అందుతోందనడానికి ఈ అవార్డులు నిదర్శనమని డీజీపీ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఇప్పటివరకు వచ్చిన 108 అవార్డులు రాష్ట్ర పోలీస్‌ శాఖ పనితీరును స్పష్టం చేస్తున్నాయన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top