పరిశ్రమలు పప్పు'పప్పు' | Cashew nut production in the state has decreased | Sakshi
Sakshi News home page

పరిశ్రమలు పప్పు'పప్పు'

Apr 11 2026 4:10 AM | Updated on Apr 11 2026 4:10 AM

Cashew nut production in the state has decreased

రాష్ట్రంలో తగ్గిన జీడి గింజల ఉత్పత్తి 

50 శాతం విదేశాల నుంచే దిగుమతి

వాటిపై 9.55 శాతం దిగుమతి సుంకం

భారీగా పెరిగిన పన్ను భారం

సంక్షోభంలో జీడిపప్పు కంపెనీలు  

తుని: దేశ విదేశాల్లో జీడిపప్పుకు ఉన్న డిమాండ్‌ ఇతర ఉత్పత్తులకు ఉండదు. రోజువారీ వంటకాల నుంచి స్టార్‌ హోటళ్లు, విందు భోజనాల్లో జీడిపప్పు ఉండాల్సిందే. అందరికీ పసందు ఇచ్చే జీడిపప్పు తయారీలో రాష్ట్రం కీలకంగా ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విదేశీ దిగుమతులపై 9.55 శాతం సుంకం విధించింది. దీనివల్ల ఏటా రూ.115 కోట్ల మేర పన్ను భారం పడుతోంది. ఇంత మొత్తం పన్ను చెల్లిస్తే జీడిపప్పు తయారీ పరిశ్రమల నిర్వహణ కష్టమని యాజమాన్యాలు అంటున్నాయి. ఇదే పరిస్థితి ఉంటే పరిశ్రమలు మూత పడే ప్రమాదం ఉంది. తద్వారా లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. 

ఇదీ పరిస్థితి 
నెల్లూరు నుంచి పలాస వరకూ 650 జీడిపప్పు తయారీ పరిశ్రమలున్నాయి. వీటిలో ఏడాదికి ప్రాసెస్‌ చేయడానికి 2 లక్షల మెట్రిక్‌ టన్నుల జీడి గింజలు అవసరం. రాష్ట్రంలోని జీడి తోటల నుంచి లక్ష మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తోంది. అంటే 50 శాతం మేర ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం దిగుమతులపై ఎటువంటి సుంకం విధించలేదు. దీంతో, ఇతర దేశాల నుంచి జీడి గింజలను దిగుమతి చేసుకుని పప్పు తయారు చేసేవారు. 

ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం విదేశీ దిగుమతులపై 9.55 శాతం కస్టమ్స్‌ సుంకం విధించింది. దీంతో, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే జీడి గింజలకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో క్వింటా జీడి గింజల ధర రూ.10 వేల వరకు ఉంది. అంటే క్వింటాకు దిగుమతి సుంకం రూపంలో రూ.955 చెల్లించాలి. లక్ష మెట్రిక్‌ టన్నులు దిగుమతి చేసుకోవాలంటే రూ.115 కోట్ల మేర పన్ను రూపంలో చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమల నిర్వహణ సాధ్యం కాదని యజమానులు ఆవేదన చెందుతున్నారు. 

ఈ దేశాల నుంచే దిగుమతులు 
రాష్ట్రంలో జీడిపప్పు తయారీ పరిశ్రమలకు అవసరమైన జీడి గింజలను ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటిలో ఐరిస్‌కోస్ట్, ఘనా, బెనిన్, టాంజానియాతో పాటు ఇండోనేషియా నుంచి లక్ష మెట్రిక్‌ టన్నులు వస్తున్నాయి. ఇదిలా ఉండగా వియత్నాం వంటి ఇతర దేశాలు జీడిపప్పు తయారీ పరిశ్రమలకు రాయితీలు కల్పించడంతో పాటు పన్నుల మినహాయింపు ఇస్తున్నాయి. దీంతో, అంతర్జాతీయ మార్కెట్‌లో తక్కువ ధరకు వారు జీడిపప్పు అందిస్తున్నారని ఏపీ జీడి పప్పు తయారీ పరిశ్రమల అసోసియేషన్‌ అధ్యక్షుడు కుసుమంచి సుబ్బరాయులు తెలిపారు. దీంతో, అంతర్జాతీయ మార్కెట్‌ పోటీలో తట్టుకునే పరిస్థితి తమకు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

తగ్గుతున్న జీడితోటలు 
ఒకప్పుడు రెండెకరాల జీడి తోట ఉంటే చాలు.. కుటుంబ పోషణకు ఢోకా ఉండేది కాదు. అధికారుల లెక్కల ప్రకారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం 30 వేల హెక్టార్లలో జీడి తోటలున్నట్టు అంచనా. పదేళ్ల క్రితం సముద్ర తీర ప్రాంతం, మైదానాలు, కొండ ప్రాంతాల్లో విరివిగా జీడి తోటలుండేవి. పెట్టుబడులు పెరగడం, దిగుబడి తగ్గడంతో రైతులు ఆర్థిక నష్టాలు చవి చూశారు. ప్రభుత్వాల నుంచి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లేకపోవడం సాగు విస్తీర్ణం తగ్గడానికి కారణం. 

మరోవైపు రియల్‌ ఎస్టేట్, వాణిజ్య పంటలు లాభదాయకం కావడంతో పలు ప్రాంతాల్లో జీడి తోటలను తొలగించారు. ప్రస్తుతం మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లోనే జీడితోటలున్నాయి. ఎకరాకు 4 క్వింటాళ్లకు మించి దిగుబడి రావడం లేదు. క్రమేపీ జీడి తోటల సాగుకు స్వస్తి పలికే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానికంగా జీడి పప్పు తయారీ పరిశ్రమలు వందకు పైగా ఉన్నాయి. వీటిలో కేరళకు చెందిన పెద్ద కంపెనీలున్నాయి. స్థానికంగా జీడిగింజల దిగుబడి తగ్గడంతో ఈ పరిశ్రమలు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సరకు పైనే ఆధారపడ్డాయి. 

దిగుమతి సుంకం ఎత్తివేయాలి 
జీడిగింజల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం విధించిన 9.55 శాతం కస్టమ్స్‌ సుంకాన్ని ఎత్తివేయాలి. ఏపీలో 650 జీడిపప్పు తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో లక్షలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. దిగుమతి సుంకం చెల్లించి పరిశ్రమలను నడపడం కష్టం. పన్ను మినహాయింపు ఇవ్వాలని అసోసియేషన్‌ తరపున ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాం.   – కుసుమంచి సుబ్బరాయలు, ఏపీ జీడిపప్పు తయారీ పరిశ్రమల అసోసియేషన్‌ అధ్యక్షుడు, తుని 

విదేశీ మార్కెట్‌లో నిలబడటం కష్టం 
విదేశీ మార్కెట్‌లో పోటీని తట్టుకునే పరిస్ధితి లేదు. జీడి గింజలను దిగుమతి చేసుకుని పన్ను చెల్లించి ప్రాసెసింగ్‌ చేయడానికి క్వింటాకు రూ.14 వేల వరకూ అవుతుంది. 22 కిలోల పప్పు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌ ధర ప్రకారం రూ.12,500 వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో పరిశ్రమలను నడపడం సాధ్యం కాదు.  – డి.మల్లికార్జునరావు, ఏపీ జీడిపప్పు తయారీ పరిశ్రమల అసోసియేషన్‌ కార్యదర్శి, తుని  

Advertisement
 
Advertisement
Advertisement