ఊపిరి తీశారు! | Atrocities at Anantapur General Hospital | Sakshi
Sakshi News home page

ఊపిరి తీశారు!

Jun 1 2026 4:54 AM | Updated on Jun 1 2026 4:54 AM

Atrocities at Anantapur General Hospital

విద్యుత్‌ లేక చీకట్లోనే వెంటిలేటర్‌పై ఉన్న మోహన్‌

అనంతపురం సర్వజనాస్పత్రిలో దారుణం 

శనివారం రాత్రి కరెంట్‌ సరఫరా నిలిచిపోవడంతో వెంటిలేటర్‌పై ఉన్న రోగి మృతి

అనంతపురం: అనంతపురం సర్వజన ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. కరెంటు సరఫరాలో అంతరాయం తలెత్తడం, జనరేటర్‌ సకాలంలో ఆన్‌ చేయకపోవడంతో అత్యవసర విభాగంలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న మోహన్‌ (45) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన మోహన్‌ కొన్ని నెలలుగా పక్షవాతం, మధుమేహం, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం సర్వజన ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యాడు. డాక్టర్లు అత్యవసర విభాగంలో వెంటిలేటర్‌పై ఉంచారు. అయితే శనివారం అర్ధరాత్రి కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. ఆటోమేటిక్‌గా ఆన్‌ అయ్యే జనరేటర్‌ విధానం లేకపోవడంతో వెంటిలేటర్‌పై ఊపిరి అందక తమ కుటుంబ పెద్దదిక్కు కోల్పోయామని మోహన్‌ భార్య జయలక్ష్మి కన్నీటి పర్యంతమైంది. 

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం 
రోగి ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం ఒక ఎత్తయితే.. ప్రభుత్వ నిర్లక్ష్యమూ ఇందు­కు కారణం అవుతోంది. ఆస్పత్రిలో కరెంట్‌ స్తంభా­లు పాతపడిపోయాయి. ఇనుప స్తంభాలు తుప్పు పట్టిపోయాయి. తేలికపాటి గాలి వస్తేనే కూలి­పోతున్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రి ఉన్నతాధికారులు విద్యుత్‌ అధికారులతో సమన్వయం చేసుకోవడంలో వైఫల్యం చెందారు. చిన్నపాటి గాలివానకే కరెంట్‌ స్తంభాలు కిందకు పడిపోయి..విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి రోగుల ప్రాణాలు పోతున్నాయి. మోహన్‌ ఉదంతమే ఇందుకు నిదర్శనం. కాగా...మోహన్‌ అనారోగ్యంతోనే చనిపోయాడని, తమ నిర్లక్ష్యం లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మల్లీశ్వరి తెలిపారు. అతన్ని స్వయంగా పరీక్షించానని,  పెరాలసిస్, షుగర్, కిడ్నీ వ్యాధులు ఉండడంతోనే మృతి చెందాడని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement