జీవో పక్కనపెట్టు.. అనుమతికి డబ్బులు కట్టు | Application Fee Set at Rs 30000 for Extension of Permissions for Degree Colleges Operating in Rented Buildings | Sakshi
Sakshi News home page

జీవో పక్కనపెట్టు.. అనుమతికి డబ్బులు కట్టు

May 9 2026 6:12 AM | Updated on May 9 2026 6:12 AM

Application Fee Set at Rs 30000 for Extension of Permissions for Degree Colleges Operating in Rented Buildings

ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల నుంచి అనుమతి పేరుతో సర్కారు వసూళ్లు  

అద్దె భవనాల్లోని డిగ్రీ కాలేజీల అనుమతి పొడిగింపునకు దరఖాస్తు ఫీజు రూ.30 వేలు

జీవో నంబర్‌ 36కు విరుద్ధంగా ఈవోపీ నోటిఫికేషన్‌ జారీచేసిన చంద్రబాబు ప్రభుత్వం 

30 ఏళ్ల వరకు లీజు భవనంలో కొనసాగేందుకు అనుమతిస్తూ జీవో 36కు సవరణ 

ఇప్పుడు అనుమతుల పేరుతో డబ్బులు దండుకుంటున్న వైనం  

ఈవోపీ ఫీజు చెల్లించడం ఆలస్యమైతే రూ.10 వేల జరిమానా  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. నాలుగు దశాబ్దాల ఉన్నత విద్యామండలి సేవలను నిర్లజ్జగా పాతరేసిన చంద్రబాబు సర్కార్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ఉన్నతవిద్య కమిషనరేట్‌ వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు అనుమతి పొడిగింపు (ఈవోపీ)నకు కోసం దరఖాస్తు చేసుకోవాలని జీవో 36కు విరుద్ధంగా నోటిఫికేషన్లు జారీచేయడం విద్యా వేత్తలను కలవరపెడుతోంది. పైగా అద్దె భవనాల్లోని కళాశాలలను మరోచోటుకు మార్చడానికి, యాజమాన్య బదిలీకి కూడా అనుమతులు ఇస్తుండటం విద్యారంగంలో అనిశి్చతిని పెంచనుంది.  

జీవోలో లేని ఈవోపీకి రూ.30 వేలా? 
ప్రస్తుతం అద్దె/లీజు భవనాల్లో నడుస్తున్న ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు ఈవోపీ కోసం రూ.30 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దరఖాస్తు ఆలస్యం అయితే ఏకంగా రూ.10 వేల జరిమానా విధిస్తోంది. రాష్ట్రంలో 600కు పైగా డిగ్రీ కాలేజీలు అద్దె భవనాల్లో లీజు ప్రాతిపదికనే నడుస్తున్నాయి. ఉన్నత విద్యాశాఖ జీవో 36 (15–7–2021) ప్రకారం అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రైవేటు కళాశాలలు తాత్కాలికంగా ఐదేళ్లు అనుమతి పొందవచ్చు. ప్రత్యేక సందర్భాల్లో దీన్ని పదేళ్ల వరకు పొడిగించుకోవచ్చు. పదేళ్లు దాటితే సొంత భవనంలోనే కళాశాల నిర్వహించాలి.

లేకపోతే ప్రభుత్వం ఈవోపీ ఇవ్వకుండా కళాశాలను మూసేస్తుంది. అయితే గత ప్రభుత్వం ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం లీజు గడువును 30 ఏళ్లకు ప్రతిపాదించింది. ఎన్నికలు రావడంతో జీవో సవరణ ఆలస్యమైంది. చంద్రబాబు ప్రభుత్వం రాగానే జీవో నంబర్‌ 36ను సవరిస్తూ 2024 జూలై 10న జీవో 20 జారీచేసింది. అందులో జీవో 36లోని ఈవోపీ నిబంధనల్లో ఐదేళ్ల తర్వాత అనుమతి పునరుద్ధరణ, గరిష్టం పదేళ్లు మాత్రమే అద్దె భవనాల్లో కళాశాలల నిర్వహణ అంశాలను తొలగించింది. విద్యాసొసైటీలు 30 ఏళ్ల వరకు లీజు భవనంలో ఉంటే దాన్ని సొంత భవనంగానే పరిగణించాలని సవరణ చేసింది.

అంటే జీవో 36లో సవరణ తర్వాత కేవలం లీజు ప్రాతిపదికన ప్రైవేటు కళాశాలలు 30 ఏళ్ల వరకు ఈవోపీ అవసరం లేకుండానే నిర్వహించుకోవచ్చని స్పష్టంగా ఉంది. ఒకవేళ కళాశాలలకు దీర్ఘకాలిక లీజు పత్రం ఇచ్చేందుకు వాస్తవ యజమానులు అంగీకరించకపోతే ఐదారుసార్లు లీజు గడువు పొడిగించుకునే వెసులుబాటు ఉంటుంది. అంతేగానీ జీవో 36ను కేవలం సొసైటీలకు పరిమితం చేసి మిగిలిన వాటిల్లో పదేళ్లులోపు లీజు భవనాల్లో కొనసాగుతున్న కళాశాలలు రూ.30 వేలు చెల్లించి ఈవోపీ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.  

వసూళ్ల కోసం నిబంధనలకు పాతర  
చంద్రబాబు పాలనలో ఉన్నత విద్యాశాఖ అనుమతుల పేరుతో ప్రైవేటు విద్యాసంస్థల నుంచి వసూళ్ల పర్వం సాగిస్తోంది. కాసులే పరమావధిగా విచ్చలవిడిగా అనుమ­తులు మంజూరు చేస్తోంది. తాజాగా లీజు భవనాల్లో న­డుస్తున్న ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలకు ప­దే­ళ్లు దాటని వాటికి రూ.20 వేలు ఫీజు కడితే యాజమాన్య బదిలీకి అనుమతి ఇచ్చేస్తోంది. అంటే ప్రభుత్వమే జీవో 36కు విరుద్ధంగా పదేళ్లలోపు అద్దె భవనాల్లో నడుస్తున్న కళాశాలలు ఈవోపీ తీసుకోవాలని చెబుతూనే.. పదేళ్లలోపు వాటికి యాజమాన్య హక్కుల బదిలీకి అవకాశం ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది.

ఉదాహరణకు ఒక కాలేజీ తొమ్మిదేళ్లుగా లీజు భవనంలో ఒకరి ఆధ్వర్యంలో కొనసాగుతున్నప్పుడు చివరి ఏడాది యాజమాన్యం మారితే.. మరో పదేళ్ల వరకు అద్దె భవనంలోనే కొనసాగేలా వెసులుబాటును కల్పిస్తున్నట్లేనని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. ఇక్కడ జీవో 36 సవరణను గాలికొదిలేసిన ప్రభుత్వం.. పదేళ్ల లీజు అంశంపై తమ అనుకూల కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందిపడకూడదని వారికి మేలు చేసేందుకు యాజమాన్య బదిలీని తెరపైకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే లీజులో కొనసాగుతున్న కళాశాలలను అదే మండల పరిధిలోని వేరే ప్రాంతానికి తరలించడానికి సైతం రూ.30 వేలు చెల్లిస్తే రూట్‌ క్లియర్‌ చేస్తోంది. అంటే ఒక మండలంలోని కళాశాలలన్నీ ఒకేచోటుకు చేరితే విద్యాసంస్థల మధ్య ఆరోగ్యకర పోటీ సన్నగిల్లుతుందని మేధావి వర్గం ఆందోళన చెందుతోంది.  

ఏటా రూ.కోట్ల దందా  
చంద్రబాబు సర్కార్‌ ఫీజు బకాయిలతో ఉన్నత విద్యారంగం ఆర్థికంగా దెబ్బతింది. ఒకవైపు ప్రైవేటు కళాశాలలను అప్పుల ఊబిలోకి నెడుతూనే మరోవైపు అనుమతుల పేరుతో ఏటా రూ.కోట్లు దండుకునే ప్రణాళిక వేసింది. ఫీజులు పెంచాలని ప్రైవేటు యాజమాన్యాలు ఎంత మొత్తుకున్నా పట్టించుకోని ప్రభుత్వం.. అనుమతులు పొందేందుకు షెడ్యూల్స్‌ ఇచ్చి మరీ హుకుం జారీచేస్తోంది. ఆలస్యమైతే ఏకంగా రూ.10 వేల జరిమానా వసూలు చేస్తోంది.

ఈవోపీకే మే 15 వరకు గడువు తీసుకుంటే అఫ్లియేషన్లు, ప్రవేశాలు ఎప్పుడు నిర్వహిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ఉన్నతవిద్యలో ప్రవేశాలకు సంబంధించి సాంకేతిక సేవలకు ఏజెన్సీనే ఎంపిక చేయలేదంటే.. ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి స్పష్టమవుతోంది. కాగా,  లీజు భవనాల్లో నిర్వహిస్తున్న కళాశాలలను యాజమాన్యాల కోరిక మేరు వేరొక ప్రాంతానికి తరలించడం హైకోర్టు తీర్పునకు విరుద్ధమని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement