‘అనంత’లో 3 ఎంఎస్‌ఎంఈ పార్క్‌లు 

APIIC is developing MSME parks Small scale industries Andhra Pradesh - Sakshi

కోటిపి, రాప్తాడు,కప్పలబండలో ఏర్పాటు 

రూ.18.11 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఏపీఐఐసీ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న, సూక్ష్మ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా మూడు ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. అనంతపురం జిల్లా కోటిపి, రాప్తాడు, కప్పలబండలో ఈ పార్కులను అభివృద్ధి చేయడానికి ఏపీఐఐసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం మొత్తం రూ.18.11 కోట్లు వ్యయం చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. రూ.7.46 కోట్లతో కోటిపి ఎంఎస్‌ఎంఈ పార్కు, రూ.4.83 కోట్లతో రాప్తాడు పార్కు, రూ.5.82 కోట్లతో కప్పలబండ పార్క్‌లను అభివృద్ధి చేయనున్నారు.

ఒక్కొక్కటి సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కులలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తారు. ఇందులో ఇప్పటికే కోటిపి పార్కులో అంతర్గత, బహిర్గత రహదారులు, వరద.. మురుగు నీటి కాల్వలు, వీధి దీపాలు, నీటి సరఫరా వంటి కీలకమైన మౌలిక వసతులను కల్పించడానికి రూ.7.46 కోట్ల విలువైన పనులకు ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. రాప్తాడు, కప్పలబండల ఎంఎస్‌ఎంఈ పార్కుల  నిర్మాణానికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవనుంది. 

ఎంఎస్‌ఎంఈ రంగానికి పెద్ద పీట 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంఎస్‌ఎంఈ రంగానికి పెద్ద పీట వేస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్‌ సంక్షోభ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ఆదుకునేందుకు రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద ఇప్పటి వరకు రూ.2,086.42 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసింది. ఇందులో రూ.1,588 కోట్లు గత ప్రభుత్వ హయాంకు చెందినవి కావడం గమనార్హం. తద్వారా రాష్ట్రంలో సుమారు 98,000 కుపైగా ఎంఎస్‌ఎంఈల్లో పని చేస్తున్న 12 లక్షల మంది ఉపాధికి భరోసా కల్పించినట్లయ్యింది.

ఇదే సమయంలో వివిధ జిల్లాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. నెల్లూరు జిల్లాలో రూ.30 కోట్లతో 173.67 ఎకరాల్లో ప్లాస్టిక్, ఫర్నిచర్‌ పార్కు, చిత్తూరు జిల్లా గంధరాజుపల్లిలో ఎంఎస్‌ఎంఈ క్లస్టర్‌ పనులను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్‌ఈ–సీడీపీ కింద రూ.61 కోట్లతో ఐదు ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top