AP Minister Mekapati Goutham Reddy Died With Heart Attack In Hyderabad - Sakshi
Sakshi News home page

Mekapati Goutham Reddy: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణం

Feb 21 2022 9:25 AM | Updated on Feb 21 2022 9:30 PM

AP Minister Mekapati Goutham Reddy Died Due To Heart Attack - Sakshi

మంత్రి గౌతమ్‌ రెడ్డి భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి
►మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి భౌతిక కాయానికి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కొడాలి నాని, వలభనేని వంశీ, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ నివాళులు అర్పించారు. గౌతమ్‌ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.

అధికార లాంఛనాలతో మంత్రి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు
► మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్థానికులు, కార్యకర్తలు గౌతమ్‌రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. గౌతమ్‌ రెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని నివాసానికి తరలించారు. సోమవారం రాత్రికి స్వగ్రామం బ్రహ్మణపల్లికి తరలించనున్నారు. అమెరికాలోఉన్న కుమారుడు వచ్చాక బుధవారం అధికార లాంఛనాలతో గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 9.16 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఉదయం 7.45 నిమిషాలకు అపోలో అసుపత్రికి చేరుకోగా.. 90 నిమిషాల పాటు వైద్యులు గౌతమ్‌రెడ్డికి ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించారు. అయినా ప్రాణాలు దక్కలేదు. దీంతో కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వైద్యులు సమాచారం అందించారు. 

కాగా పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి. 1971 నవంబర్‌2న జన్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలతో గౌతమ్‌ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. నెల్లూరు జిల్లా అత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. రెండుసార్లు ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు.
చదవండి: మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం 

అయితే మేకపాటి వారం రోజులపాటు దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో  సంప్రదింపులు జరిపి కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొని ఆదివారమే హైదరాబాద్‌ చేరుకున్నారు. 

గత నెల 22న కోవిడ్‌ బారిన పడి కోలుకున్నారు. అయితే సోమవారం ఉదయం గుండె పోటు రావడంతో అపోలో ఆ‍స్పత్రిలో చేర్చి అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. గౌతమ్‌రెడ్డి మరణ వార్త విన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. హైదరాబాద్‌కు బయల్దేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement