వాట్సాప్‌ డీపీలతోఉద్యమ వేడి | AP JAC Amaravati stages innovative protest via digital platform | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ డీపీలతోఉద్యమ వేడి

Sep 2 2026 5:13 AM | Updated on Sep 2 2026 5:13 AM

AP JAC Amaravati stages innovative protest via digital platform

ఉద్యోగుల వాట్సాప్‌ డీపీ ఇది

సోషల్‌ మీడియాలో హోరెత్తిన ఉద్యోగుల నిరసన 

డిజిటల్‌ వేదికగా ఏపీ జేఏసీ అమరావతి వినూత్న ఆందోళన

సీఎం గారూ మా బకాయిలివ్వండి అంటూ రాష్ట్రవ్యాప్తంగా ఫోన్లలో ఉద్యోగుల ప్రొఫైల్‌ పిక్చర్లు 

సర్కారు తీరుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు 

పీఆర్‌సీ, ఐఆర్, పెండింగ్‌ డీఏలు, రూ.40 వేల కోట్ల బకాయిల విడుదలకు డిమాండ్‌ 

సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్దీకరణపై నిర్ణయం తీసుకోవాలని పోరుబాట 

సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అల్టిమేటం

సాక్షి, అమరావతి: న్యాయమైన సమస్యల పరిష్కా­రం.. వెంటనే పీఆర్‌సీతోపాటు డీఏలు, ఐఆర్, పెండింగ్‌ బకాయిల విడుదల డిమాండ్‌తో చంద్రబాబు సర్కారుపై సమరశంఖం పూరించిన ఉద్యోగుల ఆందోళన కొత్త రూపం తీసుకుంది. ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో సోషల్‌ మీడియా వేదికగా వినూత్నంగా నిరసనలు తెలిపారు. ‘సీఎం సార్‌..! మా డబ్బులు మాకు ఇవ్వండి’ అనే నినాదంతో ఉద్యోగులు వాట్సాప్‌ డీపీలతో హోరెత్తించారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు తమ మొబైల్‌ ఫోన్లలో పెట్టుకున్న డీపీలతో ఉద్యోగుల ఉద్యమం డిజిటల్‌ ఉద్యమంగా మారింది. ఎవరి ఫోన్‌లో చూసినా అదే డీపీ కనిపించింది. ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజర­య్యా­రు. 

ఉద్యో­గులు, ఉపాధ్యాయు­లు, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. గ్రామ సచివాల­యా­లు మొదలు ప్రభుత్వ పాఠ­శాలలు, మండల స్థాయిలో తహశీల్దార్‌ కార్యాలయాలు, మున్సిపల్‌ కార్యాల­యాలు, వెటర్నరీ ఉద్యోగులు, అన్ని ఆర్టీసీ డిపోలు, వివిధ కార్యాలయాల ఉద్యోగులు, డివిజన్‌ స్థాయిలో ఆర్‌డీఓ కార్యాలయాల ఉద్యోగులు, కార్మిక, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ ఉద్యోగులు, జిల్లా స్థాయిలో అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలు, వివిధ శాఖల కార్యాలయాల ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వర్తించారు. సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్ధీకరణపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

ప్రభుత్వానికి గట్టిగా వినిపించాం.. 
ఉద్యమంలో భాగంగా ఒకటో తేదీ నుంచి 5వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని ఏపీ జేఏసీ ఇచ్చిన పిలుపు విజయవంతమైందని ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు తెలి­పారు. తమ డబ్బులు తమకు ఇవ్వా­లని వాట్సాప్‌ స్టేటస్‌­­లు పెట్టుకుని ఉద్యోగులు తమ డిమా­ండ్‌ను ప్రభుత్వానికి గట్టిగా వినిపించారన్నారు. 2 నుంచి 8వ ­తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా, డివిజన్‌ కార్యాలయాలను ఏపీ జేఏసీ నాయకులు సందర్శించి ప్రతి ఉద్యోగిని కలసి ఉద్యమానికి కారణాలను వివరించి విస్తృత ప్రచారం చేపట్టి చేయి చేయి కలిపే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. 

3, 5వ తేదీల్లో అన్ని జిల్లా, డివిజన్‌ కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. 11వ తేదీన విజయవాడతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించి అన్ని ట్రేడ్‌ యూనియన్లు, ఉద్యోగ సంఘాలను ఆహ్వానించి ఉద్యోగుల సమస్యలపై మద్దతు కూడగడతామని ప్రకటించారు. 

                                              రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీచర్ల నిరసన 

ఐక్యంగా కదిలిరావాలి 
పీఆర్సీ, డీఏలు, ఐఆర్, రూ.40 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుంటే కొందరు నాయకులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారని పలువురు ఉద్యోగులు మండిపడ్డారు. అలాంటి వారి తీరు వల్లే రిటైర్డ్‌ ఉద్యోగులకు అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ పునరుద్ధరించలేకపోయామని, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు పెంచలేకపోయామని, వారికి సంక్షేమ పథకాలు అమలు చేసేలా చేయలేకపోయామని ఏపీ జేఏసీ అమరావతి నేతలు మండిపడ్డారు. 

గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినా కనీ­సం చర్చలకు సైతం పిలవకపోవడంతో ఏపీ జేఏసీ అమరావతి శ్రీకాకుళం, అనంతపురంలో ఉద్యమ సన్నద్ధ సభలను ప్రకటించిందని తెలి­పారు. దీంతో సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని జూలై 22వ తేదీన అన్ని సంఘాలతో చర్చలు జరిపిందన్నారు. కానీ చర్చలు జరిపినా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా గత 40 రోజులుగా ప్రభు­త్వం కాలయాపన చేయడంతో ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించినట్లు తెలిపారు. 

తమకు రావాల్సిన న్యాయమైన బకాయిలు, హక్కుల సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో ఉద్యోగులంతా స్వచ్ఛందంగా భాగస్వాము­లై సంఘాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement