AP: నేటి నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

AP Inter Advanced Supplementary Starts From 15th September 2021 - Sakshi

విద్యార్థుల మార్కుల శాతం పెంచుకునేందుకు అవకాశం 

జిల్లాలో 142 కేంద్రాలు ఏర్పాటు 

హాజరుకానున్న 1,13,538 మంది విద్యార్థులు 

కేంద్రాల్లో పక్కాగా కోవిడ్‌ నిబంధనలు  

మచిలీపట్నం: ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు అంతా సిద్ధమైంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు మొదటి, రెండో సంవత్సరం కలిపి జిల్లాలో 1,13,538 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరి కోసం 142 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, రెండో సంవత్సరం వారికి మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గంటల వరకు టైం టేబుల్‌ మేరకు ప్రతి రోజూ పరీక్ష ఉంటుంది. నేడు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష పేపర్ -1కి 2వ సెట్ ప్రశ్న పత్రాన్ని లాటరీ ద్వారా ఎంపిక చేశారు.

బుధవారం నుంచి 23 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకి హల్ టిక్కెట్స్  4 లక్షల మంది విద్యార్ధులు డౌన్ లోడ్ చేసుకున్నారు. కోవిడ్ కారణంగా ఈ ఏడాది జులైలో జరగాల్సిన ఇంటర్ పరీక్షలు సుప్రీంకోర్టు ఆదేశాల నేపద్యంలో రద్దు అయిన విషయం తెలిసిందే. ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాలపై అసంతృప్తి ఉన్న విద్యార్దులెవరైనా ఈ సప్లిమెంటరీ పరీక్షలకి హాజరుకావచ్చు.

రేపు(గురువారం) ఇంగ్లీష్, 17న మేథమెటిక్స్- A, బోటనీ, సివిక్స్ పేపర్లు, 18న మేథమెటిక్స్-B, జువాలజీ, హిస్టరీ పరీక్షలు, 20 న ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు, 21 న కెమిస్ట్రీ, కామర్స్, సోషయాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పరీక్షలు, 22న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్స్ మేద్స్, 23వ తేదీన మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ పరీక్షలు, ఈ నెల 27 న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, 28న ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద  కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్ధులు మాస్కులు ధరించి పరీక్షలకి హాజరుకావాల్సి ఉంటుంది. నిమిషం నిబందనని అమలు చేయడం లేదని అధికారులు పేర్కొన్నారు.

అనివార్య కారణాల వల్ల పరీక్షా కేంద్రాలకి ఆలస్యంగా హాజరైనా విద్యార్ధులని అనుమతించాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద థర్మల్ స్కానింగ్ ద్వారా తనిఖీలు చేయనున్నారు. పరీక్షల నిర్వహణకి ప్రతీ జిల్లాకి ఒక కోవిడ్ ప్రోటోకాల్ అధికారిని నియామించారు. పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్ధుల సౌకర్యార్ధం టోల్ ఫ్రీ నంవర్ 18002749868 ఏర్పాటు చేశారు. వాట్సప్ ద్వారా ఫిర్యాదుకి 9391282578 నంబర్‌ని అధికారులు అందుబాటులో ఉంచారు.

ఈ పరీక్ష ఎందుకంటే.. 
కోవిడ్‌ కారణంగా పరీక్షలు రద్దు చేసి, అంతా కనీస మార్కులతో ఉత్తీర్ణులైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్‌ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారి మార్కుల శాతాన్ని పెంచుకునేందుకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పేరిట మరో అవకాశం ఇచ్చింది. దీంతో పరీక్షల నిర్వహణపై ఇంటర్మీడియెట్‌ బోర్డు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పరీక్షలకు సంబంధించిన మెటీరియల్, ఓఎంఆర్‌ షీట్స్, నామినల్‌ రోల్స్‌ షీట్స్, డీ–ఫామ్స్‌ను ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు పంపించారు. జంబ్లింగ్‌ విధానంలోనే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా తనిఖీ బృందాలను పర్యవేక్షణకు ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో హైపవర్‌ కమిటీ కూడా కేంద్రాలను తనిఖీ చేయనుంది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.  

కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలి.. 
ఇంటర్‌ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9గంటలకు ప్రారంభమవుతాయి. అయితే నిమిషం లేటు అయినా పరీక్షలకు విద్యార్థులను అనుమతించరు. పరీక్షకు అరగంట ముందుగానే ఉదయం 8.30లకు కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించనున్నారు. ఇదే రీతిన సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులను మధ్యాహ్నం 2 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షలు ముగిసేంత వరకూ కేంద్రాల్లో వైద్య సిబ్బందితో శిబిరాలు నిర్వహిస్తారు. 

కట్టుదిట్టంగా కోవిడ్‌ నిబంధనలు.. 
పరీక్షా కేంద్రాల్లో కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చేయాలని కలెక్టర్‌ నివాస్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడు ప్రతి ఒక్క విద్యారి్థనీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలని సూచించారు. ప్రతి కేంద్రంలోనూ ప్రత్యేకంగా ఐసోలేషన్‌ గది ఏర్పాటు చేశారు. కోవిడ్‌ అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ఆ గదిలో కూర్చొబెట్టి పరీక్ష రాయించనున్నారు.

ఏర్పాట్లు పూర్తి చేశాం.. 
కోవిడ్‌ నిబంధనల మేరకు ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులకు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించి రావాలి. కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌కు తావులేకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరిగేలా నిర్వాహకులు శ్రద్ధ తీసుకోవాలి.
– పెదపూడి రవికుమార్, ఆర్‌ఐఓ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top